minister kalva srinivasulu
-
కాలవ శ్రీనివాసులుకు చేదు అనుభవం
-
స్టార్టప్ ఏరియా భూములపై ఏడీపీకి పవర్ ఆఫ్ అటార్నీ
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ పరిధిలోని 1681 ఎకరాల భూమిపై పవర్ ఆఫ్ అటార్నీని సింగపూర్ కంపెనీల నేతృత్వంలోని ఏడీపీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టును సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మొదటి నుంచి చట్టాలు, నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం ఇప్పుడు అందులోని భూములపై పవర్ ఆఫ్ అటార్నీని ఏడీపీకి ఇస్తుండడం గమనార్హం. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం హైకోర్టులో అఫిడవిట్ వేయనున్నట్టు ఆయన చెప్పారు. జూన్ నాటికి సీఆర్డీఏతోపాటు 71 పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీటికోసం రూ.164 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రేషన్ తీసుకునే పేదలకు కిలో రూ.40 చొప్పున రెండు కిలోల కందిపప్పును ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి అనుమతించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12,600 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇందులో 10 శాతం నిధులు రాష్ట్రం, మిగతా 90 శాతం నిధులను వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికి వేయి ఎకరాల భూమిని అప్పగించేందుకు కాకినాడ పోర్ట్ అథారిటీకి ఆదేశాలిచ్చామని చెప్పారు. సత్ప్రవర్తన కలిగిన 42 మంది ఖైదీలకు విముక్తి కల్పిస్తామన్నారు. రెవెన్యూ శాఖలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు లేకుండా ఉన్న 392 మంది జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నామని వెల్లడించారు. టీటీడీ పరిధిలో పనిచేస్తున్న 32 మంది మిరాసీయేతర ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే.. జల రవాణాపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే గోదావరిలో లాంచీ ప్రమాదం జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా నదిలో లాంచీ మునిగిన ఘటనపై ఇంకా నివేదిక రాలేదని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.. నిపుణుల కమిటీ గోదావరి లాంచీ ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇస్తుందన్నారు. వాతావరణం సరిగా లేకపోయినా మొండిగా లాంచీని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. రాష్ట్రంలో వరుస అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని మీడియా ప్రశ్నించగా.. దీనిపైన కూడా మంత్రిమండలిలో చర్చించామన్నారు. -
‘బీజేపీది సాంకేతిక విజయం మాత్రమే’
సాక్షి, అమరావతి: కర్ణాటక ఎన్నికల విజయం గురించి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో ఓట్లు తక్కువగా వచ్చినా.. సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, అదే కర్ణాటకలో జరిగిందని అన్నారు. అక్కడ బీజేపీది సాంకేతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలని, 2019 ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని బీజేపీ అనుకుంటే పొరపాటే అని తేల్చి చెప్పారు. బీజేపీకి వచ్చింది కేవలం 36 శాతం ఓట్లు మాత్రమేనని, ప్రజా వ్వతిరేఖ నిర్ణయాల వల్లే ఆ పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని పేర్కొన్నారు. కన్నడ ప్రజలు మోదీ నియంతృత్వ విధానాల పట్ల విసిగిపోయారని తెలిపారు. కానీ బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీయేతర పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిసింది. ఎన్నికల ఫలితాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు. కర్ణాటకలో బీజేపీ సంఖ్యా పరంగా గెలిచినా.. ఓట్ల పరంగా ఓటమిపాలైందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడు అన్నారు. 60 శాతానికి పైగా కన్నడ ప్రజలు బీజేపీని వ్యతిరేఖించారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా ప్రచారం చేయలేదని యనమల పేర్కొన్నారు. -
ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. 2017 జనవరి 1 నుంచి వర్తింపు: ఉద్యోగులకు 2015 వేతన సవరణ మేరకు డీఏ 22.008 శాతం నుంచి 24.104 శాతానికి పెంచారు. 2.096 శాతం మేర పెరిగిన కరువు భత్యం 2017 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. యూజీసీ స్కేల్ వర్తించే వారికి డీఏ 132 నుంచి 136 శాతానికి పెరగనుంది. పాత బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మార్చి నెల వేతనంతోపాటే పెంచిన డీఏ మొత్తం అందనుంది. కరువు భత్యం పెంపు వల్ల ప్రతి నెలా రూ.69.91 కోట్లు, ఏడాదికి రూ.838.87 కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం పడనుంది. గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు తాత్కాలికంగా నెలకు రూ.300 చొప్పున పెంచారు. మరిన్ని నిర్ణయాలు ఇవీ... : పోలవరంలో నామినేషన్ పద్ధతిపై కాంక్రీట్ పనులు చేపట్టే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రూ.1,244.36 కోట్లు మంజూరు చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ నిర్ణయం. - విశాఖ, తిరుపతిలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ల(సినిమా, వినోదం) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. - రాష్ట్రంలో 42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మంత్రిమండలి నిర్ణయం. - అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో కొత్తగా 350 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. 300 ఖాళీలను నేరుగా, 50 ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. -
సాక్షికి అవార్డుల పంట
-
సాక్షికి అవార్డుల పంట
సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫొటో జర్నలిస్టులకు అందించిన అవార్డుల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లు పలు అవార్డులు గెలుచుకున్నారు. ఆదివారం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రదానం చేశారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం–2016 కింద మొదటి కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాపుష్కరాలు, వనం–మనం, పవిత్ర సంఘమ కార్యక్రమాలు, కేటగిరీ రెండులో చంద్రన్నబీమా, మహిళా సాధికారిత, ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం, కేటగిరీ–3లో ఉత్తమ వార్త ఫొటో ఆఫ్ ది ఏపీ సంబంధించి బహుమతులు అందించారు. ఇక ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం–2017లో మొదటి కేటగిరీలో పోలవరం, పట్టిసీమ, పొలం పిలుస్తోంది, ఏపీలో వారసత్వ పండుగలు, రెండో కేటగిరీలో స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ గృహనిర్మాణం, చంద్రన్న చేయూత, మూడో కేటగిరీలో బెస్ట్ న్యూస్ పిక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద అవార్డులు ప్రదానం చేసి, నగదు పురస్కారం, మొమెంటోలు అందించారు. అవార్డులు అందుకున్న సాక్షి ఫొటోగ్రాఫర్లు.. 2016 సంవత్సరానికి సంబంధించి కృష్ణా పుష్కరాల విభాగంలో విజయవాడ ఫొటోగ్రాఫర్ టి.వీరభగవాన్, డి.హుస్సేన్ (కర్నూల్), ఎండీ నవాజ్ (విశాఖపట్నం) కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. చంద్రన్నబీమా, ఉమెన్ ఎంపవర్మెంట్ టూరిజం ఏపీ విభాగంలో కె. జయశంకర్‌కు (శ్రీకాకుళం) చంద్రన్నబీమా అంశంలో కన్సోలేషన్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ న్యూస్ పిక్చర్స్ అవార్డుల విభాగంలో ఐ.సుబ్రహ్మణ్యం (తిరుపతి) ద్వితీయ బహుమతి అందుకోగా, టి.వీరభగవాన్ (విజయవాడ) తృతీయ, కె.జయశంకర్ (శ్రీకాకుళం) కన్సోలేషన్ బహుమతి అందుకున్నారు. 2017 ఏడాదికి కేటగిరి–1లో మనువిశాల్ (విజయవాడ), ఎన్.కిశోర్ (విజయవాడ)కు కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. కేటగిరి–2లో సీనియర్ ఫొటోగ్రాఫర్ రూబెన్ బెసాలియేల్ (విజయవాడ) మొదటి బహుమతి అందుకోగా, పీఎల్ మోహనరావు (విశాఖపట్నం), ఎం.ప్రసాద్ (ఒంగోలు)లకు కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. 2017 బెస్ట్ న్యూస్ పిక్చర్స్ విభాగంలో ఐ.సుబ్రహ్మణ్యం (తిరుపతి) ద్వితీయ బహుమతి అందుకోగా, కె. చక్రపాణి (విజయవాడ) తృతీయ, పి.