అమరావతి తలపై సింగపూర్ ‘టోపీ’!
సర్కారు జేబుకు చిల్లు పెట్టే ‘స్టార్టప్’ డీల్
- భూమి ఇచ్చి.. మౌలికవసతులు కల్పించేది ప్రభుత్వం
- లే అవుట్లు వేసి అమ్ముకునేది సింగపూర్ కన్సార్టియం
- భూమితో కలిపి రూ.13వేలకోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి వచ్చేవాటా రూ.446కోట్లు
- రూ.304 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీలకు దక్కేది రూ.5,768 కోట్లు
- అమరావతి వేదికగా కనీవిని ఎరుగని నారావారి దోపిడీ ‘స్టార్టప్’
- సింగపూర్బాబు కనుసన్నల్లో మేనేజ్మెంట్ కంపెనీ
సాక్షి, అమరావతి: అది ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల నుంచి బలవంతంగా ‘సమీకరించిన’ భూమి.. అందులోనూ రాజధానికి గుండె వంటి స్టార్టప్ ఏరియాలో ఇప్పుడే ఎకరా రూ.4 కోట్లు పలుకుతున్న భూమి.. అలాంటి విలువైన భూమిని సింగపూర్ ప్రయివేట్ కంపెనీల కన్సార్టియంకు రాష్ట్రప్రభుత్వం అప్పగించబోతోంది. భూములిచ్చిన రైతులు గానీ, ఐదు కోట్ల మంది ప్రజలు గానీ ఏం ఆశిస్తారు? ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మంచి లాభసాటి చర్చలు జరుపుతుందని భావి స్తారు.. అద్భుతమైన రాజధాని నిర్మించేస్తారని, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూర్చుతారని, తద్వారా ప్రజాధనాన్ని కాపాడతారని ఆశిస్తారు.
కానీ ఇక్కడ జరిగేది పూర్తిగా రివర్స్.. రూ. 7వేల కోట్ల విలువ చేసే భూమిని ఆ కంపెనీలకు అప్పగిస్తోంది.. రూ. 5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది.. కానీ సర్కారు తిరిగి పొందేది పిసరంత.. అంత విలువైన భూమిని అప్పగించేటపుడు గ్లోబల్ టెండర్లు పిలిచి, భూమి ఇస్తున్నాం కనుక మన ఖర్చేమీ లేకుండా, అభివృద్ధి చేసిన భూమిలో మనకు అధిక వాటా ఉండేలా.. మంచి లాభసాటి బేరం చూసుకోవాలి.. కానీ నారా వారి రూటే సెప‘రేటు’.. సర్కారు ‘అభివృద్ధి’ చేసిన భూమిలో లే అవుట్లు వేసుకుని అమ్మేసుకునేందుకు సింగపూర్ కన్సార్టియంకు సర్వహక్కులూ రాసిచ్చేశారు. మన వాటా కింద సగటున ఓ 8.7% ఇస్తే చాలని ఒప్పేసుకున్నారు. అభివృద్ధి చేసిన భూమిని అమ్మడం కోసం ముందు నిర్ణయించిన బేసిక్ ధర ఎకరా రూ. 4.1 కోట్లను కూడా తగ్గించేసి రూ. 62 లక్షలుగా ఫిక్స్ చేసే శారు.. ఇంత నష్టమైన బేరంగానీ, ఇంత లాలూచీగానీ ముందెన్నడూ ఎరిగి ఉండరు. ఆ కథేమిటో మీరే చూడండి.
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భూమికి తొలుత ప్రాథమిక ధర(బేసిక్ ప్రైస్) నిర్ణయించిన సర్కార్.. తాజాగా ఫిక్స్డ్ ప్రైస్(నిర్ణీత ధర) ఖరారు చేసేసింది. అంటే గతంలో ప్రాథమిక ధర నిర్ణయించారు. దానికి తగ్గకుండా ఎంతకు అమ్మినా మొత్తం ధరలో ప్రభుత్వానికి వాటా ఉండేది. ఇపుడు ఫిక్స్డ్ ధర నిర్ణయించారు. దానిపైనే సర్కారుకు రెవెన్యూ వాటా ఇస్తారు. పైన ఎంతకు అమ్ముకున్నా సర్కారుకు సంబంధం ఉండదన్నమాట. ప్రైవేట్ మేనే జ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని సింగపూర్ కన్సార్టియం ఎవరికి, ఎంతకు అమ్ముకున్నా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సింగపూర్ కన్సార్టియం, బాబు అండ్ కో భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ లో భాగంగానే భూమికి ఫిక్స్డ్ ప్రైస్ నిర్ణయించి.. ఆ రేటుపై వచ్చే ఆదాయంలోనే ప్రభుత్వా నికి వాటా(రెవెన్యూ షేర్) ఇవ్వాలని నిర్ణయించారు. అదీ దశలవారీగా. మొత్తమ్మీద 15 ఏళ్లల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల ఖర్చుల న్నీ పోను రూ.5,768.60 కోట్ల ఆదాయం వస్తుందని సింగపూర్ కంపెనీలు తేల్చాయి. ఇందులో ప్రభుత్వానికి రూ.446 కోట్ల వాటా ఇస్తాయి. ఇలాంటి దారుణమైన డీల్‌కు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది.
