పశుగ్రాసాల సాగు ఇలా...
- మేలి రకం గ్రాసంతోనే పాల దిగుబడి..
- వెన్న శాతం పెరిగే అవకాశం
గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహా సూచనలు
గజ్వేల్: పాడి పోషణలో పశుగ్రాసం కీలకం. ఏడాది పొడువునా గ్రాసం సాగు చేసి పశువులకు మేతగా అందించవచ్చునని గజ్వేల్ మండల పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి (సెల్. 9505056118) చెబుతున్నారు. పశుగ్రాసాల సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలు..డెయిరీ ఫారమ్‌పై ఆధారపడి జీవనోపాధి పొందే రైతులు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడువునా పశువులకు పుష్కలంగా మేలి రకం పశుగ్రాసాలను అందించాలి.
అప్పుడే పోషకాలన్నీ పశువులకు అంది పాల దిగుబడులు, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. అంతేకాకుండా పశువులు జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈని ఏడాదికో దూడను పొందే అవకాశాలుంటాయి. ఐదు ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాల్ని సాగు చేస్తే 20 పాడి పశువులకు ఏడాదిపాటు పుష్కలంగా మేతను అందించవచ్చు. ఇందుకోసం రైతులు నీటి సౌకర్యమున్న మూడెకరాల భూమిని ఎంపిక చేసుకొని అందులో ఏపీబీఎన్, కొ1, పారా వంటి ధాన్యపు జాతి, బాస్నర్ వంటి పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసాల్ని సాగుచేస్తే 34 సంవత్సరాలు నిరంతరంగా పశుగ్రాసం లభిస్తుంది.
మరో రెండెకరాల తేలికపాటి భూమిలో వర్షాధారంగా ఎస్‌ఎస్‌జీ, 593, వంటి ధాన్యపు జాతి, పిల్లిపిసర వంటి పప్పుజాతి ఏకవార్షిక పశుగ్రాసాల్ని మిశ్రమపంటగా సాగు చేయాలి. అలాగే 50 పాడి పశువుల్ని పోషించే రైతులు సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాల్ని సాగుచేయాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల్లో ఎపీబీఎన్1, రెండు ఎకరాల్లో లూసర్న్, మరో మూడెకరాల్లో మొక్కజొన్న లేదా జొన్నలో అలసంద లేదా పిల్లిపిసర కలిపి మిశ్రమ పంటగా సాగుచేస్తే ఏడాది పొడువునా పశుగ్రాసం లభిస్తుంది.
జూలైఅక్టోబర్ నెలల్లో సాగు చేయాల్సిన పశుగ్రాసాలు ఇవే...
నేపియర్, జొన్న మరియు అలసంద, సజ్జ మరియు జొన్న.
అంతర పంటగా పశుగ్రాసాల సాగు
వరి తర్వాత అలసంద సాగు చేస్తే భూసారం పెరగడంతో పాటు పశుగ్రాసం లభిస్తుంది.
వరి కోసే ముందు జనుము చల్లితే పోలంలోని తేమతో జనుము పెరుగుతుంది.
దీర్ఘకాలిక పంటలు పత్తి, చెరుకు లాంటి పంటలను సాగుచేసే వారు అంతర పంటలుగా అలసంద వంటి పశుగ్రాసాల్ని సాగు చేయవచ్చు. జొన్న, వేరుశనగ పంటల్లో అలసంద, పిల్లిపిసర, పసుపు సాగు చేసేవారు అలసంద, గోరు చిక్కుడు సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా చిక్కుడు జాతి పశుగ్రాసం సాగుచేసుకోవచ్చు. తద్వారా నత్రజని వాడకం తగ్గించుకోవచ్చు.