మనువిశాల్ (విజయవాడ) కన్సోలేషన్ బహుమతిని అందుకున్నారు. ఉత్తమ జర్నలిస్టు అవార్డులు.. ఈ సందర్భంగా ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. 2008 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో ఆరుగురికి, 2009కి నలుగురికి, 2010కి ముగ్గురికి ఇచ్చారు. 2008కి గానూ వీఆర్ నార్ల జీవిత సాఫల్య అవార్డును సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు అందుకోగా, బి.నాగేశ్వరరావు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డును నందిరాజు రాధాకృష్ణ అందుకున్నారు. కాసా సుబ్బారావు బెస్ట్ రూరల్ జర్నలిస్ట్ అవార్డును పి.వి. సత్యనారాయణ, ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును నాగదుర్గాభవాని, ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డును ఎం.వెంకటేశ్వరరావు, ఉత్తమ వీడియోగ్రాఫర్ అవార్డును ఎస్. రమేశ్ అందుకున్నారు. 2009కి గానూ ఎం.ఏ రహీమ్ ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డును కె.భాస్కరరావు, ఎం.నర్సింగ్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును గంజివరపు శ్రీనివాస్, షోయబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును ఈమని రవిచంద్ర, ఉత్తమ వీడియోగ్రాఫర్ అవార్డును వి.వి.శేషగిరిరావు అందుకున్నారు. 2010కి గానూ ఎం.ఏ రహీమ్ ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డును టి.శ్రీనివాసరెడ్డి, ఎం.నర్సింగ్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును చింతముని శేఖర్, షోయబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును డి.చంద్రభాస్కరరావు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ వాసుదేవ దీక్షితులు, సమాచార శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు, అడిషనల్ డైరెక్టర్ మల్లాది కృష్ణానంద్, సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలుంటే నిలదీయండి: మంత్రి కాలవ సహేతుక ఆరోపణలు వస్తే ప్రభుత్వాన్ని జర్నలిస్టులు నిలదీయవచ్చునని, సద్విమర్శ సరిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం ముందు ఆయన మాట్లాడుతూ.. తాను కూడా గతంలో జర్నలిస్టుగా పనిచేసినందున విలేకరుల కష్టనష్టాలు తనకు బాగా తెలుసునన్నారు. రిటైరైన జర్నలిస్టులకు పింఛన్ ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని, దీనిపై ముఖ్యమంత్రితో కూడా చర్చించినట్లు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాల వారికి ప్రస్తుతం రూ.1000 పెన్షన్ ఇస్తున్నామని, దీనిని రూ. 3000 చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు ఇస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 26న అమరావతిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రెస్ అకాడమి చైర్మన్ వాసుదేవ దీక్షితులు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు కమిషనర్ మల్లాది కృష్ణానంద్ తదితరులు పాల్గొన్నారు. -
గృహ నిర్మాణాల్లో వేగం పెరగాలి
– మంత్రి కాల్వ శ్రీనివాసులు కర్నూలు(అర్బన్): గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలని రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక కలెక్టరేట్లోని సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 10 లక్షల మంది గృహ వసతి లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 40 శాతం గృహ నిర్మాణాలు కూడా పూర్తి కాలేదని, ఈ నెలాఖరు నాటికి కేటాయించిన లక్ష్యాల్లో 60 శాతం పూర్తి చేయాలన్నారు. ఇసుక, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా 13వ స్థానంలో ఉందని, వచ్చే రెండేళ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి స్థానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో నాగులదిన్నె, వేముగోడు రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కలెక్టర్‌ను కోరారు. జోహరాపురం కాలనీలో నిర్మించిన గృహాల్లో లబ్ధిదారులు నివాసం ఉంటడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.