CBI affidavit
-
SC on Viveka Case : పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ : వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ ఇవ్వాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్వపరాల గురించి అడిగింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు గడువు ముగియడంతో.. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేయలేదు. సునీత ఏం కోరింది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేసిన దర్యాప్తుకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలంటూ పిటిషనర్ సునీత సుప్రీంకోర్టును అడిగింది. పిటిషనర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ వ్యవహారంలో ఈ పరిస్థితుల్లో కేసు డైరీ వివరాలను పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గంగిరెడ్డి లాయర్ ఏం కోరారు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని, ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొన్న సుప్రీం కోర్టు, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఏపీ పోలీసులు ఏం కనుగొన్నారు? సిబిఐ ఏం తేల్చింది? వివేకానందరెడ్డి హత్య 15 మార్చి, 2019న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని కూడా నియమించింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారణ చేసిన నాటి ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తమ నివేదికను CBIకి అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు అప్పటి పోలీసులు ఏమని నివేదించారు? ఇప్పుడు తాజాగా CBI దర్యాప్తులో ఏం కనిపెట్టిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. CBIకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటీ? ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలి నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలి జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలి అనంతరం ఈ కేసులో తర్వాతి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. -
భర్తతో కుట్ర పన్ని, మాజీ భర్తతో కలసి..
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. షీనా హత్యకు మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియా కుట్ర పన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియాతో కలసి కూతురు షీనా హత్యకు కుట్ర చేసిందని సీబీఐ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఇంద్రాణి .. తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి షీనాను హత్య చేసినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా బోరా లవ్ ఎఫైర్‌ను ఇంద్రాణి, పీటర్ వ్యతిరేకించారని, ఆమె హత్యకు కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో పీటర్‌కు బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ కోర్టుకు విన్నవించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, పీటర్‌కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు తెలియజేసింది. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. గతేడాది నవంబర్‌లో పీటర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంద్రాణిని, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను కూడా అరెస్ట్ చేశారు. ఎన్నో మలుపులు తిరిగిన షీనా హత్య కేసులో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం షీనా కాగా, పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్. ఇంద్రాణికి పీటర్ మూడో భర్త. షీనా, రాహుల్ ప్రేమలో పడటాన్ని ఇంద్రాణి, పీటర్ తీవ్రంగా వ్యతిరేకించారు. షీనా హత్యకు ఇంద్రాణి, పీటర్ కుట్రపన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి .. రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి 2012 ఏప్రిల్‌లో షీనాను హత్య చేశారు.