డబ్బు పట్టుకుంటే.. కుక్కలను వదిలారు!
నల్లధనాన్ని కుప్పలుతెప్పలుగా దాచుకుంటున్న దొరలు.. సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. పట్టుకోడానికి వచ్చిన అధికారుల మీద కుక్కలను వదిలారు. బెంగళూరులోని ఒక అపార్టుమెంటు ఫ్లాట్లో భారీ మొత్తంలో నగదు నిల్వ చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం రావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. అక్కడ 2వేల రూపాయల నోట్లలో రూ. 2.25 కోట్లతో సహా మొత్తం 2.89 కోట్ల నగదు స్వాధీనం అయ్యింది. అయితే, సోదాలు చేయడానికి వచ్చిన అధికారుల మీదకు వాళ్లు రెండు కుక్కలను వదిలారు. ఆ ఫ్లాట్లో కేవలం ఒక వృద్ధురాలు మాత్రమే నివాసం ఉంటోంది. ఆమెకు, డబ్బుకు కాపలాగా ఆ రెండు కుక్కలను పెట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి స్థానికులు, పోలీసుల సాయంతో అధికారులు ఆ ఫ్లాట్లోకి వెళ్లి, తాళం వేసి ఉన్న ఒక గదిని గమనించారు. తాళం పగలగొట్టి తలుపులు తెరవగా, అక్కడ మొత్తం డబ్బంతా బయటపడింది.
మొత్తం నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇక గోవా రాజధాని పణజిలో జరిగిన మరో సోదాలో రూ. 67.98 లక్షల విలువ చేసే 2వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తమకు డబ్బులు చాలా అవసరమని, ఎంత కమీషన్ అయినా ఇస్తామని నమ్మించిన అధికారులు అక్కడ తిరుగుతుండగా ఓ వ్యక్తి ఈ మొత్తం నగదును తీసుకొచ్చాడు. దాంతో అతడిని పట్టుకున్నారు. కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటివరకు మొత్తం రూ. 29.86 కోట్ల నగదు, 41.6 కిలోల బంగారం, 14 కిలోల నగలు స్వాధీనం చేసుకున్నారు.