బాక్సుల్లో భవితవ్యం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ తొలి అసెంబ్లీ పట్టాభిషేకానికి జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగగా కొత్త రాష్ట్రంలో తొలి చట్టసభ సభ్యులయ్యేందుకు అభ్యర్థులు సర్వశక్తులొడ్డారు. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నమోదు చేయగా... ఈ నెల 16న కౌంటింగ్ జరిగే వరకూ అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లోనే భద్రంగా ఉండనుంది.
సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. ఏ నియోజకవర్గంలో చూసినా... ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే చర్చే సాగుతోంది. జిల్లాలోని రెండు లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా... దాదాపు అన్నిచోట్లా త్రిముఖ, చతుర్ముఖ పోటీలే. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ పోలింగ్ సరళిని ఎవరికి వారే తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు.
జిల్లాలో అత్యధిక స్థానాలు తమవే అంటూ ఢంకా భజాయిస్తున్నారు. ఎక్కడెక్కడ విజయావకాశాలున్నాయనే అంశంపై లెక్కలు కడుతున్నారు. బయటకు ధీమాగా ఉన్నా... లోలోపల మాత్రం అన్ని పార్టీల అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. వీళ్లంతా తమ అదృష్టాన్ని తలుచుకుంటూ మే 16న కౌంటింగ్ జరిగి, ఫలితాలు వెలువడేవరకూ నిరీక్షించక తప్పదు.
పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. జిల్లాలో మొత్తం 3419 పోలింగ్ కేంద్రాల్లో 20492 ఈవీఎంలను వినియోగించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో ముందస్తు జాగ్రత్తగా రిటర్నింగ్ అధికారుల వద్ద ఉంచిన యంత్రాలు ఉపయోగించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈ యంత్రాలను పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా వేర్వేరు చోట్ల భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారితోపాటు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో గదులకు తాళాలు వేసి సీలు వేశారు. మే 16న అందరి సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూంలను తెరిచి ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు.
బాక్సులను భద్రపరిచింది ఇక్కడే
కరీంనగర్ ఎంపీ - కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి - ఎస్సారార్ డిగ్రీ కళాశాల
పెద్దపల్లి ఎంపీ - పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి - అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల
నిజామాబాద్ ఎంపీ కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఈవీఎంలను సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల