‘నగదు రహితం’పై విస్తృత అవగాహన
►20 నుంచి విద్యార్థులు, లెక్చరర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
► ఇకపై ప్రీపెయిడ్ కార్డులు, రూపే కార్డులతోనే లావాదేవీలు
► మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీ లపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యూనివర్సిటీలు, కాలేజీల్లోని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్లు, విద్యార్థులు, లెక్చరర్ల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(ఎంహెచ్ఆర్డీ) శాఖ నిర్ణ యించింది.
ఇందులో భాగంగా యూనివర్సి టీల వీసీలకు మార్గదర్శనం చేసేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఎస్.మల్లేశం తెలిపా రు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ను కూడా నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేలా విద్యా సంస్థలు అవగాహన కల్పిం చేందుకు కేంద్రం కార్యాచరణ ప్రణాళిక జారీ చేసింది. విట్టియా సాక్షరతా అభియాన్ (విసాక) పేరుతో మార్గదర్శకాలు జారీ చేసిం ది. నగదు రహిత లావాదేవీల వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. వీటి కోసం ప్రతి యూనివర్సిటీ, ప్రతి విద్యాసంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని నిర్దేశించింది.
నగదు రహిత లావాదేవీలకు మార్గాలు...
♦ బ్యాంకు అకౌంట్ లేని వారు, మొబైల్ కూడా లేని వారు: ఇలాంటి వారితో జన్‌ధన్ ఖాతా ఓపెన్ చేరుుంచేలా చర్యలు చేపట్టాలి. రూపే, ప్రీపెయిడ్ కార్డులను నిత్యావసరాలకు వినియోగించేలా అవగాహన కల్పించాలి.
♦ బ్యాంకు అకౌంట్ ఉన్నా మొబైల్ లేనివారు: బ్యాంకుల నుంచి రూపే కార్డులు తీసుకునేలా చైతన్యపరచాలి. అన్ని అవసరాలకు వాటినే స్వైప్ చేసేలా చర్యలు చేపట్టాలి.
♦ బ్యాంకు అకౌంట్ ఉండి, ఫీచర్ ఫోన్ ఉన్నవారు: రూపే కార్డులను వినియోగించి తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేయాలి.
♦ షాపుల్లో (పాయింట్ ఆఫ్ సేల్-పీవోఎస్) స్వైపింగ్ మిషన్లు లేకపోతే జీఎస్ఎం సిమ్ ఆధారంగా అన్‌స్ట్రక్షర్డ్ సప్లిమెంటరీ సర్వీసు డాటా (యూఎస్ఎస్డీ), మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ (ఎంఎంఐడీ) పద్ధతుల్లో లావాదేవీలు నిర్వహించాలి.
♦ బ్యాంకులు ఇచ్చే ఏడు డిజిట్ల ర్యాండమ్ నంబరు ఉపయోగించి డబ్బు వినియోగదారుని అకౌంట్ నుంచి షాపు యజమాని అకౌంట్లోకి పంపించే విధానంపై అవగాహన కల్పించాలి.
♦ బ్యాంకు అకౌంట్, స్మార్ట్ ఫోన్ ఉన్నవారు: రూపే కార్డు, డెబిట్ కార్డులను వినియోగించేలా, స్వైపింగ్ విధానం, మొబైల్ వాలెట్ వినియోగించేలా అవగాహన కల్పించాలి.
ఇదీ కార్యాచరణ
♦ ఈ నెల 10వ తేదీలోగా డిజిటల్ పేమెంట్ విధానం అవగాహన కల్పించేలా ట్రైనర్లను గుర్తించాలి.
♦ ఈ నెల 14వ తేదీలోగా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి విద్యార్థులు అందరికీ తెలియజేయాలి.
♦ వాలంటీర్లుగా పనిచేసే వారు ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి.
♦ 15వ తేదీ నుంచి 20వ తేదీలోగా క్షేత్ర స్థాయికి వెళ్లి అవగాహన కల్పించే వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలి.
♦ 20వ తేదీ నుంచి జనవరి 12వ తేదీలోగా క్షేత్ర స్థాయికి వెళ్లి వాలంటీర్లు ప్రజల్లో అవగాహన కల్పించి, వారు నగదు రహిత లావాదేవీలవైపు వచ్చేలా చూడాలి.
మార్కెట్లలో తేవాల్సిన మార్పులు
♦ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్లు మార్పు తీసుకురావాల్సిన మార్కెట్లు, ప్రాంతాలను ఈ నెల 12లోగా గుర్తించాలి.
♦ వాటిని ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు సందర్శించి అక్కడ వ్యాపారాలు చేసేవారిని డిజిటల్ పేమెంట్ వైపు మళ్లించాలి.
♦ డిసెంబరు 23 నుంచి జనవరి 8వ తేదీ వరకు వాటి అమలును మరోసారి పరిశీలించి, వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.