సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సరికొత్త ఫిల్మ్‌స్కూల్ ఏర్పాటు కాబోతోంది. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ రంగాల్లో అగ్రగామి అయిన వాంకూవర్ ఫిల్మ్ స్కూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అతి త్వరలో హైదరాబాద్ సమీపంలో శాటిలైట్ క్యాంపస్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఇమేజ్ పాలసీలో పేర్కొన్నట్లు రాష్టంలో గేమింగ్ రంగాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో ఓ సంస్థ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రయత్నం ఈ ఒప్పందం ద్వారా నెరవేరనుంది. శుక్రవారం కెనడా ఇంటర్నేషనల్ ట్రేడ్ శాఖ మంత్రి ఫ్రానొయ్స్ ఫిలిప్ చాంపాజిన్‌తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఒప్పందం కుదుర్చుకున్నారు.
గేమింగ్, యానిమేషన్‌ను ప్రాధాన్య రంగంగా గుర్తించామని, ప్రస్తుత ఒప్పందం ద్వారా యువతలో నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ తోడవుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రపంచ స్థాయి బ్రాండ్లకు యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ రంగాల్లో సేవలు అందించేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం కార్యక్రమాలను కెనడా బృందానికి కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీలోని కీలక అంశాలను తెలిపారు.
కెనడా నుంచి వచ్చే పెట్టుబడులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తమ దేశంలోని పెట్టుబడిదారులకు ఇక్కడి పాలసీలపై వివరించేందుకు కెనడా పర్యటించాల్సిందిగా ఆ దేశ మంత్రి ఆహ్వానించారు. టీ–హబ్‌లో పర్యటించిన తమకు తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు, అవిష్కరణలు, ఇన్నోవేషన్ రంగం పట్ల ఉన్న నిబద్ధత అర్థమవుతోందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాంకూవర్ ఫిల్మ్ స్కూల్
Published Sat, Nov 18 2017 3:12 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment