కరెంట్ పోతే సిగ్నల్ కట్
ఉట్నూర్ : ఎక్కడైనా.. ఎప్పుడైనా మనం సెల్ఫోన్లో మాట్లాడుతుంటే మళ్లీ మనం కట్ చేసే వరకూ కాల్ నడుస్తూనే ఉంటుంది. కానీ.. ఏజెన్సీ పరిధిలో పరిస్థితి భిన్నం. సెల్ఫోన్లో మాట్లాడుతుండగా కరెంటు పోయిందంటే చాలు కాల్ కట్ కావడమే. ఇలా ఇరవై రోజులుగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ బాధలు భరించలేక వినియోగదారులు తమ సర్వీసులను మార్చుకుంటున్నారు. ఇప్పటికే 7,200 మంది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు వేరే సర్వీసుల వైపు మళ్లారని ప్రాంచేజ్ నిర్వాహకులు తెలిపారు.
కరెంట్ పోతే సెల్ కాల్ కట్టే..
ఏజెన్సీ కేంద్రంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ సర్కిల్లో 19 టవర్లున్నాయి. నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలు ఈ సర్కిల్‌లోకి వస్తాయి. వీటి కింద బీర్సాయిపేట, ఉట్నూర్ లక్ష్మీలాడ్జ్, ఆర్డీవో కార్యాలయం, బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం, ఎక్స్‌రోడ్డు, ఉషెగాం, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, జామిని, తాడిహత్నుర్, నార్నూర్, దాబా-కె, నార్నూర్, గాదిగూడ, పులిమడుగు, ఇంద్రవెల్లి, వడ్గాం, ధన్నోర (బీ), పంగిడి ప్రాంతాల్లో సెల్‌సిగ్నల్ టవర్లున్నాయి. అవీకాక హస్నాపూర్, లోకారి, ముత్నుర్, కోలామా, చిమన్‌గూడి ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. 20 రోజులుగా సెల్ సిగ్నల్స్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉట్నూర్ మండలంలో కరెంట్ పోయిందంటే సెల్కాల్ మాట్లాడుతుండగానే సిగ్నల్స్ కట్ అవుతున్నాయి. మళ్లీ కరెంట్ వచ్చే వరకూ వారి సెల్ఫోన్లు మూగబోతున్నాయి.
పనిచేయని బ్యాటరీ బ్యాకప్‌లు..
ఉట్నూర్ సర్కిల్ పరిధిలోని పలు టవర్లకు బ్యాకప్ బ్యాటరీలు ఉన్నా.. పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. లక్ష్మీలాడ్జ్ టవర్ వద్ద ఉన్న జనరేటర్ చెడిపోయినా మరమ్మతులు చేయించేవారు లేరు. దీంతో బ్యాటరీలు అరగంటకు మించి పనిచేయడం లేదు. జనరేటర్ చెడిపోయి కరెంటు పోగానే కాల్ కట్ అవుతోంది. అదీకాక కరెంట్ గంటల తరబడి పోతుండటంతో టవర్లకు సరిపడా డీజిల్ అందకుండా పోతోంది. సర్కిల్లోని లింగాపూర్, పులిమడుగు, గాదిగూడ, దాబా-కే, వడ్గాం, ఇంద్రవెల్లి, లక్ష్మీలాడ్జ్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గల టవర్లకు రెండు రోజులకు 300 లీటర్ల డీజిల్ పోయాల్సి వస్తోందని, ఆ భారం మోయలేకుండా ఉన్నామని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఫలితంగా వినియోగదారులు తమ నెట్‌వర్క్‌లను మార్చుకుంటున్నారు.
రోజుకు రూ.50 వేల బిజినెస్ కావడం లేదు..
ఇరవై రోజులుగా బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. కరెంటు పోయిందంటే ఫోన్లు మూగబోతున్నాయి. ఒకప్పుడు రోజుకు ప్రాంచేజ్‌లో రూ.2 లక్షల బిజినెస్ అయ్యేది. ఇప్పుడు రోజుకు రూ.50 వేలు కూడా కావడం లేదు. తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
- సయ్యద్ మాజీద్ అలీ, బీఎస్ఎన్ఎల్ ప్రాంచేజ్ నిర్వాహకుడు ఉట్నూర్