Cannabis gang
-
మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం
నర్సీపట్నం (విశాఖపట్నం): నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. వెనుక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళ్తూ అడ్డొచ్చిన .. ప్రతి దానిని గుద్దుకుంటూ అలజడి రేకెత్తించారు. ఘటన వివరాలిలాఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన సిద్ధూ, ఇఫ్రాన్, రోహిత్ చింతపల్లిలో 240 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. మహారాష్ట్ర తీసుకెళ్లేందుకు కారులో నర్సీపట్నం వైపు వస్తుండగా.. డౌనూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అపేందుకు ప్రయత్నించగా తప్పించుకుని వచ్చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సీపట్నం ట్రాఫిక్ ఎస్ఐకు కారులో వస్తున్న గంజాయి స్మగ్లర్ల సమాచారం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబిద్‌సెంటర్ వద్ద పోలీసులు స్మగ్లర్ల కారును ఆపేందుకు ప్రయత్నించగా వృద్ధురాలికి డాష్ ఇచ్చి వేగంగా దూసుకెళ్లారు. శ్రీకన్య సెంటర్లో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ ఆపే ప్రయత్నం చేయగా.. బారికేడ్లను గుద్దుకుని వెళ్లిపోయారు. వెంటనే ఎస్ఐ ద్విచక్రవాహనంపైన, పోలీసు వాహనంతో సిబ్బంది గంజాయి కారును వెంబడించారు. గంజాయి స్మగ్లర్లు కారుతో ఎలా పడితే అలా దూసుకొస్తుండడంతో వాహనదారులు, ప్రజలు హడలెత్తిపోయారు. స్మగ్లర్ల వాహనం, పోలీసు వాహనం ఒకదాని వెనుక మరొకటి వేగంగా దూసుకెళ్తుండడంతో సినిమా సీన్‌ను తలపించింది. కాగా, దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు పెదబొడ్డేపల్లి వంతెన సమీపంలో కారును ఆపి వంతెన కింద ఉన్న కాలువలోకి దూకేశారు. దీంతో స్థానికులు, పోలీసులు వారిని చుట్టుముట్టారు. కాలువలోంచి ముగ్గురు స్మగ్లర్లను బయటకు రప్పించి స్టేషన్‌కు తరలించారు. -
మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి
సాక్షి,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం విస్తరిస్తోందని ఎసిపి గౌస్‌భాష పేర్కొన్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, హాజీపూర్, శ్రీరాంపూర్లలో గంజాయి వినియోగం జోరుగా కొనసాగుతుంది. తాజాగా హాజీపూర్ మండలం రాపల్లిలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎసిపి గౌస్‌భాష వెల్లడించారు. విచారణలో భాగంగా మరికొంత మంది గంజాయికి బానిసలు అవుతున్నట్లు తెలుసుకొని మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన గౌస్‌భాష మరోసారి గంజాయి జోలికి పోకూడదంటూ ప్రమాణం చేయించారు. కాగా, వారం క్రితమే మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయికి బానిసలుగా మారిన 39 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో డిసిపి రక్షిత్ కె మూర్తి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
గంజాయి స్మగ్లర్ల పరార్
సాక్షి, వరంగల్ : టాస్క్‌ఫోర్స్ పోలీసులు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని బుధవారం రాత్రి సుమారు 12.30 గంటలకు సుబేదారి పోలీసులకు అప్పగించారు. కస్టడీలోకి తీసుకున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందికి నిందితులను అప్పచెప్పారు. తీరా గురువారం ఉదయం స్మగ్లర్లను తీసుకురమ్మని అధికారులు అదేశించగా నిందితులు కనబడటం లేదనే సమాధానం రావడంతో నివ్వెరపోవడం వారి వంతైంది. 24 గంటల పాటు కాపలా.. పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది.. