cancer control
-
క్యాన్సర్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గుంటూరు మెడికల్: క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఏడాదిలో రూ.600 కోట్లు క్యాన్సర్ చికిత్సల కోసం ఖర్చు చేసిందన్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో శుక్రవారం జరిగిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్ రాష్ట్రస్థాయి వార్షిక తొలి సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాధునిక క్యాన్సర్ వైద్యసేవలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో గత ప్రభుత్వంలో 990 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చారని వివరించారు. ముఖ్యమంత్రికి క్యాన్సర్ నియంత్రణకై ప్రత్యేకదృష్టి ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ పథకంలో 638 ప్రొసీజర్లు కేవలం క్యాన్సర్ వ్యాధులకు చెందినవే అందుబాటులో ఉంచారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. ఇతర కళాశాలల్లో సైతం రెండోదశలో క్యాన్సర్ చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలులో రూ.120 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రూ.55 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కడపలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్‌ను క్యాన్సర్ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా మార్చేందుకు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక క్యాన్సర్ చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నాట్కో ట్రస్టు వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేదలకు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.వి.శివరామకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉమేష్‌శెట్టి, డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, యడ్లపాటి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్
సాక్షి, నేషనల్ డెస్క్: క్యాన్సర్ ప్రాణాంతక రోగమని, మొదట్లోనే గుర్తించకుంటే బతకడం కష్టమని అందరికీ తెలుసు. కొన్నిసార్లు వ్యాధిని గుర్తించేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. కొన్నిరకాల క్యాన్సర్లను కనిపెట్టేందుకు పరీక్షలు కూడా లేవు. అయితే ఒకే ఒక రక్తపరీక్షతో చాలారకాల క్యాన్సర్లను ఇట్టే కనిపెట్టేయొచ్చంటే? హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కదా. సరిగ్గా అలాంటి మల్టీ క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) రక్తపరీక్షను సైంటిస్టులు కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించగలగడం ఇందులో పెద్ద విశేషం. ఊపిరి పీల్చుకోదగ్గ విషయం కూడా! ఒకరకంగా ఎంసీఈడీ పరీక్షను వైద్యశాస్త్రంలో, ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కొత్త విధానాలను కనుగొనేందుకు కృషి చేస్తున్న గ్రెయిల్ అనే హెల్త్ కేర్ సంస్థ ఈ సరికొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. వీళ్లంతా 50, అంతకన్నా ఎక్కువ వయసు వ్యక్తులే కావడం గమనార్హం. ప్యారిస్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ (ఈస్‌ఎంఓ) కాంగ్రెస్‌లో గ్రెయిల్ తమ పరిశోధన వివరాలను సమర్పించింది. ఆరువేల పై చిలుకు మందిపై పరీక్ష నిర్వహిస్తే వారిలో దాదాపు ఒక శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీటిలో కొన్ని ఇప్పటిదాకా పరీక్షలకు దొరకని క్యాన్సర్ రకాలు కూడా ఉండటం విశేషం. దీన్ని క్యాన్సర్ పరిశోధనలను సమూలంగా మార్చివేసే పరీక్ష విధానంగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అయిన గాలెరీ (ఎంసీఈడీ–ఈ)ని మరింతగా ఆధునీకరించి వ్యాధిని మరింత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు. గాలెరీ పరీక్ష ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుంది. వాటిలో లక్షణాలు కనపడని క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంసీఈడీ పరీక్ష పద్ధతిలో దాదాపు రెట్టింపు స్థాయిలో క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే వీలుంది. గాలెరీ పరీక్ష ద్వారానే కాలేయం, చిన్న పేగు, యుటెరస్, పాంక్రియాటిక్ స్టేజ్–2, బోన్ క్యాన్సర్ వంటివాటిని లక్షణాలు లేని స్థాయిలోనే గుర్తించే వీలుంది. అయితే కొత్త పద్ధతి మరిన్ని రకాల క్యాన్సర్లను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. కొత్త పరీక్ష (ఎంసీఈడీ)లో 92 మందిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించారు. పైగా 97 శాతం కచ్చితత్వముంది. ఇలా గుర్తించిన 36 రకాల క్యాన్సర్లలో 71 శాతం క్యాన్సర్లను నిర్ధారించే అవకాశం ఇప్పటిదాకా ఉండేది కాదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్సా విధానంలో కూడా పెను మార్పులు రానున్నాయి. అయితే ఇది క్లినికల్‌గా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్ -
ఎంఎన్‌జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి
► నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయ ► మాసబ్‌ట్యాంక్ సమీపంలో ఐదెకరాల్లో విస్తరణకు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న కేన్సర్ నియంత్రణకుగాను వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక మెహిదీ నవాజ్ జంగ్(ఎంఎన్‌జే) కేన్సర్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచాలని, దానికి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. నిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్ల అది కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్స్‌లాగే ఎంఎన్‌జేను కూడా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. స్వయంప్రతిపత్తి వల్ల ఆసుపత్రి డెరైక్టర్ అధికారాల మేరకు అవసరమైనప్పుడు పోస్టులను భర్తీ చేసుకోవచ్చు. వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పెత్తనం పోతుంది. యూనివర్సిటీలాగా దీన్ని తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది. ఆంకాలజీలో ఎండీ, ఎంఎస్ కోర్సులను ప్రత్యేకంగా నెలకొల్పుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి సొంత కోర్సులకూ రూపకల్పన చేసుకోవచ్చు. కేన్సర్‌పై ప్రత్యేక పరిశోధనాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదెకరాల్లో విస్తరణ.. ఎంఎన్‌జే ఆసుపత్రి విస్తరణ కోసం మాసబ్‌ట్యాంక్ పరిధిలోని ఐటీఐ, నర్సింగ్ కాలేజీల కు చెందిన ఐదెకరాల స్థలాన్ని దానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో ప్రత్యేకంగా పది బ్లాక్‌లను నిర్మిస్తారు. అం దులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయిస్తారు. కేన్సర్ వైద్య విద్య కోసం మరో బ్లాక్ ఉంటుంది. అత్యాధునిక వైద్య విద్య తరగతి గదులనూ నిర్మిస్తారు. ఎంఎన్‌జేకు రాష్ట్ర బడ్జెట్లో రూ.28 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. స్వయంప్రతిపత్తి వస్తే రూ.50 కోట్ల బడ్జెట్ పెరిగే అవకాశముంది. కేంద్రం నుంచి ప్రతీ ఏడాది రూ.70 కోట్ల మేరకు గ్రాంట్లు విడుదలవుతాయి. పడకల సంఖ్య 250 నుంచి 500 పెంచుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మరోవైపు 100 వైద్య, ఇతర పారామెడికల్ పోస్టులు మం జూరు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ కేన్సర్ కేంద్రంగా, రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు కీలకంగా ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రోజూ 500 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్షమంది రోగులు ఫాలోఅప్ వైద్యానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వయంప్రతిపత్తి, విస్తరణ వల్ల ఎంఎన్‌జే స్వరూపమే మారిపోతుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ జయలత ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.