తెలంగాణలో ‘చైర్ ఫాక్స్’ పెట్టుబడులు
* సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ లుక్
* ముందుకొచ్చిన కెనడా కంపెనీ.. సీఎం కేసీఆర్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా కెనడాకు చెందిన చైర్ ఫాక్స్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చైర్‌ఫాక్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. మంగళవారం కంపెనీ చైర్మన్ ప్రేమ్‌వాస్త నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలుసుకుంది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎంతో కాసేపు ముచ్చటించింది. భారతదేశంలో వివిధ రంగాల అభివృద్ధికి తమ కంపెనీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించింది.
తెలంగాణలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చనే విషయంపై కంపెనీ ప్రతినిధులు సీఎంను సంప్రదించారు. హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన స్కై వేలు, రోడ్డు సపరేటర్ల ప్లాన్‌ను సీఎం వివరిస్తూ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైందని సీఎం చెప్పారు. రహదారుల అభివృద్ధి, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
హైదరాబాద్ భౌగోళిక వాతావరణ పరిస్థితులు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని సీఎం విశ్లేషించారు. సమావేశంలో ఛైర్ ఫాక్స్ ఎండీ మాధవన్ మీనన్, డెరైక్టర్ అథప్పన్, వినోద్, లీ సంస్థ ఎండీ డాక్టర్ ఫణిరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.