Casper Ruud
-
రూడ్... రెండో రౌండ్లోనే అవుట్
లండన్: ఐదో ప్రయత్నంలోనూ నార్వే స్టార్ ప్లేయర్, ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో రూడ్ 4–6, 5–7, 7–6 (7/1), 3–6తో ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 3 గంటల 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్ 15 ఏస్‌లు సంధించినా, 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్ 7–6 (7/5), 6–2, 6–2తో వుకిచ్ (ఆస్ట్రేలియా)పై, మెద్వెదెవ్ 6–7 (3/7), 7–6 (7/4), 6–4, 7–5తో ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలు పొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. అంకా టొడోని (రొమేనియా)తో జరిగిన రెండో రౌండ్లో కోకో గాఫ్ 6–2, 6–1తో గెలిచింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకా (జపాన్) రెండో రౌండ్లోనే ని్రష్కమించింది. ఎమ్మా నవారో (అమెరికా) 6–4, 6–1తో ఒసాకాను ఓడించింది. మరోవైపు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ డబుల్స్‌లోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్ లో సుమిత్ –లాజోవిచ్ (సెర్బియా) ద్వయం 2–6, 2–6తో మారి్టనెజ్–మునార్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
రూడ్‌కు చుక్కెదురు
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో గురువారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 67వ ర్యాంకర్ జీజెన్ జాంగ్ (చైనా) 3 గంటల 19 నిమిషాల్లో 6–4, 5–7, 6–2, 0–6, 6–2తో రూడ్‌ను ఓడించగా... ప్రపంచ 128వ ర్యాంకర్ డొమినిక్ స్ట్రికర్ (స్విట్జర్లాండ్) 4 గంటల 4 నిమిషాల్లో 7–5, 6–7 (2/7), 6–7 (5/7), 7–6 (8/6), 6–3తో సిట్సిపాస్‌పై సంచలన విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–4, 6–1, 6–1తో మిరాలెస్ (స్పెయిన్)పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 7–5, 7–6 (7/5)తో 11వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–3, 6–4తో దరియా సావిల్లె (ఆ్రస్టేలియా)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6–4, 6–2తో క్రిస్టోఫర్ ఒకానెల్–వుకిచ్ (ఆ్రస్టేలియా) జంటను ఓడించగా... సాకేత్ మైనేని (భారత్)–కరత్సెవ్ (రష్యా) ద్వయం 7–6 (7/4), 3–6, 2–6తో హుస్లెర్ (స్విట్జర్లాండ్)–లాస్లో జెరె (సెర్బియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
వింబుల్డన్-2023లో సంచలనం.. టాప్ ప్లేయర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. బ్రిటన్ ప్లేయర్, వైల్డ్‌కార్డ్ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్సెవ్ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ఐదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్ (జర్మనీ) చేతిలో ఓడింది.