Canada Company
-
క్యాండీస్ తినటమే పని.. జీతం రూ.61 లక్షలు!
ఒట్టావా: ఒళ్లు వంచి రోజంతా కష్టపడినా జీతం అంతంతమాత్రమేనని చాలా మంది బాధపడుతుంటారు. అయితే.. తినటమే పనిగా ఉంటే.. దానికి లక్షల్లో జీతం వస్తే.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదా? అవునండీ.. అలాంటి ఉద్యోగాలూ ఉన్నాయి. ఓ ఛాక్లెట్ల తయారీ సంస్థ ‘చీఫ్ క్యాండీ టేస్టర్’ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాండీలు(మిఠాయిలు, ఛాక్లెట్లు) తినటమే ఆ ఉద్యోగం. జీతం కూడా భారీగానే ఇస్తోంది. ఏడాదికి రూ.61 లక్షలు మరి. క్యాండీలు అంటే ఇష్టపడే వారు వెంటనే ఈ ఆఫర్‌ను ఒడిసిపట్టండి మరి. కెనడాకు చెందిన క్యాండీ ఫన్‌హౌస్ అనే ఆన్లైన్ రిటైలర్ సంస్థ ఛాక్లెట్స్ నుంచి వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తోంది. చీఫ్ క్యాండీ ఆఫీసర్‌ను నియమించుకోవాలని భావిస్తోంది. అందుకు 1,00,000 కెనెడియన్ డాలర్లు(సుమారు రూ.61.14 లక్షలు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను గత జులైలో లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది సంస్థ. తల్లిదండ్రుల అనుమతితో 5 సంవత్సరాల వయసు పైబడిన వారంతా ఈ ఉద్యోగానికి పోటీ పడొచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. భారీస్థాయిలో దరఖాస్తులు వస్తాయని తాము ఊహించలేదని సీఈఓ జమిల్ హెజాజి పేర్కొన్నారు. ఒక చీఫ్ క్యాండీ ఆఫీసర్‌గా నెలకి 3,500 పీసులు తినాలి. రోజుకు 117 అన్న మాట. అయితే.. అవి చాలా ఎక్కువని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ ఉద్యోగానికి పెద్ద వారితో పాటు చిన్న పిల్లలు సైతం దరఖాస్తులు పంపించారు. తమ పిల్లలు దరఖాస్తు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తల్లిదండ్రులు. Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists. Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6 — Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022 ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
హైదరాబాద్‌లో వాంకూవర్ ఫిల్మ్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సరికొత్త ఫిల్మ్‌స్కూల్ ఏర్పాటు కాబోతోంది. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ రంగాల్లో అగ్రగామి అయిన వాంకూవర్ ఫిల్మ్ స్కూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అతి త్వరలో హైదరాబాద్ సమీపంలో శాటిలైట్ క్యాంపస్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఇమేజ్ పాలసీలో పేర్కొన్నట్లు రాష్టంలో గేమింగ్ రంగాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో ఓ సంస్థ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రయత్నం ఈ ఒప్పందం ద్వారా నెరవేరనుంది. శుక్రవారం కెనడా ఇంటర్నేషనల్ ట్రేడ్ శాఖ మంత్రి ఫ్రానొయ్స్ ఫిలిప్ చాంపాజిన్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఒప్పందం కుదుర్చుకున్నారు. గేమింగ్, యానిమేషన్‌ను ప్రాధాన్య రంగంగా గుర్తించామని, ప్రస్తుత ఒప్పందం ద్వారా యువతలో నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ తోడవుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రపంచ స్థాయి బ్రాండ్లకు యానిమేషన్, వీఎఫ్ఎక్స్ రంగాల్లో సేవలు అందించేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం కార్యక్రమాలను కెనడా బృందానికి కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీలోని కీలక అంశాలను తెలిపారు. కెనడా నుంచి వచ్చే పెట్టుబడులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తమ దేశంలోని పెట్టుబడిదారులకు ఇక్కడి పాలసీలపై వివరించేందుకు కెనడా పర్యటించాల్సిందిగా ఆ దేశ మంత్రి ఆహ్వానించారు. టీ–హబ్‌లో పర్యటించిన తమకు తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు, అవిష్కరణలు, ఇన్నోవేషన్ రంగం పట్ల ఉన్న నిబద్ధత అర్థమవుతోందని పేర్కొన్నారు. -
తెలంగాణలో ‘చైర్ ఫాక్స్’ పెట్టుబడులు
* సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ లుక్ * ముందుకొచ్చిన కెనడా కంపెనీ.. సీఎం కేసీఆర్‌తో భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా కెనడాకు చెందిన చైర్ ఫాక్స్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చైర్ఫాక్స్కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. మంగళవారం కంపెనీ చైర్మన్ ప్రేమ్వాస్త నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలుసుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎంతో కాసేపు ముచ్చటించింది. భారతదేశంలో వివిధ రంగాల అభివృద్ధికి తమ కంపెనీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించింది. తెలంగాణలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చనే విషయంపై కంపెనీ ప్రతినిధులు సీఎంను సంప్రదించారు. హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన స్కై వేలు, రోడ్డు సపరేటర్ల ప్లాన్‌ను సీఎం వివరిస్తూ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైందని సీఎం చెప్పారు. రహదారుల అభివృద్ధి, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని కంపెనీ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ భౌగోళిక వాతావరణ పరిస్థితులు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని సీఎం విశ్లేషించారు. సమావేశంలో ఛైర్ ఫాక్స్ ఎండీ మాధవన్ మీనన్, డెరైక్టర్ అథప్పన్, వినోద్, లీ సంస్థ ఎండీ డాక్టర్ ఫణిరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.