సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ పరిధిలోని 1681 ఎకరాల భూమిపై పవర్ ఆఫ్ అటార్నీని సింగపూర్ కంపెనీల నేతృత్వంలోని ఏడీపీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టును సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మొదటి నుంచి చట్టాలు, నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం ఇప్పుడు అందులోని భూములపై పవర్ ఆఫ్ అటార్నీని ఏడీపీకి ఇస్తుండడం గమనార్హం. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.
అగ్రిగోల్డ్ బాధితుల కోసం హైకోర్టులో అఫిడవిట్ వేయనున్నట్టు ఆయన చెప్పారు. జూన్ నాటికి సీఆర్‌డీఏతోపాటు 71 పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీటికోసం రూ.164 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రేషన్ తీసుకునే పేదలకు కిలో రూ.40 చొప్పున రెండు కిలోల కందిపప్పును ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి అనుమతించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12,600 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇందులో 10 శాతం నిధులు రాష్ట్రం, మిగతా 90 శాతం నిధులను వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికి వేయి ఎకరాల భూమిని అప్పగించేందుకు కాకినాడ పోర్ట్ అథారిటీకి ఆదేశాలిచ్చామని చెప్పారు. సత్ప్రవర్తన కలిగిన 42 మంది ఖైదీలకు విముక్తి కల్పిస్తామన్నారు. రెవెన్యూ శాఖలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు లేకుండా ఉన్న 392 మంది జూనియర్ అసిస్టెంట్‌లను సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించనున్నామని వెల్లడించారు. టీటీడీ పరిధిలో పనిచేస్తున్న 32 మంది మిరాసీయేతర ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు.
పర్యవేక్షణ లేకపోవడం వల్లే..
జల రవాణాపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే గోదావరిలో లాంచీ ప్రమాదం జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా నదిలో లాంచీ మునిగిన ఘటనపై ఇంకా నివేదిక రాలేదని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.. నిపుణుల కమిటీ గోదావరి లాంచీ ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇస్తుందన్నారు. వాతావరణం సరిగా లేకపోయినా మొండిగా లాంచీని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. రాష్ట్రంలో వరుస అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని మీడియా ప్రశ్నించగా.. దీనిపైన కూడా మంత్రిమండలిలో చర్చించామన్నారు.
స్టార్టప్ ఏరియా భూములపై ఏడీపీకి పవర్ ఆఫ్ అటార్నీ
Published Thu, May 17 2018 3:59 AM | Last Updated on Thu, May 17 2018 3:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment