ఒడిశా టు ఆంధ్రా
చింతూరు: ఒడిశా నుంచి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు భారీ ఎత్తున పశువుల రవాణా కొనసాగుతోంది. ఒడిశా నుంచి పశువులను తీసుకొచ్చి చింతూరు మండలం కొత్తపల్లి వద్ద సీలేరు నదిని దాటిస్తున్నారు. అనంతరం అటవీ ప్రాంతం గుండా 10 కి.మీ దూరంలోని తులసిపాక గ్రామానికి తీసుకెళ్లి అక్కడి నుంచి లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం, ఖమ్మం జిల్లా పాల్వంచ సంతల్లో ఈ పశువులను విక్రయిస్తామని వ్యాపారులు చెపుతున్నారు. అయితే గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా పశువుల రవాణా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ చట్టం ప్రకారం ఒక్కో వాహనంలో ఏడు పశువులను మాత్రమే రవాణా చేయాలని, కానీ వ్యాపారులు 20 నుంచి 30 పశువులను తీసుకెళ్తున్నారని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ‘మేం అందరికీ మామూళ్లు ఇస్తున్నాం, మా ఇష్టమొచ్చినట్లు రవాణా చేసుకుంటాం, మీకెందుకు’ అని సమాధానం చెపుతున్నారని, గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పశువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.