Catholic Church
-
చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి
ఔగడొగొ: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోకు ఉత్తరాన ఉన్న డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రార్ధనలు జరుగుతుండగా సాయుధులైన కొందరు చర్చిలోకి చొరబడ్డారని డాబ్లో నగర మేయర్ ఉస్మానె జోంగో చెప్పారు. చర్చిలో ఉన్నవారు పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు కాల్పులు జరిపారని చెప్పారు. అనంతరం చర్చికి, పలు దుకాణాలకు నిప్పు పెట్టారని జోంగో వివరించారు. స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని దోపిడీ చేశారని, చీఫ్ నర్స్ వాహనాన్ని తగులబెట్టారని చెప్పారు. దేశంలో క్రైస్తవ, ముస్లిం మత గురువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. -
చర్చి లక్ష్యంగా పేలుళ్లు
మనీలా: బాంబు పేలుళ్లతో ఫిలిప్పీన్స్ దేశం దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని కేథలిక్ చర్చ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆప్రాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 15 మంది పౌరులు, ఐదుగురు భద్రతాసిబ్బంది ఉన్నారు. సైనిక బలగాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఆదివారం చర్చి ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. తొలిబాంబు పేలుడుతో చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. నిమిషం వ్యవధిలో మరో బాంబుపేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో బాంబును చర్చివద్ద నిలిపివున్న బైక్‌కు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ముందు జాగ్రత్తగా అధికారులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఆపివేశారు. ‘ఇది దేశ విద్రోహుల చర్య, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ముష్కరులకు తగిన బుద్ధి చెబుతాం’అని దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతెరో ప్రకటించారు. అబూ సయ్యఫ్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొద్దికాలంగా బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నారు. అమెరికాలో ఐదుగుర్ని చంపిన ఉన్మాది న్యూఆర్లిన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో డకోటా థిరియట్(21) అనే ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిని కూడా హ్యాండ్‌గన్‌తో కాల్చిచంపాడు. అనంతరం ఓ కారులో పరారయ్యాడు. లూసియానాలోని అస్కెన్షన్ ప్రాంతానికి చెందిన థిరియట్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం(స్థానిక కాలమానం) ప్రియురాలు సమ్మర్ ఎర్నస్ట్(20) ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమెతో పాటు యువతి తండ్రి బిల్లీ(43), తమ్ముడు టానర్(17)ను చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కారులో లివింగ్‌స్టన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు కీత్(50), ఎలిజబెత్(50) వద్దకు చేరుకుని వారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న డకోటా థిరియట్ కోసం గాలింపును ప్రారంభించారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. -
పోప్ పాల్ Vఐకు సెయింట్ గౌరవం
వాటికన్ సిటీ: 1960ల్లో క్యాథలిక్ చర్చిలో రెండవ వాటికన్ మండలి ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చిన పోప్ ఆరవ పాల్‌ను సెయింట్‌గా గుర్తించి గౌరవించనున్నట్లు వాటికన్ బుధవారం ప్రకటించింది. శాన్ సాల్వడార్లో క్రైస్తవ ప్రధాన మతగురువుగా పనిచేస్తూ 1980ల్లో సామాజిక న్యాయం, ప్రజల అణచివేతలపై ప్రశ్నించి హత్యకు గురైన ఆస్కార్ రొమెరోకు కూడా సెయింట్‌హుడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పోప్ ఫ్రాన్సిస్ మంగళవారమే సంతకం చేశారు. -
చర్చ్ సభ్యులపై పోప్ ఆగ్రహం
సంస్కరణలు అడ్డుకుంటున్నారని ధ్వజం వాటికన్ సిటీ: వాటికన్ చర్చ్‌లో సంస్కరణల అమలులో ఎదురవుతున్న వ్యతిరేకతను పోప్ ఫ్రాన్సిస్ గురువారం తీవ్రంగా తప్పుపట్టారు. ఆ వ్యతిరేకతలో కొన్ని దైవదూత వలే వేషం వేసుకున్న దుష్ట శక్తి ప్రోద్బలంతో జరుగుతున్నాయన్నారు. గురువారం క్రిస్మస్ శుభాకాంక్షల సందేశంలో భాగంగా... తన బృందంలోని సభ్యులు క్యాథలిక్ చర్చ్ కోసం పనిచేయాలంటే కచ్చితంగా శాశ్వత పరిశుద్ధులుగా ఉండాలన్నారు. వరుసగా మూడో ఏడాది కూడా పోప్ వాటికన్ అధికార యంత్రాగం తీరుపై విమర్శలు గుప్పించారు. 2013లో తాను ఎన్నుకున్న సంస్కరణల ప్రకియ లక్ష్యం వాటికన్ చర్చ్‌లో పైపై మార్పుల కోసం కాదని... తన సహచరుల్లో పూర్తి స్థాయి మానసిక మార్పే లక్ష్యమని పేర్కొన్నారు. ‘ప్రియ సహోదరులారా... చర్చికి ఏర్పడ్డ ముడతల కోసం కాదు... మరకల గురించి మీరు భయపడాలి’ అని సందేశమిచ్చారు. -
కేథలిక్ చర్చిలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: నగరంలోని ఓ కేథలిక్ చర్చిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం గం 7.15 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తూర్పు ఢిల్లీలోని దిల్షాద్‌గార్డెన్ ప్రాంతంలోగల సెయింట్ సెబాయిస్టియన్ చర్చిలో ఉదయం ఉదయం గం 7.15 నిమిషాలకు పొగలు రావడాన్ని చౌకీదార్ గమనించాడు. దీంతో అతను ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖతోపాటు చర్చి నిర్వాహకులకు చేరవేశాడు. ఈ సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ నాలుగు వాహనాలతో అక్కడి కి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వారికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఈ విషయమై చర్చి ఫాదర్ స్టాన్లీ మాట్లాడుతూ తొలుత ప్రార్థనా మందిరంలో మొదలైన మంటలు ఆ తరువాత రెండో అంతస్తుకు వ్యాపించాయన్నారు. ఈ చర్చిలో సర్వం దగ్ధమైందని, అసలేమీ మిగలలేదని అన్నారు. కాగా ఈ చర్చి హిందువులు, కైస్త్రవులు కలగలిసి జీవనం సాగించే ప్రాంతంలో ఉంది. ఈ చర్చి సంరక్షుడొకరు మాట్లాడుతూ 2001లో ఐదువేల మంది క్రైస్తవులు ఇక్కడ నివసించేవారన్నారు. ఇదే విషయమై డీసీపీ ఆర్.ఎ.సంజీవ్ మాట్లాడుతూ కిటికీ అద్దాలు పగిలిపోయి కనిపించాయన్నారు. అంతేకాకుండా త్వరగా కాలిపోయే స్వభావం కలిగిన వస్తువులు కూడా ఇక్కడ తమకు లభించాయన్నారు. అంటే దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే విషయం స్పష్టమవుతోందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. షార్ట్సర్క్యూట్కూ అవకాశం లేకపోలేదన్నారు. కాగా ఈ ఘటనకు నిరసనగా ఐటీఓ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట కొన్ని క్రైస్తవ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. చర్చిని సందర్శించిన ఆప్ నేత అరవింద్: అగ్నిప్రమాదం చోటుచేసుకున్న తూర్పు ఢిల్లీలోని దిల్షాద్‌గార్డెన్ ప్రాంతంలోగల సెయింట్ సెబాయిస్టియన్ చర్చిని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు.