
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు.
2017 జనవరి 1 నుంచి వర్తింపు: ఉద్యోగులకు 2015 వేతన సవరణ మేరకు డీఏ 22.008 శాతం నుంచి 24.104 శాతానికి పెంచారు. 2.096 శాతం మేర పెరిగిన కరువు భత్యం 2017 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. యూజీసీ స్కేల్ వర్తించే వారికి డీఏ 132 నుంచి 136 శాతానికి పెరగనుంది. పాత బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మార్చి నెల వేతనంతోపాటే పెంచిన డీఏ మొత్తం అందనుంది. కరువు భత్యం పెంపు వల్ల ప్రతి నెలా రూ.69.91 కోట్లు, ఏడాదికి రూ.838.87 కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం పడనుంది. గ్రామ సహాయకుల(వీఆర్‌ఏ)కు తాత్కాలికంగా నెలకు రూ.300 చొప్పున పెంచారు.
మరిన్ని నిర్ణయాలు ఇవీ... : పోలవరంలో నామినేషన్ పద్ధతిపై కాంక్రీట్ పనులు చేపట్టే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రూ.1,244.36 కోట్లు మంజూరు చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ నిర్ణయం.
- విశాఖ, తిరుపతిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ల(సినిమా, వినోదం) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
- రాష్ట్రంలో 42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మంత్రిమండలి నిర్ణయం.
- అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో కొత్తగా 350 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. 300 ఖాళీలను నేరుగా, 50 ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment