Central Economic Intelligence Bureau
-
రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్
న్యూఢిల్లీ: రుణాలు కోరుకునే వారికి సంబంధించి పూర్వపు ధ్రువీకరణ వివరాలతో ఒక పోర్టల్‌ను సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ) ప్రారంభించింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంక్‌లు సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కావాల్సిన సమాచారాన్ని ఇది అందిస్తుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. అతిపెద్ద బ్యాంక్ మోసాలకు సంబంధించి 2015 మే 13, 2019 నవంబర్ 6న ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల మేరకు.. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) రూ.50 కోట్లకు మించిన రుణాన్ని కొత్తగా మంజూరు చేసే ముందు, లేదా అప్పటికే ఎన్పీఏగా మారిన రుణ గ్రహీత విషయంలో సీఈఐబీ నుంచి నివేదిక కోరాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్బీఐ సహకారంతో సీఈఐబీ రూపొందించిన పోర్టల్ ఇప్పుడు బ్యాంక్‌ల పని సులభతరం చేయనుంది. పెద్ద రుణాలకు సంబంధించి సీఈఐబీ అనుమతిని ఈ పోర్టల్ ద్వారా బ్యాంక్‌లు పొందే అవకాశం ఏర్పడింది. -
సీఈఐబీకి ఆర్బీఐ బ్యాంకుల తనిఖీ వివరాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ను నిరోధించేందుకు, బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘనను కట్టడి చేసే దిశగా బ్యాంకుల తనిఖీల నివేదికల వివరాలను సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ)కి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి సీఈఐబీ, ఆర్బీఐ త్వరలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. సీఈఐబీ.. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఈఐసీ)తో సమావేశాల్లో అనేక మార్లు ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ.. చట్టపరమైన ఆటంకాల పేరుతో తనిఖీ నివేదికల వివరాలు సీఈఐబీకి ఇచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో ఈ అంశం న్యాయ శాఖ వద్దకు చేరింది. బ్యాంకుల తనిఖీల నివేదికల వివరాలను సీఈఐబీ వంటి ఏజెన్సీలకు ఇచ్చే విషయంలో ఆర్బీఐని నిరోధించే నిబంధనలేమీ లేవని న్యాయశాఖ తేల్చి చెప్పింది.