శ్రీనగర్ నిట్ తరలించేది లేదు!
న్యూఢిల్లీ:
శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు కొందరు, తమ క్యాంపస్‌లో భద్రతను పటిష్టం చేయాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఎన్ఐటీ ప్రాంగణాన్ని మరోచోటికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే క్యాంపస్‌ను మరోచోటికి తరలించడానికి స్మృతి ఇరానీ అంగీకరించలేదని ఓ విద్యార్థి తెలిపాడు. కొద్ది రోజులుగా నిట్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
టీ-20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో శ్రీనగర్ నిట్‌లో కశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తాయి. టీమిండియా ఓడిపోగానే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల, పాక్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ గొడవలు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.