‘క్యాంపు విహారం’లో అపశ్రుతి
ఘట్కేసర్/ఘట్కేసర్ టౌన్/ గుత్తి: ‘క్యాంపు విహారయాత్ర’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎంపీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న మినీబస్సు బోల్తాపడడంతో 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఈ నెల 4వ తేదీన ఘట్కేసర్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్కు చెందిన 18 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు వారి కుటుంబీకులను కొందరు సోమవారం రాత్రి అనంతపురం పుట్టపర్తికి విహారయాత్రకు తీసుకెళ్లారు.
అర్ధరాత్రి గుత్తి శివారులోని ఓ హోటల్ వద్ద బస చేశారు. మంగళవారం ఉదయం అక్కడే టిఫిన్ చేసి ప్రయాణమయ్యారు. బస్సు అతివేగంగా వెళుతూ అదుపు తప్పింది. మిడుతూరు - రామరాజుపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎంపీటీసీ సభ్యుడు మంకం రవి, మేడిపల్లి ఎంపీటీసీ స్వరూప భర్త సుభాష్నాయక్, వెంకటాపూర్ ఎంపీటీసీ కల్పన భర్త బుర్ర వెంకటేష్, చెంగిచెర్ల ఎంపీటీసీ బింగి భాగ్యమ్మ భర్త జంగయ్య, బోడుప్పల్ ఎంపీటీసీ జంగమ్మ భర్త నత్తి మైసయ్య, పీర్జాదిగూడ ఎంపీటీసీ మానస భర్త బృందాకర్ తదితరులు స్వల్పంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు ఓ అద్దె వాహనంలో వెనక్కి తిరిగి వెళ్లారు. సంఘటన స్థలాన్ని గుత్తి, పామిడి, పెద్దవడుగూరు పోలీసులు పరిశీలించారు. పెద్దవడుగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.