సామాజిక న్యాయం కోసమే పార్టీ
పదవుల కోసం కాదు
ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
మడికొండ, న్యూస్‌లైన్ : పదవుల కోసం పార్టీ స్థాపించలేదని, అవి కావాలనుకుంటే 1996లోనే వచ్చి ఉండేవని మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండ మండలం కొండపర్తిలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు బొక్కల వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సభలో మందకృష్ణ మాట్లాడారు. ఇప్పటి వరకు పార్టీలు పెట్టిన అందరూ అగ్రవర్ణాలవారేనని, వారికి పేదల బాధలు తెలియవని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లతో గెలుపొందిన నాయకులు ఏనాడూ ఆయా వర్గాల కోసం పోరాడలేదని తెలిపారు. పేద లకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ స్థాపించానని, అణగారిన వర్గాలకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడతానని స్పష్టం చేశారు. రాజ్యాధికారం చేపట్టి స్వరాష్ట్ర పాలన సాధించుకుందామన్నారు. రాబోయే ఎన్నికల్లో అగ్రవర్ణాల పార్టీలపై ఎంఎస్పీ విజయం సాధించాలంటే బడుగు, బలహీన వర్గాలకే ఓట్లు వేయాలని కోరారు. ఇగ్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ మనకు దొరల తెలంగాణ వద్దని, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రానికి అగ్రవర్ణాలవారే ముఖ్యమంత్రులు అయ్యారని, వారికి మన బాధలు తెలియవన్నారు. మనకు న్యాయం జరగాలంటే మన బాధలు తెలిసినవారే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీలా రాష్ట్రంలో ఎంఎస్పీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పుట్ట రవి మాదిగ, బొక్కల నారాయణ, సర్పంచ్ పిట్టల కుమారస్వామి, మంద కుమార్, గోవింద్ నరేష్, మాదాసి బాబు, వస్కుల దేవేందర్ గ్రామంలోని కుల సంఘల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.