బాబూ.. మా గోడు పట్టదా?
విజయవాడలో అగ్రిగోల్డ్ బాధిత మహిళల ధర్నా
సాక్షి, అమరావతి: ఆడపడు చులకు పెద్దన్నగా ఉంటానని గొప్పలు చెప్పిన చంద్రబాబూ.. మా గోడు పట్టదా అంటూ అగ్రిగోల్డ్ బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే అగ్రిగోల్డ్ యాజ మాన్యంతో కుమ్మక్కైనట్టుగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఈ నెల 21లోగా అసెంబ్లీలో చర్చించి తమకు న్యాయం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అగ్రిగోల్డ్ బాధిత మహిళలు ఆదివారం విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్‌కు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన దగాకు ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపోతున్నా సీఎం చంద్రబాబు కనికరం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో ఏపీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, కోశాధికారి ఈవీ నాయుడు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
ఇద్దరు అగ్రిగోల్డ్ మార్కెటింగ్ డైరెక్టర్ల అరెస్ట్
31 వరకు రిమాండ్.. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలింపు
నెల్లూరు (క్రైమ్): అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఇద్దరు మార్కెటింగ్ డైరెక్టర్లను ఆదివారం నెల్లూరు సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ డిపాజిట్‌దారుల్ని మోసగించిన కేసులో 18వ, 19వ నిందితులైన వీరవెంకటబాబూరావు, కిశోర్‌లను అరెస్ట్‌చేసి నెల్లూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులకు ఈనెల 31వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు.
అవ్వా వెంకటరామారావు చైర్మన్‌గా 1995లో ఏర్పాటైన అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 19 లక్షల మంది నుంచి రూ.2,250 కోట్లు సేకరించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేటల్లో ఆఫీస్‌లను ఏర్పాటు చేసి 11 వేలమంది ఏజెంట్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల మంది నుంచి రూ.264 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. అనంతరం బాధితులకు చెల్లింపులను నిలిపేసి బోర్డు తిప్పేసింది.