cash stolen
-
ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్‌లో చోరీ
-
వనస్థలిపురంలో భారీ దోపిడీ..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్ల నుంచి భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా.. సిబ్బంది దృష్టి మరల్చి దాదాపు 58లక్షలను దుండగులు దోచుకెళ్లారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా ఈ చోరి జరిగింది. దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. అటెన్షన్ డైవెర్షన్‌తో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిదిలో భారో చోరీ జరిగిందన్నారు. పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి నలుగురు సిబ్బంది వచ్చారని తెలిపారు. వాహనంలో నుంచి డబ్బులు తీసుకెళ్లి జమ చేస్తుండగా.. దుండగులు దృష్టి మళ్లించి డబ్బులు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లారన్నారు. పెట్టెలో దాదాపు 58లక్షలు వరకు ఉండొచ్చన్నారు. చోరీ ఎలా జరిగిందనే విషయంపై విచారిస్తున్నట్లు, ఆ గ్యాంగ్‌లో 5 మంది ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
నమ్మి సాయం కోరితే..నగదు డ్రా
దుగ్గొండి(నర్సంపేట) : ఏటీఎంలో బ్యాలన్స్ చూడాలని నమ్మి సాయం కొరితే అదే అదనుగా భావించిన సదరు వ్యక్తి నగదు డ్రా చేసుకున్న సంఘటన మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మండలంలోని పీజీ తండాకు చెందిన నునావత్ ఉమాదేవి జాతీయ గ్రామీణ పథకంలో భాగంగా కూలి పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఎస్బీఐ దుగ్గొండి బ్యాంకులో తన బ్యాలన్స్ చూసుకోవడానికి వచ్చింది. బ్యాంకు అధికారులు ఉమాదేవిని ఏటీఎంలో బ్యాలన్స్ చూసుకోవాలని సూచించగా పక్కనే ఉన్న ఏటీఎంకు వెళ్లింది. కాగా, ఆమెకు బ్యాలన్స్ చూడటం రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సాయం కోరింది. కార్డు తీసుకున్న ఆయన ఏటీఎం ఫిన్ నంబర్ అడిగాడు. ఆమె తన భర్తకు తెలుసు అని చెప్పింది. వెంటనే మరో వ్యక్తి ఫోన్ తీసుకుని భర్త రవికిషొర్నాయక్కు ఫోన్ చేసింది. ఫిన్నంబర్ భర్త ద్వారా తెలుసుకుని సదరు వ్యక్తికి చెప్పింది. వ్యక్తి ఖాతాలో రూ. 5500 ఉన్నాయని చెప్పి ఉమాదేవికి కార్డు ఇచ్చాడు. దీంతో మహిళ వెళ్లిపోయింది. మరుక్షణమే ఆమె ఖాతానుంచి రూ.5500 డ్రా చేసుకుని వెళ్లాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆమె బ్యాంకు వద్దకు వచ్చి బోరున విలపించింది. విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి ఏటీఎం వద్దకు వచ్చి సీసీ పుటేజీలను పరిశీలించారు. -
పెళ్లికి నిరాకరించిందని రూ.5 లక్షలు తగలబెట్టాడు!
