పేకాట శిబిరంపై దాడి : భారీగా కొత్త నోట్లు స్వాధీనం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త నోట్లు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో... ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన ఘటనలో భారీగా కొత్త నోట్లు పట్టుబడడం కలకలం రేపింది. ఈ ఘటన సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక నేతాజీనగర్లోని ఓ అపార్టుమెంట్లో కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు.
పేకాట ఆడుతున్న 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని... వారి నుంచి రూ.2.30 లక్షల నగదు, పదమూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ దాడిలో పట్టుబడిన నగదులో ఎక్కువగా కొత్త రూ.2 వేల నోట్లు ఉండడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.