castism
-
‘పాయల్ గొంతు, శరీరంపై గాయాలున్నాయి’
ముంబై : కులం పేరుతో సీనియర్ల చేతిలో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ కేసు కీలక మలుపు తిరిగింది. పాయల్‌ది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు సంచలన విషయాలు బయటపెట్టింది. పాయల్ గొంతు దగ్గర, శరీరం మీద గాయలున్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వెల్లడించింది. దాంతో పాయల్‌ది హత్య అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సందర్భంగా పాయల్ కుటుంబం తరఫు న్యాయవాది.. పాయల్ మృతిని హత్యగా గుర్తించాలని కోర్టును కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాయల్ మరణించిన తీరు.. ఆమె శరీరం మీద ఉన్న గాయాలను బట్టి చూస్తే.. తనది ఆత్మహత్య కాదు.. హత్య అని తెలుస్తుంది. పోస్టు మార్టమ్ రిపోర్టు కూడా ఇదే తెలియజేస్తుంది. ప్రస్తుతం హత్య కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు గాను 14 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అన్నారు. స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీని సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో పాయల్ ఈనెల 22న హస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు) -
ప్రణయ్ హత్య : మంచు మనోజ్ ట్వీట్ వైరల్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యపై సినీ హీరో మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కులం, మతోన్మాదంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఈ ఘటనపై ట్విటర్ ద్వారా మంచు మనోజ్ తన మనసులోని ఆవేదనను, బాధను వ్యక్తం చేసారు. ప్రణయ్ హంతకులనుద్దేశించి ఈ ట్వీట్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. కులాల పేరుతో ఎందుకీ వివక్ష, హత్యలు అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. మానవత్వం కంటే మతం కులం ఎక్కువా? మనమంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పటికి గుర్తిస్తుందంటూ ఆవేదనతో ప్రశ్నించారు. కుల దురహంకార హత్యలను తీవ్రంగా దుయ్యబట్టిన మనోజ్ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతకు, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కులం, మతం పిచ్చోళ్లు సమాజంలో ఉండటం వల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుల అహంకారాన్ని తలకెక్కించుకుని కుల మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతీ వ్యక్తి ప్రణయ్ హత్యకు బాధ్యులేనన్నారు. అందుకే ఓ బిడ్డ ఇంకా లోకం చూడకుండానే తన తండ్రి స్పర్శను కోల్పోయింది. ఇంతకంటే విషాదం ఎవరి జీవితాల్లోనైనా ఏముంటుందని వ్యాఖ్యానించారు. కులోన్మాదుల్లార సిగ్గుపడండి.. గుర్తుంచుకోండి..కులాన్ని సమర్ధిస్తున్న మీరందరూ ప్రణయ్ హత్యకు బాధ్యులే. ఇకనైనా కళ్లు తెరవండి. మనుషులుగా బతుకండి..కులవ్యవస్థ నాశనం కావాలి. ఆ అంటురోగాన్ని ముందుగానే నిరోధించాలి. హృదయపూర్వకంగా మీ అందరినీ అడుగుతున్నా.. మన బిడ్డలకు మెరుగైన సమాజాన్ని అందిద్దాం అంటూ ఉద్వేగంతో చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. కాగా మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కలకలం రేపింది. పట్టపగలే కిరాయి గుండాలతో అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్‌ను పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పరువు పేరుతో కన్న కూతురి జీవితాన్ని అతలాకుతలం చేసిన వైనంపై దళిత, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మారుతీరావు సహా నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. To everyone who murdered Pranay🙏 #RIPPranay pic.twitter.com/idHfVK38eS — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 17, 2018 -
'కులతత్వానికి చిరునామా ఏపీ'
సాక్షి, హైదరాబాద్: కులతత్వానికి, అధికార దుర్వినియోగానికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిందని లోక్‌సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ర్యాగింగ్ పేరుతో క్రూర వేధింపుల బారిన పడి నాగార్జున యూన్సివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనతో ప్రజలందరూ కదలాలని, ఈ ఉదంతంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. కులం, మనం - వాళ్లు అనే విష సంస్కృతిలో యూనివర్సిటీలు, విద్యార్థులు కూరుకుపోవడం, వివక్షల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఇలాంటి పరిస్థితులు తలెత్తడం అత్యంత బాధాకరమని జేపీ అభిప్రాయపడ్డారు. ఓట్ల కొనుగోలు, కులం చుట్టూ తిరిగే ఆటవిక రాజకీయాలు సమాజాన్ని విషతుల్యం చేశాయని, కుల వివక్ష వదిలించేందుకు భారీ ప్రజా చైతన్య కార్యక్రమాల అవసంరం ఉన్నదని పేర్కొన్నారు.