ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
-
రూ 12.50 లక్షల సొత్తు అపహరణ
నెల్లూరు(క్రైమ్):
ఓ కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి తన స్వగ్రామానికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలోని రూ. 12.50 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకొని వెళ్లారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జెడ్పీకాలనీ రెండో వీ«ధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... ఉదయగిరి మండలం గంగులవారి చెరుపల్లి (జి.సి పల్లి) గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు ఏఆర్ కానిస్టేబుల్. ఆయన నెల్లూరు జెడ్పీ కాలనీ రెండో వీధిలో నివాసముంటున్నారు. నెల రోజుల క్రితం అతని తమ్ముడు మృతిచెందాడు. దీంతో ఈనెల 19వ తేదీ శ్రీనివాసులు భార్య నిర్మల, కుమార్తె అనంతలక్ష్మిలు జి,సి పల్లిలో ఉంటున్న శ్రీనివాసులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. శ్రీనివాసులు 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు జీసీ పల్లికి బయలుదేరి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దండుగులు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రెండోగదిలో ఉన్న బీరువాలో సుమారు 52 సవర్ల బంగారు ఆభరణాలు, లాకర్‌లోని రూ.12.50 లక్షలు విలువచేసే 42 సవర్ల బంగారు ఆభరణాలు, అరకేజీ వెండి, రూ.37వేల నగదు అపహరించుకొని వెళ్లారు.
ఇంట్లోనుంచి బయటకు వెళ్లే క్రమంలో బంగారు కుచ్చులు ప్రహరీ పక్కన పడిపోయాయి. ఉదయం శ్రీనివాసులు ఇంటిపక్కనే నివాసముంటున్న చెంచమ్మ ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి సమీపంలో నివాసముంటున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వరరావుకు విషయాన్ని తెలియజేసింది. ఆయన బాధిత కుటుంబసభ్యులకు, ఐదో నగర పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఇన్‌స్పెక్టర్ జి. మంగరావు, ఎస్‌ఐ జగత్‌సింగ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించింది. బాధిత కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. చోరీ ఘటనపై ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదోనగర ఇన్‌స్పెక్టర్ జి. మంగరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.