celebratory
-
అర్జెంటీనాపై గెలుపుతో సౌదీలో సంబరాలు.. బుధవారం సెలవు ప్రకటన
రియాద్: ఖతర్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై చారిత్రక విజయం సాధించింది సౌదీ అరేబియా. పటిష్టమైన డిఫెన్స్‌కు తోకముడిచిన మెస్సీ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా జైత్రయాత్రకు సౌదీ బ్రేకులు వేసింది. దీంతో సౌదీలో సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో బుధవారం సెలవు ప్రకటించింది సౌదీ. ఈ చారిత్రక విజయంతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు ఇచ్చింది. సౌదీ జాతీయ జట్టు ఘన విజయం సాధించిన క్రమంలో విక్టరీ హాలీడేను ప్రకటించాలని యువరాజు మొహమ్మెద్ బిన్ సల్మాన్ సూచించారు. ఆయన సూచనకు రాజు సల్మాన్ ఆమోదం తెలిపారు. అన్ని రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు దినంగా ప్రకటించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ఇదీ చదవండి: FIFA WC 2022: ఒక్క ఓటమి.. అరుదైన రికార్డు మిస్ చేసుకున్న అర్జెంటీనా -
పెళ్లికొడుకును కాల్చి చంపారు..
లక్నో: ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో వివాహ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వివాహ వేదికకు వస్తున్న వరుడు అమిత్ రస్తోగి (28)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో మరికొద్ది నిమిషాల్లో బాజా భజంత్రీలతో మార్మోగాల్సిన వివాహ వేడుక కాస్తా బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారిపోయింది. వివరాల్లోకి వెళితే స్థానిక ప్రేమ్ నగర్‌లోని గెస్ట్ హౌస్ బుధవారం పెళ్లి వారితో సందడిగా ఉంది. పెళ్లి బారాత్‌లో పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ తరలి వస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ వరుని తరపు నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక బుల్లెట్ వరుడు అమిత్ తలలోకి దూసుకుపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. పెళ్లికొచ్చిన అతిథులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాగా స్పృహ తప్పిపడిపోయిన అతడిని లక్నోలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అమిత్ మరణించాడని వైద్యులు ధృవీకరించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. హంతకుల ఆచూకీ కోసం పెళ్లి వీడియో ఫుటేజ్‌ను పరిశీస్తున్నారు.