గంజాయి స్మగ్లర్ల పరార్‌ | Drugs Smagllers Escaped From Police Station | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లర్ల పరార్‌

Published Fri, Jul 5 2019 12:56 PM | Last Updated on Fri, Jul 5 2019 12:56 PM

Drugs Smagllers Escaped From Police Station  - Sakshi

   సాక్షి, వరంగల్‌ : టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని బుధవారం రాత్రి సుమారు 12.30 గంటలకు సుబేదారి పోలీసులకు అప్పగించారు. కస్టడీలోకి తీసుకున్న ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందికి నిందితులను అప్పచెప్పారు. తీరా గురువారం ఉదయం స్మగ్లర్లను తీసుకురమ్మని అధికారులు అదేశించగా నిందితులు కనబడటం లేదనే సమాధానం రావడంతో నివ్వెరపోవడం వారి వంతైంది.

24 గంటల పాటు కాపలా.. పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది.. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందనే ఆలోచనతో ప్రతీ క్షణం పరిసరాల నిశిత పరిశీల న.. ఇక కస్టడీలోకి తీసుకున్న నిందితుల విషయమైతే మరీ అప్రమత్తత.. ఇదంతా పోలీసుస్టేషన్లలో సర్వసాధారణంగా ఉండే పరిస్థితి.. కానీ పోలీసు కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న సుబేదారి పోలీసు స్టేషన్‌కు కస్టడీ కోసం తీసుకొచ్చిన ఇద్దరు నిందితులు పోలీసుల కళ్లు కప్పి పారిపోవడం సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసుస్టేషన్లలో భద్రతకు సంబంధించి డొల్లతనం బయటపడినట్లయింది. అంతేకాకుండా అధికారుల పనితీరుకు ఈ ఘటన అద్దం పడుతోందని.. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపాన్ని ఎత్తిచూపుతోందని భావిస్తున్నారు.

అసలేం జరిగింది?
సుబేదారి పోలీసు స్టేషన్‌ పరిధిలోని జులైవాడలో బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని విక్రయించటానికి సిద్ధంగా ఉన్న వర్ధన్నపేటకు చెందిన కుమార్, వీర్‌ పట్టుబడగా అదుపులోకి తీసుకోవడంతో వారి నుంచి సుమారు 80 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను సుబేదారి పోలీసులకు రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో అప్పగించారు. కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందికి నిందితులను అప్పగించారు. అయితే, గురువారం ఉదయం విధుల్లోకి వచ్చిన అధికారులు రాత్రి కస్టడీలోకి తీసుకున్న నిందితుల(గంజాయి స్మగ్లర్లు)ను తీసుకురమ్మని అదేశించగా సిబ్బంది తెల్లమొహం వేశారు.

నిందితులు కనబడటం లేదనే సమాధానం రావడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఆఘమేఘాల మీద రాత్రి నుంచి తెల్లవారువరకు జరిగిన విషయాలను సుబేదారి పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఈక్రమంలో నిందితులు పరారైన విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగోలా గురువారం మధ్యాహ్నం తర్వాత విషయం వెలుగు చూడడం.. నిందితులను కోర్టు సమయం ముగిసేలోగా పట్టుకోవాలని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో అధికారులు, సిబ్బంది పరుగులు తీశారు. కానీ సాయంత్రం వరకు గాలించినా నిందితుల ఆచూకీ లభ్యం కాలేదని సమాచారం.

ఇదేనా నిఘా?
కాలనీల్లో ఎక్కడైనా దొంగతనం జరిగితే సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించే పోలీసులు.. పోలీసుస్టేషన్లలో కూడా ఆ ఏర్పాట్లు చేశారు. కానీ కస్టడీలోకి తీసుకున్న ఇద్దరు నిందితులు విధుల్లో ఉన్న సిబ్బంది కళ్లు కప్పి పారిపోతే ఏం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే నిందితులు పరారయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలో అధికారులు చూపిన నిర్లక్ష్యమే ఇప్పుడు వారికి తలనొప్పిగా మారింది. ఇక కస్టడీలో ఉన్న నిందితులు ఎలా బయటకు వెళ్లారు..

ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో ఎవరూ లేరా.. ఉంటే ఏం చేశారు.. లేదంటే తప్పించుకుని వెళ్తున్న నిందితులకు ఎవరైనా సహకరించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు పదుల సంఖ్యలో సీసీ కెమెరాల నిఘా.. పర్యవేక్షణను దాటుకుని నిందితులు పారిపోయే వరకు అధికారులు, సిబ్బంది ఏం చేశారనే ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. తప్పించుకుపోయిన నిందితులు ఎప్పుడు దొరుకుతారో తెలియకున్నా అప్పటి వరకు సుబేదారి పోలీసుస్టేషన్‌ అధికారులు, సిబ్బందికి కంటి మీద కునుకు ఉండదనే చెప్పాలి.

నాకు ఎలాంటి సమాచారం లేదు
సుబేదారి పోలీసు స్టేషన్‌ నుంచి ఇద్దరు నిందితులు పరారైన విషయమై ‘సాక్షి’ హన్మకొండ ఏసీపీ చల్లా శ్రీధర్‌ను వివరణ కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ ‘మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? పోలీసులా... అధికారులా?’ అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా  అలాంటి విషయం ఏదీ లేదని.. తనకు ఎలాంటి సమాచారం లేదంటూ సమాధానం ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement