మనీలా: బాంబు పేలుళ్లతో ఫిలిప్పీన్స్ దేశం దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని కేథలిక్ చర్చ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆప్రాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 15 మంది పౌరులు, ఐదుగురు భద్రతాసిబ్బంది ఉన్నారు. సైనిక బలగాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఆదివారం చర్చి ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు అమర్చారు.
తొలిబాంబు పేలుడుతో చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. నిమిషం వ్యవధిలో మరో బాంబుపేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో బాంబును చర్చివద్ద నిలిపివున్న బైక్‌కు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ముందు జాగ్రత్తగా అధికారులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఆపివేశారు. ‘ఇది దేశ విద్రోహుల చర్య, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ముష్కరులకు తగిన బుద్ధి చెబుతాం’అని దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతెరో ప్రకటించారు. అబూ సయ్యఫ్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొద్దికాలంగా బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నారు.
అమెరికాలో ఐదుగుర్ని చంపిన ఉన్మాది
న్యూఆర్లిన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో డకోటా థిరియట్(21) అనే ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిని కూడా హ్యాండ్‌గన్‌తో కాల్చిచంపాడు. అనంతరం ఓ కారులో పరారయ్యాడు. లూసియానాలోని అస్కెన్షన్ ప్రాంతానికి చెందిన థిరియట్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం(స్థానిక కాలమానం) ప్రియురాలు సమ్మర్ ఎర్నస్ట్(20) ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమెతో పాటు యువతి తండ్రి బిల్లీ(43), తమ్ముడు టానర్(17)ను చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కారులో లివింగ్‌స్టన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు కీత్(50), ఎలిజబెత్(50) వద్దకు చేరుకుని వారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న డకోటా థిరియట్ కోసం గాలింపును ప్రారంభించారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment