రూ.50 అద్దె గదులకు కాషన్ డిపాజిట్ రద్దు
- ఈ నెల 24 నుండి అమలు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గదుల కాషన్ డిపాజిట్‌ను అక్టోబర్ 24 తేదీ సోమవారం నుండి టీటీడీ రద్దు చేయనుంది. రూ.50 నుంచి ఆపై అద్దె గల అన్ని రకాల అద్దె గదులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. సాధారణంగా గదులు కేటాయించే సమయంలోనే గది అద్దెతోపాటు అంతే మొత్తంలో భక్తుల నుంచి కాషన్ డిపాజిట్‌ను టీటీడీ వసూలు చేస్తోంది. ఖాళీ చేసిన తరువాత రీఫండ్ కౌంటర్లలో ఆ కాషన్ డిపాజిట్ భక్తులు తిరిగి పొందుతున్నారు. భక్తులపై పూర్తి విశ్వాసంతో అన్ని రకాల అద్దె గదులకు కాషన్ డిపాజిట్ పద్దతిని రద్దు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా తొలివిడత దాతలకు కేటాయించే గదులకు, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న గదులకు, శ్రీపద్మావతి అతిథి గృహాల సముదాయంలో రిసెప్షన్-1 విభాగం పరిధిలోని ఎక్కువ అద్దె కలిగిన గదులకు మొదటి విడతలో ఈ కాషన్ డిపాజిట్ విధానాన్ని రద్దు చేశారు. తాజాగా రూ.50 ఆపై అద్దె గల గదులకూ ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. గది ఖాళీ చేసిన తర్వాత తాళాలు అక్కడి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తప్పనిసరిగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు.