Cattle grazing
-
వరి గడ్డిని సుపోషకం చేయటం ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో వరి గడ్డి ప్రధానమైన పశుగ్రాసం వరి గడ్డిని ఎండబెట్టి వాముగా వేసి వేసవిలో పశువుల మేతగా వాడుట సహజం. కానీ వరి గడ్డి పోషక పదార్థాల రీత్యా పాల దిగుబడికి అంత దోహదకారి కాదు. అంతేకాక వరి గడ్డిలో పశువు శరీరంలో ఉండే ముఖ్యమైన లవణ ధాతువు కాల్షియంను నష్టపరిచే లక్షణం ఉంది. వరి గడ్డిలో మాంసకృత్తులు లేవు. జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు కేవలం 45% ఉన్నాయి. కాబట్టి వరిగడ్డిని సుపోషకం చేయటం అవసరం. వరి గడ్డిని సుపోషకం చేయడానికి యూరియాని వాడుతారు. ఈ పద్ధతిని ‘యుటిపిఎస్’ అని కూడా అంటారు. వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేసే పద్ధతి: ఒక రోజుకు ఒక పాడి పశువుకు 6 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డిని ఆహారంగా ఇవ్వవచ్చు. దీని ప్రకారం ఒక పశువుకు ఒక వారానికి దాదాపు 50 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డి అసవరమవుతుంది. రెండు పద్ధతులతో వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేయవచ్చు. 100 కిలోల వరి గడ్డికి, 4 కిలోల యూరియా 60 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. మొదట యూరియాను నీళ్లలో బాగా కరిగేటట్లు చూడాలి. తరువాత వరి గడ్డిని నేల మీద పరచి యూరియా కరిగిన నీళ్లను గడ్డిపై పూర్తిగా తడిచేలా చల్లాలి. తరువాత యూరియా నీటితో తడిపిన గడ్డిని పాతర గోతిలో గాని, యూరియా బస్తాలలలో గాని లేదా ప్లాస్టిక్ షీట్‌తో గానీ గాలి చొరబడకుండా జాగ్రత్తగా భద్రపరచి వారం రోజుల పాటు మాగనిస్తే వరి గడ్డి వాడకానికి సిద్ధం అవుతుంది. వరి గడ్డిని సుపోషకం చేయడం వల్ల లాభాలు: 1 వరి గడ్డిలో ఉండే పీచు పదార్థం తగ్గి పశువులు ఎక్కువ మేతను తినగలవు, జీర్ణం చేసుకోవడం కూడా సులభం. 2 ఈ పద్ధతిలో వరి గడ్డిలో మాంసకృత్తులను 0 నుంచి 5% పెంచవచ్చు. 3 వరి గడ్డిలో ఉండే జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు 45% నుంచి 60% పెరుగుతాయి. 4 ఎండు వరి గడ్డిలో తేమ శాతం 10% ఉండి తినడానికి ఇబ్బంది ఉంటుంది. సుపోషకం చేయడం వలన తేమను 45–50% పెంచవచ్చు. 5 యూరియాతో సుపోషకం చేయటం వలన తక్కువ ఖర్చుతో మాంసకృత్తులను పొందవచ్చు. 6 ఈ పద్ధతి పాడి రైతులు అమలు చేయడానికి అనువైనది, సులభమైనది. 7 సుపోషకం చేయబడిన గడ్డి రంగు ముదురు గోధుమ రంగుగా మారి కొద్దిగా అమ్మోనియా వాసన వస్తుంది. ఈ గడ్డి వాడకం వలన పొల ఉత్పత్తి, పని చేసే శక్తి పెరుగుతాయి. కొన్ని పశువులు మొదట ఈ గడ్డిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వాటికి కొద్దికొద్దిగా మేపి అలవాటు చేయాలి. పశుపోషణలో పచ్చిమేత, దాణా ఎంత ముఖ్యమో.. వాటి ద్వారా ఖనిజ లవణాల లభ్యత కూడా అంతే ముఖ్యం. అంతేగాక పాడి పశువుల పాల ఉత్పత్తి స్థాయితో పాటు వాటి శరీర కార్యక్రమాలను నిర్వర్తిస్తూ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమైనంత ఖనిజ లవణాలను అందించడం కూడా అంతే ముఖ్యం. -
పశుగ్రాసాల సాగు ఇలా...
