Dairy production
-
కరువు సీమలో.. పాలవెల్లువ
అనంతపురం రూరల్: ‘అనంత’ కరువుకు చిరునామా. తీవ్ర వర్షాభావంతో దుర్భిక్ష పరిస్థితుల్ని ఎదుర్కొన్న ప్రాంతం. ఏటా నష్టాలతో రైతులంతా కుదేలయ్యారు. చాలామంది పొట్టచేతబట్టుకుని వలస వెళ్లగా...అనంతపురం మండలం కట్టకిందపల్లి గ్రామ రైతులు మాత్రం ప్రత్యామ్నాయం ఆలోచించారు. పంటల సాగును పక్కనపెట్టి పాడిని నమ్ముకున్నారు. ఒకరిని చూసి మరొకరుగా ఊరంతా పశు పోషణపైనే ఆధారపడ్డారు. ఈ గ్రామంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 5 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అనంతపురం నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలుండగా.. 1,300 మంది జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఐదారు గేదెలు కనిపిస్తాయి. 353 కుటుంబాలు (90 శాతం మంది) ప్రత్యక్షంగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారి నుంచి పాలను సేకరించి నగరంలో విక్రయిస్తూ పరోక్షంగా పదుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అనంతపురం జిల్లా కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు దంపతులు జనార్దనరెడ్డి, రాధ. గతంలో వ్యవసాయం చేసేవారు. తీవ్ర వర్షాభావం వల్ల పంట కోసం పెట్టిన పెట్టుబడులు సైతం రాక తీవ్ర అవస్థలు పడేవారు. ఈ పరిస్థితుల్లో పశువుల పెంపకంపై దృష్టి సారించారు. ఐదెకరాల పొలం ఉండటంతో ఎకరం విస్తీర్ణంలో గడ్డి పెంపకం చేపట్టి పశుపోషణ చేశారు. మొదట్లో ఒక గేదెతో ప్రారంభమైన వారి పాల వ్యాపారం.. ఇప్పుడు 8 గేదెలకు పెరిగింది. లీటరు పాలు రూ.50 చొప్పున రోజూ 70 లీటర్లు విక్రయిస్తున్నారు. ‘నెలకు దాదాపు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగులుతోంది. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం’ అని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -జనార్దనరెడ్డి, రాధ మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులు గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల ద్వారా నీరు రాక ఇదే గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పటికే గ్రామంలోని కొందరు పశు పోషణ చేపట్టి రాణిస్తుండటాన్ని చూసి వారూ అదే బాట పట్టారు. తొలుత 8 లీటర్ల పాలతో ప్రారంభమైన వారి వ్యాపారం నేడు 80 లీటర్లు విక్రయించే స్థాయికి చేరింది. ‘వ్యవసాయం చేస్తూనే పశు పోషణ చేపట్టి పాలను విక్రయిస్తున్నాం. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నాం’ అని మధుసూదన్‌రెడ్డి, రేణుక చెప్పారు. సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి కట్టకిందిపల్లి రైతులను మరింత ప్రోత్సహించేందుకు స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్ జిల్లా ములకనూరు డెయిరీ తరహాలో రాప్తాడు నియోజకవర్గంలోను సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. త్వరలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల సభ్యులతో పాలను కొనుగోలు చేయించి పాలకు గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాం పాడిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం 5 గేదెలను పెంచుతున్నాం. పాలను విక్రయించి నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా. – గోపాల్‌రెడ్డి కట్టకిందపల్లి మా గ్రామంలోనే డెయిరీ ఏర్పాటు చేయాలి మా గ్రామంలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేస్తే పాడి రైతులకు మేలు జరుగుతుంది. పశు వైద్యశాల నెలకొల్పడంతో దాణా పంపిణీ చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – నాగలక్ష్మమ్మ, కట్టకిందపల్లి సహకారం అందిస్తాం పాడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలతో పాటు దాణా పంపిణీ చేయడానికి చర్యలు ప్రారంభించాం. గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం తీసుకెళతాం. – డాక్టర్ సన్యాసిరావు, జేడీ, పశు సంవర్ధక శాఖ -
పశుగ్రాసాల సాగు ఇలా...
