Campus Ampasayya
-
మరికొన్ని భాషల్లోకి ‘క్యాంపస్ అంపశయ్య’
హన్మకొండ చౌరస్తా : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ రాసిన నవలా ఆధారంగా నిర్మించిన ‘క్యాంపస్ అంపశయ్య’ చిత్రాన్ని త్వరలో తమిళం, మళయాళం, హిందీ, ఆంగ్లభాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ తెలిపారు. ఈ మేరకు అంపశయ్య నవీన్‌తో కలిసి సినీ యూనిట్ బృందం సభ్యులు బుధవారం హన్మకొండలోని శ్రీదేవి ఏషియన్మా ల్లో సినిమాను తిలకించారు. అంతకు ముందు డైరెక్టర్ ప్రభాకర్ జైనీ విలేకరులతో మాట్లాడారు. గత నెల 30న విడుదలైన క్యాంపస్ అంపశయ్య చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. తెలంగాణలోని నర్సాపూర్ అడవులు, రుస్తుంపేట గ్రామం, రామ ప్ప, ఉస్మానియా క్యాంపస్ తదితర ప్రాంతాల్లో అనేక వ్యయ ప్రయాసాలకోర్చి చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. ప్రజలు సినిమాను ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. అంపశయ్య నవీన్ మాట్లాడుతూ అమెరికాలో సైతం ఈ చిత్రం విడు దలైందన్నారు. క్యాంపస్ అంపశయ్య సినిమాలో హీరో, హీరోయిన్ల నటన ఆకట్టుకుంటుందన్నారు. వారి వెంట హీరో శ్యామ్‌కుమార్, హీరోయిన్ పావని, విజయలక్ష్మి జైనీ, ఉప్పుల సంతోష్ పాల్గొన్నారు. -
చాయ్ 10పైసలు.. భోజనం రూపాయ్!
నిజమే.. చాయ్ పది పైసలు మాత్రమే. ఒక్క రూపాయి పెడితే కడుపు నిండుతుంది. మార్లిన్ మన్రో మ్యాగజైన్ మూడు రూపాయలు. ఇది 1969లో ముచ్చట. కానీ, చేతిలో ఐదు రూపాయలు లేని ఓ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఏం చేశాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘క్యాంపస్-అంపశయ్య’. శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. విజయలక్ష్మి జైని నిర్మాత. ఓ ప్రధాన పాత్రలో నటిస్తూ, ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ప్రభాకర్ జైని మాట్లాడుతూ - ‘‘1965- 70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది. నవలలోని ఆత్మను సంఘటనల రూపంలో ఆవిష్కరించడానికి మూడేళ్లు పట్టింది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఆకెళ్ల రాఘవేంద్ర, స్వాతీ నాయుడు తదితరులు నటించి న ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్. -
ఆ నవల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు!
- రచయిత ‘అంపశయ్య’ నవీన్ తెలుగు సాహితీ చరిత్రలో ‘అంపశయ్య’ ఓ సంచలనం. 1969లో వచ్చిన ఈ నవలతో రచయిత నవీన్ ఇంటిపేరు ‘అంపశయ్య’గా మారిపోయింది. ఈ నవలకు తెర రూపమే ‘క్యాంపస్ అంపశయ్య’. ప్రభాకర్ జైని నటించి, దర్శకత్వం వహించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్‌కుమార్, పావని కీలక పాత్రల్లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించి, హిందీలోకి అనువ దించారు. సోమవారం ఈ చిత్రం హిందీ పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అంపశయ్య’ నవీన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చాలా మంది జీవితాలకు గమ్యంగా మారింది. ఈ నవల వచ్చి 47 ఏళ్లయినా దీని ప్రభావం ఇంకా తగ్గలేదు. మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ- ‘‘క్యాంపస్‌లో చదివే ప్రతి విద్యార్థి అంపశయ్య స్టేజ్ నుంచి దాటి వచ్చినవాడే. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. -
నాలుగు భాషల్లో...
ప్రముఖ రచయిత నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన చిత్రం ‘క్యాంపస్ అంపశయ్య’. శ్యామ్ కుమార్, పావని జంటగా ప్రభాకర్ జైని ప్రధాన పాత్రలో జైని క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవరాయ ఫిలిమ్స్‌పై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మానవ విలువలు, మానసిక సంఘర్షణలున్న చిత్రమిది. అన్ని భాషల వారికి సరిపోయే కథ కావడంతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. చదువు కోసం ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చే కుర్రాడి జీవితంలో ఒక రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి సంఘటనలు జరిగాయన్నదే కథ. 1970ల కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమేరా: రవికుమార్ నీర్ల.