'అధికారం దక్కదన్న భయంతోనే విభజన'
హైదరాబాద్ : అధికారం దక్కదన్న భయంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడిందని.. లోక్‌సత్తా ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. శాసనసభ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన మంగళవారం మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో ఒక్క సీటూ రాదన్నభయంతోనే.. తొమ్మదికోట్లమంది ప్రజలను విభజిస్తోందన్నారు. అతిపెద్ద భాషాప్రయుక్త రాష్ట్రాన్ని బలి చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని జేపీ మండిపడ్డారు.
తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసమగ్ర బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. బిల్లుపై గుడ్డిగా ముందుకు వెళితే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. ముసాయిదా బిల్లుపై సమగ్ర వివరాలు లేకుండా చర్చ చేపట్టమంటున్నారని అన్నారు.
తెలుగు ప్రజల కోసం ఏమేరకు వనరులు ఇస్తుందో కేంద్రం చెప్పలేదన్నారు. ప్రాంతాల వారీగా సిబ్బంది వివరాలు, ఆస్తులు, అప్పులు వివరాలు ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతే చర్చ చేపట్టాలని స్పీకర్ను కోరినట్లు జేపీ తెలిపారు. రాజకీయంగా ఎలాంటి మార్పులు వచ్చిన తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.