మేలి రకం గ్రాసంతోనే పాల దిగుబడి.. వెన్న శాతం పెరిగే అవకాశం గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహా సూచనలు గజ్వేల్: పాడి పోషణలో పశుగ్రాసం కీలకం. ఏడాది పొడువునా గ్రాసం సాగు చేసి పశువులకు మేతగా అందించవచ్చునని గజ్వేల్ మండల పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి (సెల్. 9505056118) చెబుతున్నారు. పశుగ్రాసాల సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలు..డెయిరీ ఫారమ్‌పై ఆధారపడి జీవనోపాధి పొందే రైతులు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడువునా పశువులకు పుష్కలంగా మేలి రకం పశుగ్రాసాలను అందించాలి. అప్పుడే పోషకాలన్నీ పశువులకు అంది పాల దిగుబడులు, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. అంతేకాకుండా పశువులు జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈని ఏడాదికో దూడను పొందే అవకాశాలుంటాయి. ఐదు ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాల్ని సాగు చేస్తే 20 పాడి పశువులకు ఏడాదిపాటు పుష్కలంగా మేతను అందించవచ్చు. ఇందుకోసం రైతులు నీటి సౌకర్యమున్న మూడెకరాల భూమిని ఎంపిక చేసుకొని అందులో ఏపీబీఎన్, కొ1, పారా వంటి ధాన్యపు జాతి, బాస్నర్ వంటి పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసాల్ని సాగుచేస్తే 34 సంవత్సరాలు నిరంతరంగా పశుగ్రాసం లభిస్తుంది. మరో రెండెకరాల తేలికపాటి భూమిలో వర్షాధారంగా ఎస్ఎస్జీ, 593, వంటి ధాన్యపు జాతి, పిల్లిపిసర వంటి పప్పుజాతి ఏకవార్షిక పశుగ్రాసాల్ని మిశ్రమపంటగా సాగు చేయాలి. అలాగే 50 పాడి పశువుల్ని పోషించే రైతులు సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాల్ని సాగుచేయాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల్లో ఎపీబీఎన్1, రెండు ఎకరాల్లో లూసర్న్, మరో మూడెకరాల్లో మొక్కజొన్న లేదా జొన్నలో అలసంద లేదా పిల్లిపిసర కలిపి మిశ్రమ పంటగా సాగుచేస్తే ఏడాది పొడువునా పశుగ్రాసం లభిస్తుంది. జూలైఅక్టోబర్ నెలల్లో సాగు చేయాల్సిన పశుగ్రాసాలు ఇవే... నేపియర్, జొన్న మరియు అలసంద, సజ్జ మరియు జొన్న. అంతర పంటగా పశుగ్రాసాల సాగు వరి తర్వాత అలసంద సాగు చేస్తే భూసారం పెరగడంతో పాటు పశుగ్రాసం లభిస్తుంది. వరి కోసే ముందు జనుము చల్లితే పోలంలోని తేమతో జనుము పెరుగుతుంది. దీర్ఘకాలిక పంటలు పత్తి, చెరుకు లాంటి పంటలను సాగుచేసే వారు అంతర పంటలుగా అలసంద వంటి పశుగ్రాసాల్ని సాగు చేయవచ్చు. జొన్న, వేరుశనగ పంటల్లో అలసంద, పిల్లిపిసర, పసుపు సాగు చేసేవారు అలసంద, గోరు చిక్కుడు సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా చిక్కుడు జాతి పశుగ్రాసం సాగుచేసుకోవచ్చు. తద్వారా నత్రజని వాడకం తగ్గించుకోవచ్చు. -
‘లూసన్’.. లాభాలు చూపెన్
ఘట్కేసర్: పశువులకు మేతగా ఉపయోగపడే లూసన్ గడ్డి సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఓ రైతు.. ఈ గడ్డిని పెంచడానికి అంతగా శ్రమించాల్సిన పని లేదని, నీరు ఎక్కువగా అవసరం లేదని, పెట్టుబడి కూడా తక్కువే అంటున్నాడాయన. ఈ పంటపై చీడపీడలు ఆశించే అవకాశం తక్కువ అని చెబుతున్నాడు రైతు కృష్ణ. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే... గతంలో పాడి పశువులకు లూసన్ గడ్డి వేయడంతో పాల దిగుబడి పెరుగుతుందని గ్రహించాను. దీంతో లూసన్ గడ్డికి కోసం ప్రతి రోజు మార్కెట్ వెళ్లేవాడిని. అక్కడ ఈ గడ్డికి గిరాకీ బాగా ఉండటం చూశా. దానిని సాగు చేస్తే ఎక్కువ ఆదాయం పొందవచ్చని గ్రహించా. దీంతో యంనంపేట్‌లో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని సాగు చేస్తున్నా. లూసన్ గడ్డి విత్తనాలు తెచ్చి వాటిని పొలంలో సాగు చేస్తూ నాలుగు రోజులకోసారి నీళ్లు పెడుతున్నా. కలుపు మొక్కలను ఎప్పటికప్పడు తొలగించాలి. దీనికోసం నలుగురు మహిళా కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.150 కూలి ఇస్తున్నా. కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది కూలీలు అవసరపడుతుంది. ఎకరానికి రూ.25 వేల ఖర్చు.. లూసన్ గడ్డి సాగు చేయడానికి భూమిని సిద్ధం చేయడానికి, ఇతర ఖర్చులు కలిపి ఎకరాకు రూ.25 వేలు ఖర్చవుతుంది. గడ్డి ఏపుగా పెరగడానికి ఎరువులు, క్రిమిసంహారక మందులు వేస్తున్నా. విత్తనాలు వేసిన రెండు నెలల తర్వాత చిన్న కొమ్మలుగా కోసి వాటిని రూ.5 కట్టలు కడుతున్నా. వాటిని మోపులుగా తయారు చేస్తున్నా. ఒక్కో మోపులో 100 వరకు కట్టలు ఉంటా యి. ప్రతి నిత్యం 4 మోపులను నగరానికి తరలిస్తున్నా. నగరంలోని గోశాలలు, పరిశోధన నిమిత్తం వాడే ఎలుకలు, కుందేళ్లకు మేతగా విక్రయిస్తున్నా. ప్రతిరోజు రూ.2 వేలు వస్తున్నాయి. అన్ని ఖర్చులు పోనూ రోజుకు రూ.800 నుంచి రూ. వెయ్యి సంపాదిస్తున్నా. లూసన్ గడ్డిని గుర్రాలు, ఆవులు, కుందేళ్లు, ప్రయోగాలకు ఉపయోగించే ఎలుకలకు మేతగా వేస్తారు. దీంతో అవి ఎక్కువ శక్తిమంతమవుతాయి. పాడి పశువులకు వేస్తే ఎక్కువ పాల దిగుబడి పెరుగుతుంది.