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందనే ఆలోచనతో ప్రతీ క్షణం పరిసరాల నిశిత పరిశీల న.. ఇక కస్టడీలోకి తీసుకున్న నిందితుల విషయమైతే మరీ అప్రమత్తత.. ఇదంతా పోలీసుస్టేషన్లలో సర్వసాధారణంగా ఉండే పరిస్థితి.. కానీ పోలీసు కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న సుబేదారి పోలీసు స్టేషన్‌కు కస్టడీ కోసం తీసుకొచ్చిన ఇద్దరు నిందితులు పోలీసుల కళ్లు కప్పి పారిపోవడం సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసుస్టేషన్లలో భద్రతకు సంబంధించి డొల్లతనం బయటపడినట్లయింది. అంతేకాకుండా అధికారుల పనితీరుకు ఈ ఘటన అద్దం పడుతోందని.. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపాన్ని ఎత్తిచూపుతోందని భావిస్తున్నారు. అసలేం జరిగింది? సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని జులైవాడలో బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని విక్రయించటానికి సిద్ధంగా ఉన్న వర్ధన్నపేటకు చెందిన కుమార్, వీర్ పట్టుబడగా అదుపులోకి తీసుకోవడంతో వారి నుంచి సుమారు 80 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను సుబేదారి పోలీసులకు రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో అప్పగించారు. కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందికి నిందితులను అప్పగించారు. అయితే, గురువారం ఉదయం విధుల్లోకి వచ్చిన అధికారులు రాత్రి కస్టడీలోకి తీసుకున్న నిందితుల(గంజాయి స్మగ్లర్లు)ను తీసుకురమ్మని అదేశించగా సిబ్బంది తెల్లమొహం వేశారు. నిందితులు కనబడటం లేదనే సమాధానం రావడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఆఘమేఘాల మీద రాత్రి నుంచి తెల్లవారువరకు జరిగిన విషయాలను సుబేదారి పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఈక్రమంలో నిందితులు పరారైన విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగోలా గురువారం మధ్యాహ్నం తర్వాత విషయం వెలుగు చూడడం.. నిందితులను కోర్టు సమయం ముగిసేలోగా పట్టుకోవాలని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో అధికారులు, సిబ్బంది పరుగులు తీశారు. కానీ సాయంత్రం వరకు గాలించినా నిందితుల ఆచూకీ లభ్యం కాలేదని సమాచారం. ఇదేనా నిఘా? కాలనీల్లో ఎక్కడైనా దొంగతనం జరిగితే సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించే పోలీసులు.. పోలీసుస్టేషన్లలో కూడా ఆ ఏర్పాట్లు చేశారు. కానీ కస్టడీలోకి తీసుకున్న ఇద్దరు నిందితులు విధుల్లో ఉన్న సిబ్బంది కళ్లు కప్పి పారిపోతే ఏం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే నిందితులు పరారయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలో అధికారులు చూపిన నిర్లక్ష్యమే ఇప్పుడు వారికి తలనొప్పిగా మారింది. ఇక కస్టడీలో ఉన్న నిందితులు ఎలా బయటకు వెళ్లారు.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో ఎవరూ లేరా.. ఉంటే ఏం చేశారు.. లేదంటే తప్పించుకుని వెళ్తున్న నిందితులకు ఎవరైనా సహకరించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు పదుల సంఖ్యలో సీసీ కెమెరాల నిఘా.. పర్యవేక్షణను దాటుకుని నిందితులు పారిపోయే వరకు అధికారులు, సిబ్బంది ఏం చేశారనే ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. తప్పించుకుపోయిన నిందితులు ఎప్పుడు దొరుకుతారో తెలియకున్నా అప్పటి వరకు సుబేదారి పోలీసుస్టేషన్ అధికారులు, సిబ్బందికి కంటి మీద కునుకు ఉండదనే చెప్పాలి. నాకు ఎలాంటి సమాచారం లేదు సుబేదారి పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు నిందితులు పరారైన విషయమై ‘సాక్షి’ హన్మకొండ ఏసీపీ చల్లా శ్రీధర్‌ను వివరణ కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ ‘మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? పోలీసులా... అధికారులా?’ అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా అలాంటి విషయం ఏదీ లేదని.. తనకు ఎలాంటి సమాచారం లేదంటూ సమాధానం ఇచ్చారు. -
విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్‌లు
సాక్షి, విజయవాడ : విజయవాడలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ దందా సాగిస్తున్నాయి. వీరిపై స్థానికులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన ఎన్నారై నూతక్కి నాగేశ్వరరావు అమెరికా నుంచి నేరుగా నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీఐ కాలేజీ ఆవరణలో గంజాయి గ్యాంగ్‌లు గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 13 నుంచి 15 ఏళ్లలోపు వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మరికొన్ని సార్లు ముఠాలు శ్రుతిమించిపోతున్నాయని, విద్యార్థుల నుంచి ఫోన్లు, బ్యాగ్‌లు, పుస్తకాలతో పాటు ఇతర వస్తువులు గుంజుకొని రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడుకొనే ఈ గ్యాంగ్‌లకు ఆరుమెల్లి రామకృష్ణ అనే వ్యక్తి అండగా ఉన్నరని ఎన్నారై తన ఫిర్యాదులో ఆరోపించారు. ఒక్కోసారి వీధుల్లో ఈ గ్యాంగ్‌లు అల్లర్లకు పాల్పడుతూ స్థానికులను వేధిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీధుల్లో గంజాయి అమ్ముతూ, వద్దన్న వారిపై కత్తులు, బ్లేడ్లతో దాడులకు దిగుతున్నారని, విద్యార్థులు అటుగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇదంతా మాచవరం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని సవాంగ్‌ను కోరారు. ఈ మేరకు గ్యాంగ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు, పేర్లు వారి ఫోన్ నెంబర్లతో సహా కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి నగరానికి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోని నూర్మతి గ్రామానికి చెందిన కిమ్ముడు మల్లేష్ ఆటోడ్రైవర్. 2011లో ఇతడి స్నేహితుడు సి.రాజు ఒక రోజు బాడుగకు మల్లేష్ ఆటోను తీసుకున్నాడు. దీన్ని వినియోగించిన రాజు విశాఖ అటవీ ప్రాంతమైన గుండెల్లి నుంచి గంజాయి ఖరీదు చేసి అక్రమ రవాణా చేస్తూ వి.మాడుగుల పోలీసులకు చిక్కాడు. ఆటోను బాడుగకు ఇచ్చిన ఆరోపణలపై పోలీసులు మల్లేష్‌ను కూడా అరెస్టు చేశారు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన ఇతగాడు గంజాయి అక్రమ రవాణాను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి ఖరీదు చేసి హైదరాబాద్‌తో పాటు విజయవాడలో ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నాడు. మల్లేష్‌కు కొన్నాళ్ల క్రితం విజయవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ గొల్ల కల్యాణ్ బాబుతో పరిచయమైంది. కొన్ని రోజుల క్రితం మల్లేష్‌కు ఫోన్ చేసిన కల్యాణ్ హైదరాబాద్‌కు చెందిన సాగర్, విజయ్‌సింగ్‌లకు గంజాయి సరఫరా చేయాలని చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలిసి విశాఖపట్నంలోని థంగులం గ్రామానికి చెందిన కామరాజుకు రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చి 40 కేజీల గంజాయి తీసుకున్నారు. దీన్ని డెలివరీ చేసేందుకు కారులో తీసుకుని మంగళవారం నగరానికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి షాహినాయత్‌గంజ్‌లోని జోషివాడి వద్ద కాపుకాసి పట్టుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు కేసును సీసీఎస్ ఆధీనంలోని యాంటీ నార్కోటిక్ సెల్ విభాగానికి అప్పగించారు. పరారీలో ఉన్న నగరవాసులు సాగర్, విజయ్‌సింగ్‌లతో పాటు థంగులం గ్రామానికి చెందిన కామరాజు కోసం గాలిస్తున్నట్లు అదనపు డీసీపీ తెలిపారు. -
మహిళా గంజాయి ముఠా అరెస్టు
యలమంచిలో మహిళా గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 80 కేజీల గంజాయి, రూ50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు ఢిల్లీ, మరో ఇద్దరు చెన్నై, వరంగల్ కి చెందిన మహిళలు ఉన్నారు. విశాఖ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు వీరు గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.