పాడి రైతుకు చీకట్లు | Hugely to the dairy farmer | Sakshi
Sakshi News home page

పాడి రైతుకు చీకట్లు

Published Thu, Feb 4 2016 12:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

పాడి రైతుకు చీకట్లు - Sakshi

పాడి రైతుకు చీకట్లు

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాల సేకరణ ప్రోత్సాహక రాయితీ నిలిపేయడంతో రాష్ట్రంలో పాడి రైతాంగం మళ్లీ ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. రాయితీతో నష్టాల నుంచి గట్టెక్కిన చిన్న డెయిరీలు సంక్షోభంలో పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లీటర్‌కు రూ.4 ప్రోత్సాహక రాయితీ పాడి ఉత్పత్తి పెరగడానికి దోహదం చేసింది. 2014 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆరు మాసాల్లోనే పాల దిగుబడి 46 శాతం పెరిగింది. ఒకటో రెండో గేదెలున్న ప్రతి రైతు అప్పు చేసైనా మరో నాలుగైదు గేదెలు కొని డెయిరీని విస్తరించుకున్నారు. పెద్ద రైతులైతే కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రోత్సాహక రాయితీ వల్ల లాభాల్లో పడ్డామని, పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని ఆశిస్తున్న తరుణంలో రాయితీ నిలిచిపోయిందని వాపోతున్నారు. ఈ తరుణంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆందోళన చేస్తున్నారు. దాదాపు రెండు వేల మంది రైతులు ఈ రాయితీని నమ్ముకుని డెయిరీ వ్యాపారంలోకి దిగారు.

 దూసుకుపోతున్న కర్ణాట
 2011లో కర్ణాటక ప్రభుత్వం లీటర్ పాలకు రూ.2 ప్రోత్సాహక రాయితీ ప్రకటించడంతో అక్కడ పాడి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కర్ణాటక ఇప్పటిదాకా రాయితీ కింద రైతులకు రూ.3,160 కోట్లు చెల్లించింది. రెండేళ్ల క్రితం రాయితీని రూ.4కు పెంచింది. గత ఏడాది కర్ణాటక పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ రోజుకు 70 లక్షల లీటర్లు సేకరిస్తూ రైతులకు రాయితీ కింద  రూ.1,000 కోట్లు చెల్లించింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకు 4.87 లక్షల లీటర్లు సేకరించడానికి కేవలం రూ.60 కోట్లు వ్యయం చేసింది. కర్ణాటకలోని ఒక్క తుముకూర్ జిల్లాలోనే 5.5 లక్షల లీటర్లు సేకరించి రూ.75 కోట్లు ప్రోత్సాహక రాయితీగా ఇచ్చారు. అవసరాలకు మించి పాలు సేకరిస్తున్న ఆ రాష్ట్ర పాడి సంస్థ మిగులు పాలను చెన్నై, గోవా, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు సరఫరా చేస్తోంది. ఇక్కడ డిమాండ్‌కు తగ్గట్టు పాడి ఉత్పత్తి ఉండాలంటే ప్రోత్సాహక రాయితీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రోత్సాహక రాయితీ రద్దు చేస్తే పాడిరైతులు దారుణంగా దెబ్బతింటారని బ్యాంకర్లు సైతం అంటున్నారు.
 
 అప్పుడు సాగు.. ఇప్పుడు పాడి
 బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని పది గేదెలను కొని చిన్నపాటి డెయిరీ ప్రారంభించా. అప్పటికే వ్యవసాయంలో భారీగా నష్టపోయి అప్పులపాలవడంతో ప్రోత్సాహక రాయితీ ప్రకటనతో జీవితంపై ఆశలు చిగురించాయి. సగానికిపైగా భూమిని అమ్ముకుని అప్పులు తీర్చాను. మిగిలిన మొత్తాన్ని డెయిరీ కోసం ఖర్చు చేశా. ఇప్పుడు మళ్లీ తన జీవితంలో ఇలా చీకటి వస్తుందని ఊహించలేదు.
 -కందాల శ్రీనివాస్‌రెడ్డి, ఎదుళ్లగూడెం, వలిగొండ మండలం (నల్లగొండ)
 
 డెయిరీ మూయక తప్పదు
 ప్రభుత్వం ప్రోత్సాహక ధర ఇవ్వడంతో రూ.30 కోట్లతో నా డెయిరీని విస్తరించా. అధిక మొత్తాన్ని బ్యాంక్‌ల నుంచి రుణంగా తీసుకున్నా. ఇప్పుడు ప్రోత్సాహకం లేదంటే నా పరిస్థితి ఏంటి? డెయిరీలో రోజుకు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నా. అలాగే, గేదెలకు గడ్డి కోసం సమీప గ్రామాల్లోని రైతులకు ముందే పెట్టుబడి ఇచ్చా. రాయితీ ఆపేయడంతో నేను డెయిరీని మూయక తప్పదు.
 -పి.సునీల్‌రావు, హన్మాజ్‌పల్లి, లోయర్ మానేరు డ్యామ్ పక్క గ్రామం (కరీంనగర్)
 
 రాయితీ లేకపోతే ఎలా?
 గంపెడాశలతో కోట్లు ఖర్చు చేసి గేదెలను కొన్నా. గ్రామంలోని ఇతర రైతుల భూముల్లో గడ్డి సాగు చేయిస్తున్నా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 150 మందికి ఉపాధి లభిస్తోంది. దాణా, గడ్డికి భారీగా వ్యయమవుతూ లాభాల్లేక మూసుకుంటున్న తరుణంలో ప్రోత్సాహక రాయితీ వరమైంది. ఇప్పుడు పెద్ద రైతులకు రాయితీ లేకపోతే ఎలా?
 -ధరణీపతి రఘు, తిమ్మారెడ్డిపల్లి, పెద్ద అడిసర్లపల్లి మండలం (నల్లగొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement