ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నిరకాల ఎత్తులో!
ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ఎన్నోరకాల ఎత్తులు వేస్తుంటారు. ఎన్నికల సంఘం దృష్టిలో పడకుండా ఉండేందుకు అనేక రకాల పద్దతులను అనుసరిస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా తప్పుడు మార్గాలలో ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తుంటారు. పోలీస్ వ్యవస్థ నిఘాని పెంచడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. కుక్క తోక ఎంత వంచినా వంకర వంకరే అన్నట్లు ఎంత నిఘా పెంచినా ఈ రకమైన రాజకీయ నాయకుల బుద్ది మాత్రం మారదు.
ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఎన్నికల సంఘం తమిళనాడులో బాగా నిఘా పెంచింది. దాంతో కొన్ని రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని టీ కొట్లు, కిరాణా కొట్ల యజమానుల ద్వారా స్థానిక ఓటర్లకు వల వేస్తున్నాయి. ఆయా పార్టీలకు అనుకూలమైన కొట్ల యజమానుల ద్వారా పరిచయస్తులైన ఓటర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. వారి ద్వారా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఇదంతా స్థానిక పరిచయాల ద్వారా జరిగిపోతుంది. అందువల్ల ఈసీ నిఘాకు ఇవి చిక్కడం లేదు.
ఇదిలా ఉండగా, ఓటర్లు ఓటు స్లిప్పులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారు ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? లేక డబ్బు కోసమా? అనే అర్థం కావడం లేదని స్థానిక ఎన్నికల అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తమిళనాడులోని తిరుమంగళం శాసనసభ పరిధిలో ఓ పార్టీ 2009 ఎన్నికల్లో ఓటుకు నగదు పేరుతో కొత్త పద్ధతికి తెరలేపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదుగురు లేదా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఇంటికి ఆవులు, గొర్రెలను కూడా పంపిణీ చేసింది. అభ్యర్థులు అధికారం కోసం ఎన్నిరకాల ఎత్తులైనా వేస్తారు. ఓటర్లను ప్రలోభ పెడుతుంటారు. ఓటర్లలోనే మార్పు రావలసిన అవసరం ఉంది. ఓటర్లలో మార్పు వచ్చిననాడే వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.