ఇక గ్రీన్ బొగ్గుతో వంట
వ్యవసాయ వ్యర్థాలతో గ్రీన్బొగ్గును తయారు చేసి వాటితో వంట చేసుకునే విధానాన్ని కనుగొంది కార్బన్ రూట్స్ ఇంటర్నేషనల్ సంస్థ. హైతీదేశంలో 93 శాతం ప్రజలకు వంట చేసుకోవడానికి ప్రధాన ఇంధన వనరులు కట్టెల బొగ్గు, కలప. దీంతో అడవులు నరికివేతకు గురవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇతర ఏ దేశాలతో పోల్చుకున్నా హైతీలో బొగ్గు రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.
హైతీ ప్రజలు తమ ఆదాయంలో 50 శాతంపైగా వంట ఇంధనం కోసమే ఖర్చుపెడుతుంటారు. హైతీ ప్రజల సమస్యను తీర్చేందుకు కార్బన్ రూట్స్ ఇంటర్నేషనల్ సంస్థ తక్కువ ఖర్చుతో సంప్రదాయ బొగ్గుకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ బొగ్గును తయారు చేసింది. ఈ గ్రీన్ బొగ్గును వ్యవసాయ వ్యర్థాలైన చొప్పల్ని కాల్చి తయారు చేస్తారు. సంప్రదాయ బొగ్గును వాడే స్టౌలోనే గ్రీన్బొగ్గును ఉపయోగించి వంట చేసుకోవచ్చు. వంట పద్ధతుల్ని ఏ మాత్రం మార్పు చేసుకోనవసరంలేదు.
సంప్రదాయ కట్టెల బొగ్గుతో పోల్చుకుంటే గ్రీన్బొగ్గు ఖర్చు తక్కువ. గ్రీన్ బొగ్గుతో వంట చేసుకోవడానికి హైతీ ప్రజలు ముందుకొస్తున్నారు. గ్రీన్ బొగ్గు ద్వారా డబ్బును ఆదా చేయడమే కాకుండా అడవుల నరికివేతను కూడా అరికట్టవచ్చు. పర్యావరణాన్ని సంరక్షించుకోవచ్చు.