central board of excise and customs
-
బంగారం దిగుమతి టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి టారిఫ్ విలువను 10 గ్రాములకు 385 డాలర్ల నుంచి 388 డాలర్లకు పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా వెండికి సంబంధించి ఈ విలువను కేజీకి 543 డాలర్ల నుంచి 524 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సీబీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు (అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ టారిఫ్ విలువను సమీక్షించి, మార్పులపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. -
బంగారం ధర మరింత దిగొచ్చే చాన్స్
న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతి టారిఫ్ విలువలను ప్రభుత్వం తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో వీటి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారం వరకూ 458 డాలర్లుగా ఉన్న 10 గ్రాముల బంగారం దిగుమతి టారిఫ్ విలువను తాజాగా 432 డాలర్లకు(26 డాలర్లు) తగ్గించింది. ప్రతీ పదిహేను రోజులకొకసారి ప్రభుత్వం దిగుమతి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది. దీని ఆధారంగా కస్టమ్స్ సుంకాన్ని (ప్రస్తుతం 10 శాతం) వసూలు చేస్తారు. ఇక వెండి దిగుమతి టారిఫ్ విలువను కేజీకి 783 డాలర్ల నుంచి 736 డాలర్లకు తగ్గించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రెండింటితో పాటు మరికొన్ని వస్తువుల దిగుమతి టారిఫ్‌లను కూడా సీఈబీసీ తగ్గించింది. ముడి పామాయిల్ దిగుమతి టారిఫ్ విలువను టన్నుకు 833 డాలర్ల నుంచి 827 డాలర్లకు, బ్రాస్ స్క్రాప్‌కు టన్నుకు 3,748 డాలర్ల నుంచి 3,717 డాలర్లకు తగ్గించింది. ఇక ముడి సోయాబిన్ ఆయిల్ దిగుమతి టారిఫ్ విలువను టన్నుకు 951 డాలర్ల నుంచి 963 డాలర్లకు, ఆర్బీడీ పామోలిన్ విలువను టన్నుకు 882 డాలర్ల నుంచి 883 డాలర్లకు పెంచింది. గత వారంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1.7 శాతం తగ్గి 1,308.6 డాలర్ల వద్ద ముగిసింది. న్యూఢిల్లీలో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.30,300కు చేరింది. తాజాగా బంగారం దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు ఫలితంగా పుత్తడి ధర సుమారుగా రూ.165 తగ్గవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ధర రూ. 300 తగ్గింది. దీంతో నేడు 10 గ్రాముల బంగారం ధర కనీసం రూ. 460 తగ్గొచ్చని అంచనా. -
రూ.1,27,897 కోట్లు వివాదాలతో ఆగిపోయిన రాబడి!
న్యూఢిల్లీ: వివిధ విభాగాల్లో అప్పీళ్లు, వివాదాల కారణంగా 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1.27 లక్షల కోట్ల సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్‌ల రూపంలోని రాబడి వాస్తవరూపం దాల్చలేదని కాగ్ నివేదిక ఒకటి ఈ విషయం స్పష్టం చేసింది. మొత్తం రూ.1,27,897.39 కోట్ల పెండింగ్ రాబడిలో సర్వీసు ట్యాక్స్ పద్దులో రూ.73,274.74 కోట్లు ఉండగా, 54,172.65 కోట్లు ఎక్సైజ్ సుంకం కింద ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం కేసులు వివిధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులోని రూ.15,663.69 కోట్ల (29%) మొత్తానికి సంబంధించిన కేసులు ఆ సంస్థ అధీకృత అధికారుల వద్ద ఉన్నాయి. ఇక 53% రాబడికి సంబంధించిన కేసులు కోర్టుల్లో ఉండగా, మిగతా మొత్తానికి అప్పీళ్ల కమిషనర్లు, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.