ఇక ‘డ్రా’నందమే!
వరుసగా మూడో రోజు ఆట రద్దు
భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇక ఎంతమాత్రం ఫలితం వచ్చే అవకాశాలు లేవు. కేవలం తొలి రోజు ఆట మాత్రమే సాధ్యమైన ఈ మ్యాచ్‌లో వరుసగా మూడో రోజు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో నాలుగో రోజు మంగళవారం కూడా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా మైదానం పూర్తి చిత్తడిగా మారింది. ఉదయం వర్షం పడకపోవడంతో మ్యాచ్‌పై కాస్త ఆశలు రేకెత్తాయి. అంపైర్లు కూడా మూడు సార్లు మైదానాన్ని పరిశీలించారు. ముందుగా లంచ్ సమయం వరకు వాయిదా వేసినా పిచ్ ఆటకు అనుకూలంగా లేకపోవడంతో పాటు చిరు జల్లులు కూడా కురుస్తుండడంతో రద్దుకే మొగ్గుచూపారు. అయితే ఆటవిడుపుగా భారత ఆటగాళ్లు కొద్దిసేపు మైదానంలో ఫుట్‌బాల్ ఆడారు. చివరి రోజు బుధవారం పరిస్థితి అనుకూలిస్తే ఉదయం 9.15 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు ప్రొటీస్ 214 పరుగులకు ఆలౌట్ కాగా... భారత్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
‘రహానే మెరుపు ఫీల్డింగ్ వెనుక కఠోర శ్రమ’
ప్రస్తుతం స్లిప్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తుండడంతో పాటు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా అజింక్యా రహానే ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నైపుణ్యం వెనుక కఠోర శ్రమ దాగి ఉందని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తెలిపారు. ‘రహానే అద్భు త స్లిప్ ఫీల్డర్‌గా ఎదుగుతున్నాడు. దీనికోసం తను విపరీతంగా కష్టపడ్డాడు. కొన్ని వందల క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాడు. బ్యాట్స్‌మన్ నుంచి వచ్చే బంతిని సరిగ్గా అంచనా వేయగలిగి దానికి తగ్గట్టు స్పందిస్తున్నాడు’ అని శ్రీధర్ అన్నారు.