డాన్సర్ ఇంట్లో ...గోనె సంచుల్లో నోట్ల కట్టలు
చెన్నై : ఓ డాన్సర్ ఇంట్లో పెద్ద ఎత్తున దొరికిన నగదు స్థానికంగా సంచలనం సృష్టించింది. రూ.4 కోట్ల నగదుతోపాటు, 70 సవర్ల బంగారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని గోవిందరాజ మొదలియార్ వీధికి చెందిన జమున ఇంట్లో మోహనాం బాల్ అనే డాన్సర్ అద్దెకు ఉంటోంది. ఈమె ఇంట్లో నగదు కట్టలు కట్టలుగా ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దాంతో కాట్పాడి పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మోహనాంబాల్ అద్దెకు ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు. అయితే అప్పటికే మోహనాంబాల్ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయింది.
దాంతో పోలీసులు ఇంటి యజమాని జమున సహకారం కోరారు. ఆమె అంగీకారంతో పోలీసులు మోహనాంబాల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గోనె సంచుల్లో ఉన్న నోట్ల కట్టలను గుర్తించారు. సోదాల్లో బంగారు నగలతోపాటు నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విలేకర్లతో మాట్లాడుతూ డాన్సర్ నివాసంలో రూ.4 కోట్ల, 4 లక్షల, 73,500 రూపాయలుతోపాటు 73 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కాగా డాన్సర్ ఇంట్లో ఇంత నగదు, బంగారం ఎలా వచ్చింది.. ఎవరైనా ఇక్కడ దాచి ఉంచారా? దొంగలతో డాన్సర్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు మోహనాం బాల్ సెల్ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ రావటంతో పోలీసులు నగదుపై లోతుగా ఆరా తీస్తున్నారు. కాగా మోహనాం బాల్ తగిన ఆధారాలు చూపిస్తే నగదు, బంగారాన్ని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. సాధారణ డాన్సర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉండడం స్థానికంగా పలువురిని ఆశ్చర్యపరిచింది.