Cell Phone Video
-
యువతిని వీడియో తీస్తూ చిక్కాడు
హైదరాబాద్: ఆటోలో ప్రయాణిస్తున్న యువతిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడో యువకుడు. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఎస్సై క్రాంతికుమార్ కథనం ప్రకారం... భాగ్యనగర్‌కాలనీకి వెళ్లేందుకు ఓ యువతి ఎల్లమ్మబండలో ఆటో ఎక్కింది. అదే ఆటో ఎక్కిన మెదక్ జిల్లాకు చెందిన వీరాస్వామి (25) తన సెల్‌ఫోన్ ద్వారా ఆమెను వీడియో తీయడం మొదలెట్టాడు. గమనించిన ఆటో డ్రైవర్ యువతికి విషయం చెప్పడంతో వీరాస్వామిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. -
కుమారుడి కళ్లెదుటే తల్లిపై సామూహిక అత్యాచారం
బెంగళూరులో కీచక పర్వం బెంగళూరు: బెంగళూరులో పద్నాలుగేళ్ల కుమారుడి ఎదురుగానే అతడి తల్లి(35)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ తతంగాన్ని నిందితులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ప్రధాన నిందితుడికి సదరు మహిళతో విభేదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భర్తకు దూరమైన మహిళ తన కుమారుడితో కలసి హెచ్ఎస్ఆర్ లేఔట్ పరిధిలోని నాయకనహళ్లిలో ఉంటోంది. ఈ నెల 6న అర్ధరాత్రి స్థానిక జిల్లా పంచాయతీ సభ్యుడైన సంతోష్‌రెడ్డి, అతడి అనుచరులు బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారం చేశారు. ఆమె కుమారుడిని బంధించి అతడి కళ్లెదుటే రాక్షసంగా వ్యవహరించారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే సెల్‌ఫోన్‌లోని వీడియోను అందరికీ చూపిస్తామని బెదిరించారు. మొదట్లో భయపడిన బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. చివరకు స్నేహితులు అండగా నిలవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సంతోష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా సంతోష్‌రెడ్డి వాదన మరోలా ఉంది. సదరు మహిళ తమ బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, దీనివల్ల వారి కుటుంబంలో కలతలు చెలరేగాయని చెప్పాడు. ఈ విషయమై ప్రశ్నించడానికి మాత్రమే ఆమె ఇంటికి వెళ్లామని తెలిపాడు. -
మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
హైదరాబాద్: బాత్రూమ్లో స్నానం చేస్తున్న మహిళను వీడియో తీసిన ప్రబుద్ధుడ్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సయ్యద్‌నగర్‌లో నివసించే రవూఫ్ (31) ఎలక్ట్రీషియన్. మంగళవారం అతను బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓ అపార్ట్మెంట్లో పని చేసేందుకు వెళ్లాడు. పని చేస్తూ అదే అపార్ట్మెంట్లోని బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళ (24)ను దొంగచాటుగా తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తున్నాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన మరో మహిళ ఈ విషయం గమనించి చుట్టపక్కల వారిని అప్రమత్తం చేయగా రవూఫ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితున్ని బుధవారం అరెస్టు చేశారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.