మేలి రకం గ్రాసంతోనే పాల దిగుబడి.. వెన్న శాతం పెరిగే అవకాశం గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహా సూచనలు గజ్వేల్: పాడి పోషణలో పశుగ్రాసం కీలకం. ఏడాది పొడువునా గ్రాసం సాగు చేసి పశువులకు మేతగా అందించవచ్చునని గజ్వేల్ మండల పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి (సెల్. 9505056118) చెబుతున్నారు. పశుగ్రాసాల సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలు..డెయిరీ ఫారమ్‌పై ఆధారపడి జీవనోపాధి పొందే రైతులు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడువునా పశువులకు పుష్కలంగా మేలి రకం పశుగ్రాసాలను అందించాలి. అప్పుడే పోషకాలన్నీ పశువులకు అంది పాల దిగుబడులు, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. అంతేకాకుండా పశువులు జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈని ఏడాదికో దూడను పొందే అవకాశాలుంటాయి. ఐదు ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాల్ని సాగు చేస్తే 20 పాడి పశువులకు ఏడాదిపాటు పుష్కలంగా మేతను అందించవచ్చు. ఇందుకోసం రైతులు నీటి సౌకర్యమున్న మూడెకరాల భూమిని ఎంపిక చేసుకొని అందులో ఏపీబీఎన్, కొ1, పారా వంటి ధాన్యపు జాతి, బాస్నర్ వంటి పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసాల్ని సాగుచేస్తే 34 సంవత్సరాలు నిరంతరంగా పశుగ్రాసం లభిస్తుంది. మరో రెండెకరాల తేలికపాటి భూమిలో వర్షాధారంగా ఎస్ఎస్జీ, 593, వంటి ధాన్యపు జాతి, పిల్లిపిసర వంటి పప్పుజాతి ఏకవార్షిక పశుగ్రాసాల్ని మిశ్రమపంటగా సాగు చేయాలి. అలాగే 50 పాడి పశువుల్ని పోషించే రైతులు సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాల్ని సాగుచేయాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల్లో ఎపీబీఎన్1, రెండు ఎకరాల్లో లూసర్న్, మరో మూడెకరాల్లో మొక్కజొన్న లేదా జొన్నలో అలసంద లేదా పిల్లిపిసర కలిపి మిశ్రమ పంటగా సాగుచేస్తే ఏడాది పొడువునా పశుగ్రాసం లభిస్తుంది. జూలైఅక్టోబర్ నెలల్లో సాగు చేయాల్సిన పశుగ్రాసాలు ఇవే... నేపియర్, జొన్న మరియు అలసంద, సజ్జ మరియు జొన్న. అంతర పంటగా పశుగ్రాసాల సాగు వరి తర్వాత అలసంద సాగు చేస్తే భూసారం పెరగడంతో పాటు పశుగ్రాసం లభిస్తుంది. వరి కోసే ముందు జనుము చల్లితే పోలంలోని తేమతో జనుము పెరుగుతుంది. దీర్ఘకాలిక పంటలు పత్తి, చెరుకు లాంటి పంటలను సాగుచేసే వారు అంతర పంటలుగా అలసంద వంటి పశుగ్రాసాల్ని సాగు చేయవచ్చు. జొన్న, వేరుశనగ పంటల్లో అలసంద, పిల్లిపిసర, పసుపు సాగు చేసేవారు అలసంద, గోరు చిక్కుడు సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా చిక్కుడు జాతి పశుగ్రాసం సాగుచేసుకోవచ్చు. తద్వారా నత్రజని వాడకం తగ్గించుకోవచ్చు. -
పాడి రైతుకు చీకట్లు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాల సేకరణ ప్రోత్సాహక రాయితీ నిలిపేయడంతో రాష్ట్రంలో పాడి రైతాంగం మళ్లీ ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. రాయితీతో నష్టాల నుంచి గట్టెక్కిన చిన్న డెయిరీలు సంక్షోభంలో పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లీటర్‌కు రూ.4 ప్రోత్సాహక రాయితీ పాడి ఉత్పత్తి పెరగడానికి దోహదం చేసింది. 