బ్యాంకు దోపిడీ
ఖాతా తెరుస్తామంటూ నలుగురు వ్యక్తులు బ్యాంకు లోనికి ప్రవేశించారు. తర్వాత రావాలంటూ మేనేజర్ సూచిస్తుండగానే ఇద్దరు వ్యక్తులు ఆయనకు పిస్టల్ ఎక్కుపెట్టారు. గేటు వద్ద మరో ఇద్దరు వ్యక్తులు ఉండి బ్యాంకులోకి వస్తున్న సిబ్బంది ఒక్కొక్కరిని పిస్టళ్లు, కత్తులతో బెదిరించారు. అందరినీ ఓ గదిలో బంధించి సెల్ఫోన్లు, తాళాలు లాక్కున్నారు.
స్ట్రాంగ్‌రూమ్ తెరిచి అందులో ఉన్న రూ.46 లక్షల నగదును కాటన్ క్యారీ బ్యాగుల్లో నింపేసుకున్నారు. సిబ్బందిని గదిలోపలే ఉంచి బయటనుంచి తాళం వేసి డబ్బు సంచులతో బైక్‌లపై పరారయ్యారు. ఇదేదో సినిమా సన్నివేశాన్ని తలపిస్తోంది కదూ..! చొప్పదండి మండల కేంద్రంలోని ఎస్బీఐలో శనివారం సినీఫక్కీలో జరిగిన దోపిడీ ఇది.
చొప్పదండి, న్యూస్‌లైన్ : నిత్యం రద్దీగా ఉండే రాయపట్నం-వరంగల్ రహదారి పక్కన చొప్పదండిలోని వ్యాపార ప్రాంతంలో జరిగిన ఈ దోపిడీపై సంఘటనపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద మొత్తం నిలువ ఉండే బ్యాంకు శాఖకు కనీసం సెక్యూరిటీగార్డు లేకపోవడంతోనే దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి తమ పని సులువుగా కానిచ్చేశారని చర్చించుకుంటున్నారు.
దోపిడీ జరిగిన క్రమం ఇదీ..
శనివారం ఉదయం 9.15 గంటలకు మేనేజర్ విశ్వేశ్వర్రావు బ్యాంకుకు వచ్చారు. వెనుకవైపునున్న తలుపు తెరుచుకుని తన గదిలోకి వెళ్లారు. బ్యాంకు సమయం ఉదయం 10.30 గంటలకు కాగా, శనివారం లావాదేవీలు ఒకేపూట నిర్వహిస్తారు. జనవరి మాసానికి సంబంధించిన లావాదేవీలను సరిచూసుకునేందుకు తాను ముందుగా వచ్చినట్టు మేనేజర్ చెప్పారు. ఆ సమయంలో ఆయనొక్కరే బ్యాంకులో ఉండగా, సిబ్బంది విధులకు వస్తారనే ఉద్దేశంతో ద్వారం తెరిచే ఉంచారు.
ఆ తర్వాత సరిగ్గా పది నిమిషాలకు అంటే.. 9.25 గంటలకు నలుగురు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి ఖాతా తాము ఖాతా తెరుస్తామన్నారు. బ్యాంకు సమయంలో రావాలని మేనేజర్ సూచిస్తుండగానే.. ఇద్దరు వ్యక్తులు ఆయన గదిలోకి వెళ్లి పిస్టల్‌తో బెదిరించారు. ఆయన వద్దనున్న స్ట్రాంగ్‌రూమ్ తాళంచెవి తీసుకుని, పక్కనున్న గదిలో బంధించారు. మరో తాళంచెవి క్యాషియర్ వద్ద ఉందని చెప్పడంతో అతడి రాకకోసం వేచిచూశారు. ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో బ్యాంకులోపల చీకటిగా ఉంది.
9.40 ప్రాంతంలో తాత్కాలిక ఉద్యోగి పొన్నాల రాజు బ్యాంకులోకి ప్రవేశించారు. వెనుకవైపు గేటు వద్దనున్న ఇద్దరు వ్యక్తులు ఆయనను పిస్టల్‌తో బెదిరించి మేనేజర్‌ను బంధించిన గదిలోకి తీసుకెళ్లారు.
10.10 గంటలకు మరో తాత్కాలిక ఉద్యోగి గీత లోనికి రాగానే ఆమె అరవకుండా నోరుమూసి అదే గదిలోకి తీసుకెళ్లి బంధించారు.
10.15 గంటలకు క్లర్కు అశోక్, ఆపై కొద్ది నిమిషాలకు క్యాషియర్ కృష్ణ బ్యాంకులోకి వచ్చారు. వారు రావడంతోనే పిస్టల్, కత్తులు చూపి బెదిరించి అదే గదిలో బంధించారు. లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు అందరివద్దనున్న సెల్ఫోన్లు లాక్కున్నారు. క్యాషియర్ వద్దనున్న తాళంచెవి తీసుకొని, స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి లోనికి ప్రవేశించారు.
10.30 గంటల్లోగా స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న రూ.46 లక్షల నగదును కాటన్ సంచుల్లో నింపుకున్నారు. సిబ్బంది గది నుంచి బయటకు రా కుండా తాళం వేసి డబ్బు సంచులతో బయటకు వెళ్లారు. బ్యాంకు ముందు నిలిపిన తమ రెండు బైక్‌లపై మంచిర్యాల వైపు పరారయ్యారు.
10.40 గంటలకు సిబ్బంది తమ వద్దనున్న తాళాలతో గ్రిల్స్ నుంచి చేతులు పెట్టి తాళం తీసుకొని బయటపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించడంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసులను అప్రమత్తం చేశారు. ఎస్పీ శివకుమార్, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
దోపిడీ దొంగలు 25-30 ఏళ్లలోపు ఉన్నారని, హిందీలో మాట్లాడరని సిబ్బంది తెలిపారు. పోలీసులు బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో సీసీ కెమెరాల్లో నిందితులు సరిగా రికార్డు కాలేదని తెలిసింది. నాలుగుృబందాలను ఏర్పాటు చేశామని, దోపిడీ దొంగలను త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ శివకుమార్ విలేకరులతో చెప్పారు.