భర్తతో కుట్ర పన్ని, మాజీ భర్తతో కలసి..
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. షీనా హత్యకు మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియా కుట్ర పన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియాతో కలసి కూతురు షీనా హత్యకు కుట్ర చేసిందని సీబీఐ హైకోర్టుకు సమర‍్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఇంద్రాణి .. తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్తో కలసి షీనాను హత్య చేసినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే.
పీటర్ కొడుకు రాహుల్తో షీనా బోరా లవ్ ఎఫైర్ను ఇంద్రాణి, పీటర్ వ్యతిరేకించారని, ఆమె హత్యకు కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో పీటర్కు బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ కోర్టుకు విన్నవించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, పీటర్కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు తెలియజేసింది. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. గతేడాది నవంబర్లో పీటర్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంద్రాణిని, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్లను కూడా అరెస్ట్ చేశారు.
ఎన్నో మలుపులు తిరిగిన షీనా హత్య కేసులో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం షీనా కాగా, పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్. ఇంద్రాణికి పీటర్ మూడో భర్త. షీనా, రాహుల్ ప్రేమలో పడటాన్ని ఇంద్రాణి, పీటర్ తీవ్రంగా వ్యతిరేకించారు. షీనా హత్యకు ఇంద్రాణి, పీటర్ కుట్రపన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి .. రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్తో కలసి 2012 ఏప్రిల్లో షీనాను హత్య చేశారు.