2014 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆరు మాసాల్లోనే పాల దిగుబడి 46 శాతం పెరిగింది. ఒకటో రెండో గేదెలున్న ప్రతి రైతు అప్పు చేసైనా మరో నాలుగైదు గేదెలు కొని డెయిరీని విస్తరించుకున్నారు. పెద్ద రైతులైతే కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రోత్సాహక రాయితీ వల్ల లాభాల్లో పడ్డామని, పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని ఆశిస్తున్న తరుణంలో రాయితీ నిలిచిపోయిందని వాపోతున్నారు. ఈ తరుణంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆందోళన చేస్తున్నారు. దాదాపు రెండు వేల మంది రైతులు ఈ రాయితీని నమ్ముకుని డెయిరీ వ్యాపారంలోకి దిగారు. దూసుకుపోతున్న కర్ణాటక 2011లో కర్ణాటక ప్రభుత్వం లీటర్ పాలకు రూ.2 ప్రోత్సాహక రాయితీ ప్రకటించడంతో అక్కడ పాడి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కర్ణాటక ఇప్పటిదాకా రాయితీ కింద రైతులకు రూ.3,160 కోట్లు చెల్లించింది. రెండేళ్ల క్రితం రాయితీని రూ.4కు పెంచింది. గత ఏడాది కర్ణాటక పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ రోజుకు 70 లక్షల లీటర్లు సేకరిస్తూ రైతులకు రాయితీ కింద రూ.1,000 కోట్లు చెల్లించింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకు 4.87 లక్షల లీటర్లు సేకరించడానికి కేవలం రూ.60 కోట్లు వ్యయం చేసింది. కర్ణాటకలోని ఒక్క తుముకూర్ జిల్లాలోనే 5.5 లక్షల లీటర్లు సేకరించి రూ.75 కోట్లు ప్రోత్సాహక రాయితీగా ఇచ్చారు. అవసరాలకు మించి పాలు సేకరిస్తున్న ఆ రాష్ట్ర పాడి సంస్థ మిగులు పాలను చెన్నై, గోవా, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు సరఫరా చేస్తోంది. ఇక్కడ డిమాండ్‌కు తగ్గట్టు పాడి ఉత్పత్తి ఉండాలంటే ప్రోత్సాహక రాయితీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రోత్సాహక రాయితీ రద్దు చేస్తే పాడిరైతులు దారుణంగా దెబ్బతింటారని బ్యాంకర్లు సైతం అంటున్నారు. అప్పుడు సాగు.. ఇప్పుడు పాడి బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని పది గేదెలను కొని చిన్నపాటి డెయిరీ ప్రారంభించా. అప్పటికే వ్యవసాయంలో భారీగా నష్టపోయి అప్పులపాలవడంతో ప్రోత్సాహక రాయితీ ప్రకటనతో జీవితంపై ఆశలు చిగురించాయి. సగానికిపైగా భూమిని అమ్ముకుని అప్పులు తీర్చాను. మిగిలిన మొత్తాన్ని డెయిరీ కోసం ఖర్చు చేశా. ఇప్పుడు మళ్లీ తన జీవితంలో ఇలా చీకటి వస్తుందని ఊహించలేదు. -కందాల శ్రీనివాస్‌రెడ్డి, ఎదుళ్లగూడెం, వలిగొండ మండలం (నల్లగొండ) డెయిరీ మూయక తప్పదు ప్రభుత్వం ప్రోత్సాహక ధర ఇవ్వడంతో రూ.30 కోట్లతో నా డెయిరీని విస్తరించా. అధిక మొత్తాన్ని బ్యాంక్‌ల నుంచి రుణంగా తీసుకున్నా. ఇప్పుడు ప్రోత్సాహకం లేదంటే నా పరిస్థితి ఏంటి? డెయిరీలో రోజుకు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నా. అలాగే, గేదెలకు గడ్డి కోసం సమీప గ్రామాల్లోని రైతులకు ముందే పెట్టుబడి ఇచ్చా. రాయితీ ఆపేయడంతో నేను డెయిరీని మూయక తప్పదు. -పి.సునీల్‌రావు, హన్మాజ్పల్లి, లోయర్ మానేరు డ్యామ్ పక్క గ్రామం (కరీంనగర్) రాయితీ లేకపోతే ఎలా? గంపెడాశలతో కోట్లు ఖర్చు చేసి గేదెలను కొన్నా. గ్రామంలోని ఇతర రైతుల భూముల్లో గడ్డి సాగు చేయిస్తున్నా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 150 మందికి ఉపాధి లభిస్తోంది. దాణా, గడ్డికి భారీగా వ్యయమవుతూ లాభాల్లేక మూసుకుంటున్న తరుణంలో ప్రోత్సాహక రాయితీ వరమైంది. ఇప్పుడు పెద్ద రైతులకు రాయితీ లేకపోతే ఎలా? -ధరణీపతి రఘు, తిమ్మారెడ్డిపల్లి, పెద్ద అడిసర్లపల్లి మండలం (నల్లగొండ)