నివాళి
కోడి రామకృష్ణ మరణవార్త యావత్ తెలుగు చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. వంద చిత్రాలకు పైగా తెరకెక్కించిన ఆయన మరణం తీరని లోటు అని çపలువురు చిత్రరంగ ప్రముఖులు పేర్కొన్నారు.
►నాకు అత్యంత ఆత్మీయులు ప్రముఖ దర్శకులు శ్రీకోడిరామకృష్ణగారి మరణం బాధాకరం. తెలుగు సినిమా ఒక మంచి దర్శకుణ్ని కోల్పోయింది. తెరపై ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి దర్శకులు కన్నుమూయడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయనతో నేను కూడా కొన్ని సినిమాలకు పనిచేసే గౌరవం దక్కింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మంచు మోహన్‌బాబు
►శతాధిక చిత్రాల దర్శకునిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించిన సీనియర్ దర్శకులు కోడిరామకృష్ణగారు. భావోద్వేగభరిత చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో కోడిరామకృష్ణగారు ముందు వరుసలో ఉంటారు. అలాగే వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ట్రెండ్‌కు తగ్గట్లు గ్రాఫిక్స్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనతో కలిసి మంగమ్మగారి మనవడు, ముద్దులక్రిష్ణయ్య, ముద్దులమావయ్య, ముద్దులమేనల్లుడు, భారతంలో బాలచంద్రుడు, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు చిత్రాలకు పనిచేశాను. ఇలాంటి గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు.
బాలకృష్ణ
►కోడిరామకృష్ణగారు దర్శకునిగా విభిన్నమైన చిత్రాలతో తనదైన ముద్రవేశారు. నేను ఆయన దర్శకత్వంలో శత్రువు, దేవీపుత్రుడు సినిమాలు చేశాను. శత్రువు సినిమాకు ఆయనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అందరినీ మెప్పించారు. ఎంతో అంకితభావం ఉన్న దర్శకులు. అలాంటి ఓ దర్శకుడిని కోల్పోవడం బాధాకరం. కోడిరామకృష్ణగారు లేని లోటు తీర్చలేనిది.
వెంకటేష్
►కోడిరామకృష్ణగారు కన్నుమూశారనే వార్త నన్నెంతగానో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
శ్రీకాంత్
►వందకుపైగా చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకులు శ్రీ కోడి రామకృష్ణగారు ఇటీవల అస్వస్థతకు లోనయ్యారని తెలిసింది. తిరిగి కోలుకుంటారని అనుకున్నాను. కానీ ఆయన మృతి చెందారని తెలిసిఆవేదనకు లోనయ్యాను. రామకృష్ణగారి తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో అన్నయ్య చిరంజీవి కథానాయకుడు. నాటి నుంచి విభిన్న చిత్రాలు అందించిన ఆయన విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సినిమాలు రూపొందించడంలోనూ తనదైన శైలిని చూపించారు. వారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు.
పవన్ కల్యాణ్
►దర్శకులు కోడిరామకృష్ణగారి మరణవార్త విని కలత చెందాను. తెలుగు చలన చిత్రసీమ ప్రగతికి ఆయనఎంతో కృషి చేశారు. చిత్ర పరిశ్రమ ఆయన్ను ఎప్పటికీ మర్చిపోదు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
మహేశ్‌బాబు
►తెలుగు చలనచిత్ర పరిశ్రమ లెజెండ్‌ని కోల్పోయింది. ఆయనను మిస్ అవుతున్నాం. కోడిరామకృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలి.
ఎన్టీఆర్
►కొత్త దర్శకులకు కోడిరామకృష్ణగారి చిత్రాలు నిఘంటువుల్లా ఉపయోగపడతాయి. అలాంటి ఓ దిగ్దర్శకుడిని కోల్పోవడం తెలుగు సినిమాకు తీరని నష్టం
గోపీచంద్
►మిమ్మల్ని కోల్పోయాము. కానీ మీరు దర్శకత్వం వహించిన అద్భుతమైన చిత్రాలు, మీ సృజనాత్మకత, మీ ప్రతిభ మిమ్మల్ని మాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది.
సీనియర్ నరేశ్
►తెలుగు చిత్రపరిశ్రమకు దర్శకులు కోడిరామకృష్ణ ఒక పిల్లర్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.మా నాన్నగారికి మంచి మిత్రులు. వ్యక్తిగతంగా కూడా మా కుటుంబానికి తీరని లోటు.
అల్లరి నరేశ్
►ఒక లెజండ్ని కోల్పోయాం. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం సార్.
నాని
►కోడి రామకృష్ణగారిలాంటి దర్శకులు అరుదుగా పుడుతుంటారు. తెలుగు చలన చిత్రపరిశ్రమ ఓ గొప్ప దర్శకుణ్ణి కోల్పోయింది. ఆయన మరణవార్త నన్నెంతో బాధించింది.
శర్వానంద్
►కోడిరామకృష్ణగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
నితిన్
►కష్టపడేతత్వానికి, సంచలనాలకి పర్యాయపదం కోడి రామకృష్ణగారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో నేను సంగీత దర్శకునిగా పరిచయం అయ్యాను. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచే ఉంటారు.
దేవిశ్రీప్రసాద్
►సార్.. వంద చిత్రాలకు పైగా చేసిన దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు. ‘మాస్టర్ పీస్’ అనదగ్గ చిత్రాలను అందించారు. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ చాలా నిరాడంబరంగా ఉండేవారు. చాలా డౌన్ టు ఎర్త్. మీరు లేరనే నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. మీరు ఇండస్ట్రీకి చేసిన కృషికి ధన్యవాదాలు. ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలను ఇచ్చారు.
నటి అనుష్క
►‘అంకుశం, అమ్మోరు, అరుంధతి, శత్రువు, పెళ్లి’ చిత్రాల్లో గొప్ప స్క్రీన్ ప్లే ఉంది. మంచి పాత్రలను సృష్టించిన లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణగారు. ఇండియన్ సినిమాకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకం.
దర్శకుడు క్రిష్
►కోడిరామకృష్ణగారి మరణం తీవ్రంగా బాధించింది. ఆయన తీసిన అద్భుతమైన చిత్రాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం.
దర్శకుడు కొరటాల శివ
►కోడి రామకృష్ణగారు సినిమా గ్రంథాలయం. ఓ గొప్ప దర్శకులు ఇక లేరు అని తెలియగానే ఎంతో బాధపడ్డాను.
దర్శకుడు బోయపాటి శ్రీను
►ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఆప్తుడు. నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణగారు ఇక లేరు అనడం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన తెరపై ఎన్నో అద్భుతాలను సృష్టించారు. కోడి రామకృష్ణగారి హఠాన్మరణం నన్ను తీవ్రవేదనకు గురి చేసింది. ఆయన మరణం బాధాకరం.
కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి
►నాకు ఆయన పాలకొల్లులో థియేటర్స్‌లో సినిమా ఆడుతుందని పబ్లిసిటీ ఇస్తూ తిరిగే ఒక వ్యక్తిగా, సినిమాల్లో లైఫ్ ప్రారంభించిన ఒక ఆర్టిస్టుగా, ఆ తర్వాత దాసరి నారాయణరావుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఆ తర్వాత చిరంజీవిగారితో అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడిగా.. ఇలా ఆయన జర్నీ మొత్తం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పాలకొల్లు నుంచి వచ్చినవారిలో ఇటీవల దాసరి నారాయణరావుగారు దూరమయ్యారు. ఇప్పుడు కోడి రామకృష్ణ. బాధపడాల్సిన విషయం ఇది. వారి సతీమణి పద్మగారు నాకు బాగా తెలుసు. ఇక లాభం లేదని మొన్న డాక్టర్స్ నాతో చెప్పినప్పుడు ఆమెతో చెప్పలేక వారి అమ్మాయిలకు చెప్పాను నేను. ఆ మంచి మనిషి ఇప్పుడు లేడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
అల్లు అరవింద్
►దర్శకులు కోడిరామకృష్ణ ఇండస్ట్రీలో అందరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా, కలుపుగోలుగా ఉండేవారు. ఏ పనిలో అయినా ముందుండి ఉత్సాహంతో చురుగ్గా పాల్గొనేవారు. నాకు ఆత్మీయులు. మా దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో ‘దొంగాట’ లాంటి శతదినోత్సవ చిత్రాన్ని అందించారు. నేను ఎప్పుడు కలిసినా ‘ఏం డైరెక్టర్‌గారూ అనగానే... చంపేద్దాం గురువుగారు’ అనేవారు. వ్యక్తిగతంగా మంచి మిత్రుణ్ణి కోల్పోయాను.
ప్రముఖ నిర్మాత, నిర్మాత మండలి అధ్యక్షులు కేఎల్ నారాయణ
►పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు. ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు కోడి రామకృష్ణగారు. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
నిర్మాత కేఎస్ రామారావు
►నా చిన్న గురువుగారిని, పెద్ద అన్నయ్యని, రక్తానికి అందని అనుబంధాన్ని పోగొట్టుకున్నాను, ఇక ఆ దేవుడిలోనే కోడి రామకృష్ణను చూసుకుంటాను.
రచయిత తోటపల్లి మధు
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఆ మాట అంటుంటే బాధగా ఉంది
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణగారు ఇక లేరు అన్న మాట విన్నప్పుడు హృదయం కలచి వేసింది. ఇది నిజమా? కాదా? అనే సందిగ్ధం. నిజమే అని తెలుసుకుని చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా ఇద్దరి పరిచయం ఈనాటి కాదు. దాదాపు 38 ఏళ్ల నాటి పరిచయం. నిన్న మొన్నటివరకు మా ఇంట్లో ఏ శుభకార్యం జరగినా సరే సెల్ఫోన్లో సంక్షిప్త సందేశాలతో శుభాకాంక్షలు తెలియజేస్తుండేవారు. అలాగే వారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నేనూ అలాగే చేసేవాడిని. అలా ఇప్పటికీ మా మధ్య చక్కని స్నేహం కొనసాగుతోంది. ఆయన మొదటి సినిమా ‘ఇంట్లోరామయ్య.. వీధిలో క్రిష్ణయ్య’ నాతోనే. ఆ సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నాను. అప్పుడు ఓ కుటుంబ కథాచిత్రం చేద్దామని నిర్మాత కె. రాఘవ నా దగ్గరకు వచ్చినప్పుడు మొదట చేయలేను అని చెప్పాను.
నేను చిరంజీవిగారిని కన్విన్స్ చేసుకుంటానని కోడి రామకృష్ణగారు మా ఇంటికి వచ్చారు. కథ చెప్పారు. బాగా నచ్చింది. ఈ సినిమా వదులుకోకూడదని, చేస్తున్నామని అప్పటికప్పుడే ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన చాలా సంతోషించారు. దాదాపు 500 రోజులు ఆడిన సినిమాగా ఆ సినిమా నాకో అరుదైన రికార్డుని తీసుకువచ్చింది. అలా ఆ సినిమాతో మా ఇద్దరి అనుబంధం ఆరంభమైంది. ఆ తర్వాత ‘అంజి’ వరకూ ఐదారు సినిమాలకు పైన చేయడం జరిగింది నాతోనే కాదు ఆయన ఎవరితో సినిమాలు చేసిని డిఫరెంట్ జోనర్లో చేస్తుండేవారు. ‘గూఢచారి నం 1’ లాంటి జేమ్స్‌బాండ్ సినిమా దగ్గర్నుంచి, విప్లవాత్మక సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, గ్రాఫిక్స్ సినిమాలు, భక్తి సినిమాలు చేసి వావ్ అనిపించారు. దాసరి నారాయణరావుగారి తర్వాత అన్ని సినిమాలు చేసిన అరుదైన రికార్డు ఆయనది.
దాసరిగారికి దరిదాపుల్లో నేనూ ఉన్నాను అంటూ రామకృష్ణగారు దాదాపు 125పైగా చిత్రాలు చేసి ఆయన తన సత్తాను చాటుకున్నారు. దాసరిగారు గర్వించే శిష్యుల్లో ఒకరిగా ఉండటం ఒక గొప్ప ఘనత. ఆయనకు ఎప్పుడు పని.. పని.. పని. తలకు ఆ రుమాలు కట్టినప్పటినుంచి తీసేవరకు పని తప్ప ఆయనకు వేరే ధ్యాస ఉండదు. పని తప్ప వేరే ధ్యాస లేని దర్శకుడు కాబట్టే ఈ రోజు మనమందరం గొప్పగా చెప్పుకుంటున్నాం. నేను హిందీ పరిశ్రమలో ప్రవేశించాలనుకున్నప్పుడు... ఏదైనా రీమేక్ చేస్తే బాగుండు అనిపించింది. అలాంటి సమయంలో నాకు తోచిన సినిమా ‘అంకుశం’. అది నాకు చాలా ఇష్టమైన సినిమా. పవర్ఫుల్ స్టోరీ. అదే ‘ప్రతిబంద్’గా చేశాం. నాకు మంచి పేరు వచ్చింది.
ఆయనతో నా ప్రతి సినిమా ఓ అనుభూతి. కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ఆయనకు పెళ్లికాక ముందు తన లవ్‌స్టోరీ కోసం ‘మీ సలహాలు కావాలని అడిగేవారు’. ‘ఆలయ శిఖరం’ సినిమా టైమ్‌లో పద్మగారిని లవ్ చేస్తున్న విషయం చెప్పారు. ఆ మధ్య కాలంలో కోడి రామకృష్ణగారిని ఓ ఫంక్షన్లో చూసినప్పుడు... సరిగా నడవ లేకుండా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలకపోవడం చాలా సంతోషం కలిగించింది. ఎప్పుడూ ఆయనకు ఉండే ఊతపదం... ‘చంపేద్దాం గురువుగారు’. ఇప్పుడు ఆ మాట అంటుంటే బాధగా ఉంది. ఆయన ఇక లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
చిరంజీవి