భూమి ఇచ్చి మౌలిక వసతులు కల్పించి
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1,691 భూమి ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.5,500 కోట్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున రూ.222 కోట్లను పెట్టుబడి పెడుతుంది. సింగపూర్ కన్సార్టియం కేవలం రూ.304 కోట్లే. కన్సల్టెన్సీలతో ప్రైవేట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా మార్కెటింగ్ చేసి భూమిని అమ్ముకునే సింగపూర్ కన్సార్టియంకు వచ్చే వాటా రూ.5,322.6 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలంం రూ.446 కోట్లే. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇచ్చే అంశంపై సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన సీల్డ్ కవర్‌పై మెకెన్సీ, హైపవర్ కమిటీ, సీఆర్డీఏ అథారిటీ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంటే భూమి కాకుండా ధన రూపంలో రూ.5,722 కోట్ల పెట్టుబడి పెట్టే సర్కార్‌కు 15 ఏళ్లలో దక్కేది కేవలం రూ.446 కోట్లు. అంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల సర్కార్‌కు రూ.5,276 కోట్ల నష్టం వస్తుందన్నది స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరుతున్నా.. ప్రైవేట్ మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని తక్కువ ధరలకే భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికే సింగపూర్ కన్సార్టియంకు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును ప్రభుత్వ ముఖ్యనేత కట్టబెట్టేశారన్నది స్పష్టమవుతోంది.
సర్కారు ఆమోదించిన సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలివీ..
► 1,691 ఎకరాల్లోని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు రూ.3,137 కోట్ల వ్యయం అవుతుంది. ఎకరం భూమి ప్రాథమిక విలువ(బేసిక్ ప్రైస్) రూ.4.1 కోట్లుగా నిర్ణయించింది.
► ఇందులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) వాటా రూ.222 కోట్లు.. సింగపూర్ కన్సార్టియం వాటా రూ. 304 కోట్లు. మిగతా నిధులను భూమిని తనఖా పెట్టడం, విక్రయించడం ద్వారా సమకూర్చుకుంటుంది. ఏడీపీలో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 42 శాతం.
► ఏడీసీ, సింగపూర్ కన్సార్టియం రెండు కలిసి సంయుక్తంగా ఏడీపీని ఏర్పాటు చేస్తాయి. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులు నలుగురు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఏడీపీకి సింగపూర్ కన్సార్టియం ప్రతినిధే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనిని బట్టి సింగపూర్ కంపెనీలు చెప్పిందే వేదం అని అర్ధం కావడం లేదూ?
► ఉత్ప్రేరక అభివృద్ధి కోసం ముందుగా 50 ఎకరాలను ఉచితంగా సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఇందులో ఎనిమిది లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించి విక్రయిస్తారు. ఇందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వరు.
► రెండో దశలో 200 ఎకరాలను నామమాత్రపు ధరపై సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఈ భూమిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉండదు.
► 1,691 ఎకరాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇస్తామని ప్రతిపాదించింది.
► ఈ ప్రతిపాదన లపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాతే స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
► రెవెన్యూ షేర్లో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం గోప్యంగా ఉంచడాన్ని హైకోర్టు తప్పుపడుతూ టెండర్ల ప్రక్రియను ఆపేయాలని సెప్టెంబరు 12, 2016న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తొలుత 5% వాటాకే అంగీకారం
రెవెన్యూ షేర్లో ప్రభుత్వానికి ఇచ్చే వాటాపై సింగపూర్ కన్సార్టియం అందించిన సీల్డ్ కవర్‌ను మార్చి 3న సీఆర్డీఏ అధికారులు తెరిచారు. మొత్తం ఆదాయంలో 5 శాతం రెవెన్యూ షేర్ ఇస్తామని సింగపూర్ కంపెనీలు ప్రతిపాదించాయి. వీటికి సీఎం అధ్యక్షతన గల సీఆర్డీఏ అథారిటీ భేటీలోనే ఆమోదం తెలిపారు. అయితే ఐదు శాతం రెవెన్యూ షేర్ చాలా తక్కువంటూ విమర్శలు రావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దాంతో హైపవర్ కమిటీ ఏప్రిల్ 18, 24 తేదీల్లో సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో రెవెన్యూ షేర్ పెంపుపై సంప్రదింపులు జరిపింది. దీంతోఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. తొలి దశలో అంటే ఐదేళ్లలో 5 శాతం, రెండో దశలో మరో ఐదేళ్లలో 7.5 శాతం, మూడో దశ అంటే ఇంకో ఐదేళ్లలో 12 శాతం రెవెన్యూ వాటా ఇచ్చేందుకు సింగపూర్ కంపెనీలు అంగీకరించగా అందుకు ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపింది.
బేసిక్ ధర ‘ఫిక్సింగ్’ ఇలా..
ఎకరం భూమి బేసిక్ ధరను రూ. 4.1 కోట్లుగా తొలి ప్రతిపాద నల్లో సింగపూర్ కన్సార్టియం, ప్రభుత్వం నిర్ణయించాయి. అభివృద్ధి చేసి భూమిని ఎకరం రూ.4.1 కోట్లకు తక్కువ కాకుండా విక్రయించాలని సింగపూర్ కంపెనీలు తమ ప్రతిపా దనల్లో పేర్కొన్నాయి. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సంస్థకు నాలుగు కోట్ల కన్నా తక్కువ ధరకు విక్రయిం చమని కోరితే ఆ వ్యత్యాసం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ కంపెనీలు షరతు విధించాయి. అయితే ఇప్పుడు .. ఆ ప్రాంతంలో భూమి విలువ రూ.నాలుగు కోట్లు లేదని గ్రహించామని, అందువల్ల అభివృద్ధి చేసిన ఎకరం ఫిక్స్డ్ బేసిక్ ధరను రూ.62 లక్షలుగా నిర్ణయిస్తున్నట్లు సీఆర్డీఏ అథారిటీ పేర్కొంది.
తొలి దశ, రెండో దశ, మూడో దశలో అభివృద్ధి చేసిన భూమి ఎంతకు విక్రయం అవుతుందో తెలియకుండానే ఈ మూడు దశల్లో భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే నిర్ధారించేశారు. మూడు దశల్లో రూ. 5,768 కోట్లు ఆదాయం వస్తుందని, ఇందులో సర్కారుకు రూ.446 కోట్లు రెవెన్యూ షేర్ వస్తుందని లెక్కకట్టారు. ఇందుకు హై పవర్ కమిటీ, రాష్ట్ర కేబినెట్ ఆమోదించాయి. అంటే ఎక్కువ ధరకు సింగపూర్ కంపెనీలు భూములను విక్రయించినా ఆ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ ఉండదని స్పష్టం అవుతోంది. ఇక్కడే అసలు మతలబు ఉంది. దోపిడీకి మూలం ఇక్కడే ఉంది. సింగపూర్ కన్సార్టి యంకు సాగిలపడ్డ సర్కార్.. తొలుత ఆమోదించిన ప్రతిపాదనలను తుంగలోతొక్కి నష్టదాయకమైన తాజా ప్రతిపాదనలకు తలూపింది.
స్టార్టప్ ఏరియా అప్పగింత
సాక్షి, అమరావతి: పేరుకు స్విస్ చాలెంజ్ విధానం అయినప్పటికీ ఎటువంటి ఛాలెంజ్ లేకుండా సింగిల్ టెండర్‌పై సింగపూర్ కంపెనీలకు రాజధాని స్టార్ట్ అప్ ఏరియా ప్రాంతం 1691 ఎకరాలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో అంటే తొలి ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రెవెన్యూ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి 5 శాతం మేర, రెండో దశలో అంటే మరో ఐదేళ్లలో 7.5 శాతం, మూడో దశలో అంటే ఇంకో ఐదేళ్లలో 12 శాతం రెవెన్యూ వాటా ఇవ్వనుందని సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉత్తర్వుల్లో ఎంత ఆదాయంలో ఐదు శాతం అనేది స్పష్టం చేయలేదు. ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని హై పవర్ కమిటీతో పాటు కేబినెట్ ఆమోదించిన ఫైలులో మాత్రం ఆదాయం నిర్ధారించారు.
ఆ ఆదాయ వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొనకుండా గోప్యంగా ఉంచారు. తొలుత సింగపూర్ కంపెనీలు రెవెన్యూ వాటా ఐదు శాతమే ఇస్తామన్నారని, అయితే ఇందుకు అంగీకరించకుండా సంప్రదింపులు జరపాలని ఉన్నతస్థాయి కమిటీని కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ సంప్రదింపులు జరపగా తొలి దశలో ఐదు శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం రెవెన్యూ వాటా ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తద్వారా భూముల ధరలు పెరుగుతాయని, అలాగే ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని తద్వారా రాష్ట్ర స్తూల ఉత్పత్తి పెరుగుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు సింగపూర్ కంపెనీలు ఒప్పందాలను చేసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది.