'కులతత్వానికి చిరునామా ఏపీ'
సాక్షి, హైదరాబాద్: కులతత్వానికి, అధికార దుర్వినియోగానికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిందని లోక్సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ర్యాగింగ్ పేరుతో క్రూర వేధింపుల బారిన పడి నాగార్జున యూన్సివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనతో ప్రజలందరూ కదలాలని, ఈ ఉదంతంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు.
కులం, మనం - వాళ్లు అనే విష సంస్కృతిలో యూనివర్సిటీలు, విద్యార్థులు కూరుకుపోవడం, వివక్షల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఇలాంటి పరిస్థితులు తలెత్తడం అత్యంత బాధాకరమని జేపీ అభిప్రాయపడ్డారు. ఓట్ల కొనుగోలు, కులం చుట్టూ తిరిగే ఆటవిక రాజకీయాలు సమాజాన్ని విషతుల్యం చేశాయని, కుల వివక్ష వదిలించేందుకు భారీ ప్రజా చైతన్య కార్యక్రమాల అవసంరం ఉన్నదని పేర్కొన్నారు.