గుంటూరు మెడికల్: క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఏడాదిలో రూ.600 కోట్లు క్యాన్సర్ చికిత్సల కోసం ఖర్చు చేసిందన్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్‌సీజీ) ఏపీ చాప్టర్ రాష్ట్రస్థాయి వార్షిక తొలి సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాధునిక క్యాన్సర్ వైద్యసేవలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో గత ప్రభుత్వంలో 990 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలందరికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చారని వివరించారు. ముఖ్యమంత్రికి క్యాన్సర్ నియంత్రణకై ప్రత్యేకదృష్టి ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ పథకంలో 638 ప్రొసీజర్లు కేవలం క్యాన్సర్ వ్యాధులకు చెందినవే అందుబాటులో ఉంచారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందన్నారు.
ఇతర కళాశాలల్లో సైతం రెండోదశలో క్యాన్సర్ చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలులో రూ.120 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో రూ.55 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కడపలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్‌ను క్యాన్సర్ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా మార్చేందుకు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు.
ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక క్యాన్సర్ చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నాట్కో ట్రస్టు వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేదలకు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు, మందులు అందిస్తున్నట్లు చెప్పారు.
నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.వి.శివరామకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉమేష్‌శెట్టి, డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, యడ్లపాటి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment