అనారోగ్యంతో ముంబైలో తుదిశ్వాస విడిచిన దేవరా
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి మురళీ దేవరా సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల దేవరా సోమవారం తెల్లవారుజామున 3.25 నిమిషాల సమయంలో ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ముంబైలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉంచారు. అనంతరం దేవరా భౌతికకాయాన్ని చందన్‌వాడి శ్మశాన వాటికకు భారీ ఊరేగింపుతో తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
రాజకీయ ప్రస్థానం: మహారాష్ట్రకు చెందిన మురళీ దేవరాకు భార్య హేమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు మిలింద్ దేవరా ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడైన దేవరా 1968లో బీఎంసీ ఎన్నికల్లో గెలిచి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1977 నుంచి ఏడాది పాటు ముంబై మేయర్‌గా పనిచేశారు. 1982-85 మధ్య మహారాష్ట్ర విధాన మండలి సభ్యునిగా, 1985 నుంచి నాలుగుసార్లు ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు గెలుపొందారు. తర్వాత ఆయన కుమారుడు మిలింద్ దేవరా ఈ స్థానం నుంచి గెలుపొం దారు. మురళీ దేవరా ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా22 ఏళ్లు పనిచేశారు. దేవరా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకివిశ్వాసపాత్రుడు.
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సన్నిహిత సంబంధాలున్న దేవరా.. కాంగ్రెస్ పార్టీకి నిధుల సమీకరణలోనూ కీలకపాత్ర పోషించారు. యూపీఏ హయాంలో పెట్రోలియం, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను దేవరా నిర్వహించారు. ప్రస్తుతం మూడోసారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. దేశంలో ఎక్కువ కాలం పెట్రోలియం మంత్రిగా పనిచేసిన ఘనత దేవరాదే. 2011లో మురళీని కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించి ఆయన కుమారుడు మిలింద్‌కు కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టింది.
ప్రముఖుల నివాళి
మురళీ దేవరా మృతికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేవరా తనకు ఆప్తమిత్రుడని, దేశం గొప్ప నాయకుడిని, సామాజిక కార్యకర్తను కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మురళీ దేవరా మరణవార్త విచారకరమని ప్రధాని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్‌వాద్రా ముంబై చేరుకుని దేవరా భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. మురళీ దేవరా ముంబైలో కాంగ్రెస్ పార్టీకి చిహ్నంగా నిలిచారన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, పియూష్‌గోయల్, పాస్వాన్, కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, మోతీలాల్‌వోరా, ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్, దిగ్విజయ్‌సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తదితరులు సంతాపం తెలిపారు.
పార్లమెంట్ సంతాపం.. అనంతరం వాయిదా
మురళీ దేవరా మృతికి పార్లమెంట్ ఉభయసభలు సోమవారం సంతాపం తెలిపాయి. దేవరాతో పాటు లోక్‌సభలో సిట్టింగ్ ఎంపీలు హేమేంద్ర చంద్ర సింగ్ (బీజేడీ), కపిల్ కృష్ణ (టీఎంసీ)తో పాటు మాజీ సభ్యులు అమితావా నేండీ, ఎంఎస్ సంజీవరావు, అవైధ్యనాథ్, సైఫుద్దీన్ చౌధురీ, సంజయ్ సింగ్ చౌహాన్ మృతికి సభ్యులుసంతాపం తెలిపారు. హుద్‌హుద్ తుపాను, జమ్మూ కశ్మీర్ వరదలు, పట్న దసరా ఉత్సవాల్లో తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు సభ్యులు సంతాపం తెలిపారు. తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సభ్యులు రంజనీబెన్ భట్ (వడోదర), ప్రీతం గోపీనాథ్ ముండే (బీడ్), ఎస్‌పీసభ్యుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (మెయిన్‌పురి) ప్రమాణం స్వీకారం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేసాక లోక్‌సభ వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ హమీద్ అన్సారీ మురళీ దేవరా మృతి విషయం సభకు తెలిపి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
మురళీ దేవరా కన్నుమూత
Published Tue, Nov 25 2014 1:06 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement
Advertisement