సెహోర్ : ఓ యువకుడు తాను ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం.. తాను పనిచేస్తున్న కంపెనీ నుంచే 6.74 లక్షలు రూపాయల నగదును దొంగతనం చేశాడు. కానీ ఆ అమ్మాయి, అబ్బాయి ప్రపోజల్‌ను తిరస్కరించడంతో, కోపోద్రిక్తుడైన అబ్బాయి రూ.5 లక్షల నగదును వెంటనే అక్కడిక్కడే తగుల పెట్టేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సోహోర్లో చోటుచేసుకుంది. జితేంద్ర గోయల్(22), ఓ ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా జితేంద్ర ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సంస్థకు చెందిన లాకర్ నుంచి ఏప్రిల్ 18న రూ.6.74 లక్షల నగదు చోరి చేశాడు. చోరి చేసిన అనంతరం ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్లాడు. కానీ ఆమె అబ్బాయి ప్రపోజల్‌ను తిరస్కరించింది. వేరే అబ్బాయితో పెళ్లికి సిద్దమైంది. ఎవరి కోసమైతే ఈ దొంగతనం చేశానో వాళ్లే తనకు దక్కనప్పుడు ఈ నగదు ఎందుకు అని? తీవ్ర కోపోద్రోక్తంతో బ్యాగులో నుంచి రూ.5 లక్షలను తీసి కాల్చి బూడిద చేశాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటపడ్డాయి. సంస్థ నుంచి నగదు చోరికి గురైందని ఆ సంస్థ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. జితేంద్ర స్వస్థలం హార్ద జిల్లా అని, ఈ దొంగతనం చేసిన 24 గంటల్లో జితేంద్రను తాము పట్టుకున్నట్టు సెహోర్ స్థానిక పోలీసు స్టేషన్ ఇన్-ఛార్జ్ నిరంజన్ శర్మ తెలిపారు. దొంగతనం ఎందుకు చేశాడో విచారించే సమయంలో ఇవన్నీ బయట పడినట్టు తెలిసిందని శర్మ చెప్పారు. కాల్చేసిన రూ.5 లక్షల నగదులో ఎక్కువగా రూ.500 నోట్లే ఉన్నాయని, మరో రూ.46వేలు, రూ.1,28,000 కప్‌బోర్డులో దొరికినట్టు పోలీసులు తెలిపారు. జితేంద్రకు వ్యతిరేకంగా ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు : నిడదవోలులో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక శాంతినగర్ వాటర్‌ట్యాంక్ సమీపంలోని గుత్తుల రంగారావు ఇంట్లో దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. ఈ ఇంట్లో గుత్తుల రంగారావు, అతని భార్య పార్వతి ఉంటున్నారు. మూడునెలల క్రితం రంగారావుకు గుండె ఆపరేషన్ చేయించేందుకు వారిద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఇంటి ముందు ద్వారం గొళ్లాన్ని విరిచేసి.. గుణపంతో తాళాన్ని బద్దలకొట్టి లోపలకు ప్రవేశించారు. ఇంట్లోని వస్తువులను చిందవందరగా పడేశారు. బీరువాను తెరచి అందులోని లాకర్లలో భద్రపరిచిన ఐదు కాసుల బంగారం, పూజగదిలో ఉన్న ఉన్న కేజీన్నర వెండి వస్తువులు, డిబ్బీలో దాచుకున్న రూ.20 వేలు అపహరించుకుపోయారు. బీరువాలో దేవుని పటాల వద్ద ఉన్న చిల్లర నాణేలను మాత్రం దుండగులు ముట్టుకోలేదు. పట్టణ ఎసై ్స ఎం. భగవాన్‌ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
రూ 12.50 లక్షల సొత్తు అపహరణ నెల్లూరు(క్రైమ్): ఓ కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి తన స్వగ్రామానికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలోని రూ. 12.50 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకొని వెళ్లారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జెడ్పీకాలనీ రెండో వీ«ధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... ఉదయగిరి మండలం గంగులవారి చెరుపల్లి (జి.సి పల్లి) గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు ఏఆర్ కానిస్టేబుల్. ఆయన నెల్లూరు జెడ్పీ కాలనీ రెండో వీధిలో నివాసముంటున్నారు. నెల రోజుల క్రితం అతని తమ్ముడు మృతిచెందాడు. దీంతో ఈనెల 19వ తేదీ శ్రీనివాసులు భార్య నిర్మల, కుమార్తె అనంతలక్ష్మిలు జి,సి పల్లిలో ఉంటున్న శ్రీనివాసులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. శ్రీనివాసులు 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు జీసీ పల్లికి బయలుదేరి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దండుగులు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రెండోగదిలో ఉన్న బీరువాలో సుమారు 52 సవర్ల బంగారు ఆభరణాలు, లాకర్లోని రూ.12.50 లక్షలు విలువచేసే 42 సవర్ల బంగారు ఆభరణాలు, అరకేజీ వెండి, రూ.37వేల నగదు అపహరించుకొని వెళ్లారు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లే క్రమంలో బంగారు కుచ్చులు ప్రహరీ పక్కన పడిపోయాయి. ఉదయం శ్రీనివాసులు ఇంటిపక్కనే నివాసముంటున్న చెంచమ్మ ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి సమీపంలో నివాసముంటున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వరరావుకు విషయాన్ని తెలియజేసింది. ఆయన బాధిత కుటుంబసభ్యులకు, ఐదో నగర పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఇన్స్పెక్టర్ జి. మంగరావు, ఎస్ఐ జగత్‌సింగ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించింది. బాధిత కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. చోరీ ఘటనపై ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదోనగర ఇన్స్పెక్టర్ జి. మంగరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.