కొత్త సచివాలయం కట్టి తీరుతాం: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కొత్త సచివాలయం నిర్మించి తీరుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా కొత్త సచివాలయ నిర్మాణ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ, రక్షణ శాఖ అదీనంలోని 38 ఎకరాల బైసన్ పోలో మైదానాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రానికి సాధించి పెట్టారని, అందుకు సీఎంను అభినందించాల్సింది పోయి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచి వాలయ సముదాయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. అంటే సచివాలయ సంబంధ భవనాల పదేళ్ల నిర్వహణ ఖర్చులతో సమానమని వివరించారు.