CC Tvs
-
ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే..
ఏవైనా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ఇంటి పక్కనున్న కిరాణా దుకాణానికో లేదా మార్కెట్‌కు వెళుతుంటాం. పెద్ద పట్టణాలు, నగరాల్లో అయితే షాపింగ్ స్టోర్‌కు వెళుతుంటారు. షాపింగ్‌మాల్‌లోకి వెళ్లిన తరువాత మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాక, బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి, క్యాష్ పే చేస్తుంటాం. అయితే దుబాయ్‌లోని ఆ స్టోర్‌లో క్యాషియర్ ఉండరు. అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు. మరి సరుకులు తీసుకున్నాక ఆ స్టోర్‌లో క్యాష్ ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఈలోని దుబాయ్ పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహానగరంలో 2018లో అమెజాన్ కెరెఫోర్ మినీ అనే షాపింగ్ స్టోర్ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా పేరొందింది. ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్‌లోనికి ఎంట్రీ లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్‌లో హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి సెన్సార్‌ను కలిగివుంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి. స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులోప్రత్యక్షమవుతాయి. షాపింగ్ పూర్తయిన తరువాత పేమెంట్ ఆదే ఫోను ద్వారా చేయాల్సివుంటుంది. కెరెఫోర్ సీఈఓ హనీ వీస్ మాట్లాడుతూ భవిష్యత్‌లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్‌లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి.. -
లండన్‌ను వెనక్కినెట్టిన హైదరాబాద్
సాక్షి,హైదరాబాద్ : భాగ్యనగరం ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం మరో విశేషం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కడం, రెండూ ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోవడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్’సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం’’అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. – సాక్షి,హైదరాబాద్ సురక్షిత నగరం బాటలో! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. వివిధ బహుళజాతి, అగ్ర దేశాల వ్యాపార, పరిశోధన సంస్థలు భాగ్యనగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో సురక్షిత నగరంగా పేరొందితే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని భావించారు. 2014లో అమల్లోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లండన్‌ను ఆదర్శంగా తీసుకుని భారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించాయి. ఈ క్రమంలో వీటి ఏర్పాటులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక నగరాల వారీగా చూస్తే చెన్నై మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉండే సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ సైతం నిక్షిప్తం చేయడం మరో ప్రత్యేకత. 10 లక్షల సీసీ కెమెరాలే లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ పోలీసుశాఖ సంకల్పం. ఇప్పటిదాకా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందులో 2020లోనే 99,095 అమర్చాం. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం. గతేడాది 4,490 కేసుల్లో నేరస్థుల్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరించాయి. – డీజీపీ డాక్టర్ ఎం మహేందర్‌రెడ్డి సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. అయితే చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. కాగా... హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. అందువల్లే ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది. దేశంలో ప్రస్తుతం ఏ నగరంలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంటే.. ఢిల్లీ 4,29,500 హైదరాబాద్ 3,25,000 చెన్నై 2,80,000 కోల్‌కతా 13,800 ముంబై 9,800 అçహ్మదాబాద్ 6,281 బెంగళూరు 1,301 కొచ్చి, జైపూర్ 1000 చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్ సంస్థ 130 నగరాలతో జాబితా రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్ ముందున్నాయని సర్వే తెలిపింది. చదరపు కిలోమీటరుకు 657 కెమెరాలతో చెన్నై మొత్తం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 480 కెమెరాలతో హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. సర్వేలో టాప్–10లో చోటు సాధించిన నగరాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌టెన్ నగరాలివే.. నగరం సీసీ కెమెరా (చదరపు 1,000 కిలోమీటరుకు) మందికి 1 చెన్నై 657 25.5 2 హైదరాబాద్ 480 30.0 3 హర్బిన్ (చైనా) 411 39.1 4 లండన్ (బ్రిటన్) 399 67.5 5 గ్జియామెన్ (చైనా) 385 40.3 6 చెంగ్డూ (చైనా) 350 33.9 7 తైయువాన్ (చైనా) 319 119.6 8 ఢిల్లీ 289 14.2 9 కున్మింగ్ (చైనా) 281 45.0 10 బీజింగ్ (చైనా) 278 56.2 -
భద్రత అనుకుంటే.. చుక్కలు చూపించాయి..!
మిస్సిస్సిపి : భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాలు ఓ కుటుంబానికి చుక్కలు చూపించాయి. తమ చిన్నారి కూతుళ్ల రక్షణ కోసం వారి బెడ్రూమ్లో ఏర్పాటు చేసిన రింగ్ సెక్యురిటీ కెమెరాలు ఆ తల్లిదండ్రులకు పీడకలను మిగిల్చాయి. వారం క్రితం జరిగిన ఈ సంఘటన అమెజాన్ కంపెనీకి చెందిన రింగ్ సెక్యురిటీ కెమెరాల్లోని లోపాల్ని బయటపెట్టింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. ఎనిమిదేళ్ల అలీసా మే(8) నిద్రించేందుకు తన గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఏవో వింతైనా శబ్దాలు, మ్యూజిక్ వినపడసాగింది. అయితే, తన చెల్లెల్లు ఆ గదిలోకి చేరి ఆమెను ఆటపట్టిస్తున్నారని తొలుత ఆమె భావించింది. అయితే, కాసేపటి తర్వాత ఆ గదిలో ఓ మగ వ్యక్తి.. ‘హలో ఎవరైనా ఉన్నారా’ అని వినిపించడంతో చిన్నారి ఉలిక్కిపడింది. కానీ, గదిలో ఎవరూ కనిపించడం లేదు. ఆ కనిపించని వ్యక్తి వ్యక్తి జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లైంగికంగా వేధించాడు. తీవ్ర భయాందోళనకు గురైన అలీసా సాయం కోసం తన తల్లి యాష్లీ మేని పిలిచింది. కానీ, ఆమె అందుబాటులో లేదు. తండ్రి కూడా ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అయితే, తన కూతురు రూమ్‌లోని కెమెరా హ్యాక్‌కు గురైందని అలీసా తండ్రికి సమచారం వెళ్లడంతో అతను అలర్ట్ అయ్యాడు. కెమెరా ప్లగ్‌ను తొలగించమని అలీసాకు కాల్ చేసి చెప్పాడు. దీంతో కెమెరా ప్లగ్ తొలగించిన అలీసా ఆ గది నుంచి బయటికొచ్చి తల్లితో విషయమంతా చెప్పింది. చెప్పుకోలేని భాష.. కూతుళ్ల భద్రత కోసం కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే తమకు చేదు అనుభవం ఎదురైందని అలీసా మే తల్లి వాపోయారు. హ్యాకర్ చిన్నారి పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని యాష్లీ వాపోయింది. జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడమే కాకుండా చిన్నారిపై లైంగింక వేధింపులకు దిగాడని ఆరోపించింది. రింగ్ సెక్యురిటీ కెమెరా పనితీరుపై ఆమె విమర్శలు గుప్పించింది. హ్యాకర్ జుగుప్సాకర వ్యాఖ్యలతో కూడిన వీడియోతో పోలీసులను సంప్రదిస్తామని తెలిపింది. రింగ్ కెమెరాల వల్ల ఇటీవల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని యాష్లీ వెల్లడించింది. అయితే, ఇరువైపులా సమాచారం బదిలీ చేసుకోవడం, మాట్లాడుకునే వెసులుబాటు ఉండటంతో ఆఫీస్‌లో ఉన్నప్పుడు తన పిల్లలను మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇక కస్టమర్ల నమ్మకం, భద్రతే తమ ప్రాధాన్య అంశమని, లోపాల్ని సరిచేస్తామని రింగ్ కెమెరా ప్రతినిధులు వెల్లడించారు. -
'ప్రభుత్వ కళాశాలల్లో సీసీ టీవీలు'
రామాయంపేట (మెదక్) : వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ టీవీలతోపాటు బయో మెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్ బోర్డ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) మల్హల్రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అసలు సహించబోమన్నారు. నిర్ణీత వేళలకు అనుగుణంగా సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్ ఫలితాల మెరుగు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. లెక్చరర్ల కొరత అధిగమించడానికి పార్ట్ టైం ఉద్యోగులకు నియమిస్తామన్నారు.